CM YS Jagan Letter To PM Modi For COVID Vaccine Doses For AP - Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

Published Fri, Apr 16 2021 4:44 PM | Last Updated on Sat, Apr 17 2021 3:26 AM

Coronavirus: CM Jagan Writes To PM Modi On Covid Vaccine - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 45 ఏళ్ల వయసు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు ఇవ్వడానికి 60 లక్షల డోసులు పంపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి శుక్రవారం లేఖ రాశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా వచ్చే మూడు వారాల్లో 45 ఏళ్ల వయసు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని.. ఇందుకు 60 లక్షల టీకా డోసులు పంపించేలా ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించాల్సిందిగా కోరారు. ఆ లేఖలో సీఎం జగన్‌ ఇంకా ఏం రాశారంటే..

45 ఏళ్లు దాటిన వారందరికీ మూడు వారాల్లో వ్యాక్సిన్‌
‘రాష్ట్రానికి వ్యాక్సిన్‌ డోసులు పంపించాల్సిందిగా ఏప్రిల్‌ 9న లేఖ రాసిన వెంటనే తక్షణం స్పందించి 6.4 లక్షల డోసులు పంపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు పిలుపునిచ్చిన టీకా ఉత్సవ్‌ను రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టాం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని సంతోషంగా మీ దృష్టికి తీసుకువస్తున్నా. టీకా ఉత్సవ్‌లో భాగంగా ఏప్రిల్‌ 14న దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఒకేరోజు 6,28,961 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చాం. ఇది పూర్తిగా గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ వల్లే సాధ్యమైంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున ప్రత్యేకంగా ఒక వలంటీర్‌ను కేటాయించడం జరిగింది. ఇప్పుడు వీరు ఆయా కుటుంబాల్లో అర్హత ఉన్నవారిని గుర్తించి టీకా వేయించారు. పీహెచ్‌సీ ఉన్న గ్రామ, వార్డు పరిధిల్లో అర్హత ఉన్న వారికి వ్యాక్సిన్‌ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశాం. సంతృప్తస్థాయిలో టీకాలు ఇచ్చేవిధంగా కేవలం జిల్లా అధికార యంత్రాగానికే పరిమితం కాకుండా టీకా ఉత్సవ్‌ నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా చేశాం.

రోజుకు 6 లక్షల మందికి టీకాలు ఇచ్చే శక్తి సామర్థ్యాలు సొంతం చేసుకోవడమే కాకుండా ఈ విధానాన్ని దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించే విధంగా చేశాం. కానీ వ్యాక్సిన్‌ కొరత కారణంగా ఈ డ్రైవ్‌ను కొనసాగించలేకపోయాం. రాష్ట్రంలో వ్యాక్సిన్లు పూర్తిగా అయిపోయాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా ఇప్పించాలన్న మీ కోరికను వచ్చే మూడు వారాల్లో వాస్తవ రూపంలోకి తీసుకువస్తాం. మా రాష్ట్రానికి 60 లక్షల టీకా డోసులు పంపించే విధంగా సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించాల్సిందిగా కోరుతున్నా. వచ్చే మూడు వారాల్లో 45 ఏళ్ల వయసు దాటిన వారందరికీ తొలి డోసు టీకా ఇవ్వాలని నిర్ణయించాం. దేశంలో కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ప్రధాన మంత్రికి హామీ ఇస్తున్నా. మీ నాయకత్వంలో ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొన్న తీరుకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. కోవిడ్‌ నియంత్రణకు ఇస్తున్న మద్దతకు మరోసారి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.’  


చదవండి:
కర్ణాటక సీఎంకు రెండోసారి కరోనా‌.. ఆస్పత్రికి తరలింపు
Kumbh Mela 2021: ‘కుంభమేళా’పై విమర్శల వెల్లువ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement