సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఫెర్టిలైజర్స్ సిటీగా జాతీయ స్థాయిలో పేరొందిన కాకినాడ నగరం మరో కొత్త ఆవిష్కరణకు వేదిక కాబోతోంది. ఇకపై నానో ఎరువుల ఉత్పత్తికి సైతం కేంద్ర బిందువు కాబోతోంది. కోరమాండల్ ఎరువుల కర్మాగారం ఈ దిశగా అడుగులు వేస్తోంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌సీఎల్) ఏర్పాటుతో దేశవ్యాప్తంగా ఫెర్టిలైజర్స్ సిటీగా కాకినాడ పేరొందింది.
అనంతరం తమిళనాడుకు చెందిన మురుగప్ప గ్రూపు కాకినాడ జీఎఫ్‌సీఎల్‌ను టేకోవర్ చేసి కోరమాండల్ ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో ప్లాంట్‌ను విస్తరించడంతోపాటు నానో ఎరువులను ఉత్పత్తి చేసేందుకు కోరమాండల్ ముందుకొచ్చింది.
3 లక్షల టన్నుల నుంచి 30 లక్షల టన్నులకు..
ఏటా 3 లక్షల టన్నుల డీఏపీ ఉత్పత్తి సామర్థ్యంతో 1988లో ఈ పరిశ్రమను కోరమాండల్ ప్రారంభించింది. దశలవారీగా పెంచుతూ ప్రస్తుతం ఏటా 20.50 లక్షల టన్నుల డీఏపీ, పొటా‹Ù, ఇతర ఎరువులను ఉత్పత్తి చేస్తోంది. ఇకపై ఏటా ఉత్పత్తిని 30 లక్షల టన్నులకు విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. నానో ద్రవ రూప ఎరువులను ఏటా 30 వేల కిలోలీటర్లు మేర ఉత్పత్తి చేయాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ఎరువుల దిగుమతిని తగ్గించి స్వయం సమృద్ధి సాధించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేస్తోంది.
ఈ నేపథ్యంలో కాకినాడ వాకలపూడిలోని కోరమాండల్ ప్లాంట్‌ను రూ.710 కోట్లతో విస్తరించేందుకు కోరమాండల్ ప్రతిపాదించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పటికే పూర్తయ్యింది. నానో ఎరువులు, ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న ఎరువుల సామర్థ్యం పెంపు తదితర అంశాలపై ప్రజల అభిప్రాయాలను కాలుష్య నియంత్రణ మండలి సేకరించింది. ఇప్పుడున్న 4.80 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ఉత్పత్తితో కలిపి 12 మెగావాట్ల క్యాప్టివ్ వపర్ ప్లాంట్‌ను కూడా ప్రతిపాదించారు.
బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా విస్తరణ ప్లాంట్‌లో ఉపాధి అవకాశాలలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ప్లాంట్ విస్తరణకు అన్ని అనుమతులు వచ్చేసరికి నాలుగైదు నెలల సమయం పడుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే నానో డీఏపీ, ఇతర ఎరువుల ఉత్పత్తిని వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు.
నానో డీఏపీతో తగ్గనున్న ఖర్చు
రైతులు గుళికల రూపంలో ఉండే ఎరువులను వ్యవసాయ క్షేత్రాల్లో చల్లుతున్నారు. ఆ ఎరువులు నీటిలో కరిగిపోయి భూమి ద్వారా మొక్కలకు పోషకాలను అందిస్తాయి. ఒక బస్తా డీఏపీ ఉత్పత్తికి సుమారు రూ.3,200 ఖర్చవుతోంది. డీఏపీపై కేంద్రం ఒక్కో బస్తాపై రూ.2 వేల సబ్సిడీ ఇస్తోంది. రైతు బస్తా రూ.1,200కు కొనుగోలు చేస్తున్నాడు. అదే బస్తా డీఏపీ బదులుగా ఒక లీటరు నానో డీఏపీ సరిపోతుంది.
దీని ఉత్పత్తి వ్యయం రూ.700 నుంచి రూ.800 అవుతుంది. డ్రోన్ ద్వారా కూడా దీనిని పొలాల్లో నేరుగా పిచికారీ చేసుకోవచ్చు. నానో ఎరువులు పర్యావరణానికి పూర్తిగా అనుకూలం. ద్రావణం నేరుగా మొక్క కాండానికి చేరుతుంది. భూమిలోని వానపాములు చనిపోవు. రైతుకు భారం తగ్గుతుంది.
నానో ఎరువు అద్భుతమైన అవకాశం
నానో ఫెర్టిలైజర్ అనేది సుస్థిరమైన వ్యవసాయ విధానాలలో అద్భుతమైన అవకాశం. కోరమాండల్ ఇంటర్నేషనల్ పరిశోధన కేంద్రం, ఐఐటీ ముంబై సహకారంతో నానో సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. 2024 ప్రథమార్థంలో నానో డీఏపీ అందుబాటులోకి వస్తుంది.
– సాయిభాస్కర్, సాంకేతిక సలహాదారు, కోరమాండల్ ఇంటర్నేషనల్
కేంద్రానికి నివేదిక పంపించాం
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫ్యాక్టరీ విస్తరణకు ప్రతిపాదనలు వచ్చాయి. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ నెలలోనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాం. ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నుంచి వచ్చి న విజ్ఞాపనలను పరిశీలించాం. ప్రజాభిప్రాయాలను క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాం. – కృతికా శుక్లా, కలెక్టర్, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment