ఘటనా స్థలంలో వైద్యసిబ్బందితో చర్చిస్తున్న ఎమ్మెల్యే సింహాద్రి - మృతదేహన్ని తీసుకెళ్తున ప్రత్యేక సిబ్బంది
‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు’ సమాజంలో చోటుచేసుకుంటున్న ఘటనలపై ఓ రచయిత వేదన.. ఓ వ్యక్తి కరోనా వైరస్‌తో మృతి చెందినట్లు భావించి శవాన్ని దహన సంస్కారాలు చేసేందుకు బంధువులు కూడా ముందుకురాని ఘటన నాగాయలంకలో గురువారం చోటుచేసుకుంది.
నాగాయలంక(అవనిగడ్డ): నాగాయలంకలో తొలి కరోనా మృతి గురువారం ఉదయం సంభవించింది. స్థానిక వెలుగు కార్యాలయం సమీపంలో కరకట్ట వద్ద నివాసం ఉండే 42 ఏళ్ళ యువకుడు గురువారం తెల్లవారు జామున మృతి చెందాడు. కరోనాతో మృతి చెంది ఉంటాడనే అనుమానంతో కుటుంబ సభ్యులు ఎవరూ మృతదేహం వద్దకు రాలేదు. తెల్లవారుజామున 2గంటల సమయంలో మరణించి ఉంటాడని భావిస్తున్నారు. వస్త్ర దుకాణాలకు ఇతర ప్రాంతాల నుంచి సరుకు తీసుకొస్తుంటాడు. వస్త్ర దుకాణాలలో పనిచేసే వారికి చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు మూడు రోజుల కిందట నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాడు. కాని ఇంత వరకు నివేదిక రాలేదని బంధువులు చెబుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నడని తెలిసిన వెంటనే అద్దె ఇంటి యజమాని ఖాళీ చేయించాడు. దీంతో కట్ట మీద అతడి తల్లి నివసించే ఇంట్లో అతడితో పాటు భార్య, కుమార్తె కలసి ఉంటున్నారు. తెల్లవారుజామున చనిపోవడంతో బంధువులు అటువైపు రాలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. (మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్న వాడు)
విజయవాడ నుంచి ప్రత్యేక సిబ్బంది రాకతో..
ఎమ్మెల్యే బంధువులకు నచ్చజెప్పినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో విజయవాడ నుంచి ప్రత్యేక సిబ్బందిని రప్పించారు. అక్కడ నుంచి ఇద్దరు సిబ్బందితో పాటు సామాజిక కార్యకర్తలు తలశిల రఘుశేఖర్, కనిగంటి వెంకట నారాయణ, ఎస్‌ఐ చల్లా కృష్ణ, డీటీ బీ సుబ్బారావు ప్రత్యేక పీపీటీ దుస్తులతో మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి వాహనంలో శ్మశాన వాటికకు చేర్చి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా భయం వలన చనిపోయిన వ్యక్తిని 16 గంటల పాటు ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక దృశ్యం పలువురిని కలచి వేసింది. ఎమ్మెల్యే చొరవతో ఎట్టకేలకు గురువారం సాయంత్రం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మృతుడి భార్యకు ర్యాపిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్‌గా వచ్చింది. ఘటనతో పరిసర ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించి బ్లీచింగ్ చల్లించారు. తహసీల్దార్ విమలకుమారి, అవనిగడ్డ సీఐ బి.భీమేశ్వర రవికుమార్, డాక్టర్ జయసుధ, ఈఓపీఆర్‌డీ శైలజాకుమారి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment