ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి 12వ విడత ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. బాధితులను గుర్తించి సత్వరమే చికిత్స అందించేందుకు ప్రతి మూడు రోజులకు ఒకసారి ఫీవర్ సర్వే చేస్తున్నామని, 19 వేల మంది ఏఎన్‌ఎంలు, 40 వేల మంది ఆశా కార్యకర్తలు సర్వేలో పాల్గొంటున్నారని చెప్పారు. బుధవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ చేపట్టిన 11 విడతల జ్వర బాధితుల గుర్తింపు సర్వేలో 2,72,240 మందిని గుర్తించి శాంపిళ్లు పరీక్షించగా 33,262 మంది కరోనా పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. రాష్ట్రంలో 2 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయని, జాతీయ సగటు కంటే ఎక్కువగా ఏపీలో టెస్టులు నిర్వహించామన్నారు. మిలియన్ జనాభాకు ఏపీలో 3.75 లక్షల పరీక్షలు చేయగా, దేశవ్యాప్తంగా 2.67 లక్షల టెస్టులు చేశారన్నారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు.
1,09,69,000 డోసుల పంపిణీ..
ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,09,69,000 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని సింఘాల్ తెలిపారు. ఒక డోసు తీసుకున్నవారు 58 లక్షల మంది ఉండగా 25,87,000 మంది రెండు డోసులు పూర్తైన వారు ఉన్నట్లు చెప్పారు. పలు కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లలో ఇంకా 16,54,000 డోసులు రావాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ కోటా కింద జూన్ నెల వరకూ 51,40,000 డోసులు రావాల్సి ఉందన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో 104 కాల్ సెంటర్‌కు ఫోన్ కాల్స్ కూడా తగ్గుతున్నాయని తెలిపారు. 104 కాల్ సెంటర్ ద్వారా సేవలు అందించడానికి పలువురు వైద్యులు ముందుకొస్తున్నారన్నారు.
ఇప్పటి వరకూ 5,012 మంది వైద్యులు పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో స్పెషలిస్టులు 951 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం రోజువారీ 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించగా గత 24 గంటల్లో 497 మెట్రిక్ టన్నులను డ్రా చేసుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,955 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా 114 మంది మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,301 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పొసకొనజోల్ ఇంజక్షన్లు, మాత్రలు సరిపడా అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయన్నారు.
చదవండి: నేడు ఢిల్లీకి సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment