అవినీతి గని.. నాటి సీఎం రిలీఫ్‌ నిధి | Corruption In CM Relief Fund During The Last TDP Government | Sakshi
Sakshi News home page

అవినీతి గని.. నాటి సీఎం రిలీఫ్‌ నిధి

Published Thu, Apr 22 2021 11:55 AM | Last Updated on Thu, Apr 22 2021 11:55 AM

Corruption In CM Relief Fund During The Last TDP Government - Sakshi

రోగుల ప్రాణాలతో ఏవైనా ఆస్పత్రులు చెలగాటం ఆడుతుంటే శిక్షించాల్సిన ప్రభుత్వమే ప్రోత్సహించింది.. పేద రోగుల ఆశలను కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు, సీఎంఆర్‌ఎఫ్‌ సిబ్బంది కలిసి సొమ్ము చేసుకున్నారు.. వైద్యం చేయకుండానే కొన్ని ఆస్పత్రులు బిల్లులు పెట్టి డబ్బు దండుకున్నాయి.. ఒకరు దరఖాస్తు చేసుకుంటే, మరొకరికి వైద్యం అందించాయి మరికొన్ని ఆస్పత్రులు. అవినీతికి పాల్పడేందుకు ఉన్న అడ్డదారులన్నీ ఉపయోగించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కాస్త అసహాయ నిధిగా, అంతకు మించి అవినీతి నిధిగా మారిపోయింది.

(గుండం రామచంద్రారెడ్డి, సాక్షి, అమరావతి): గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అవినీతి గనిగా మారింది. దోచుకున్న వారికి దోచుకున్నంత.. అన్న చందంగా ఇష్టారాజ్యంగా అక్రమార్కులకు నిలయమైంది. అసలైన బాధితులకు మొండి చేయి చూపుతూ.. అయిన వారికి అప్పనంగా కోట్లు కట్టబెట్టింది. పేదలకు జబ్బు చేసినప్పుడు వైద్యం చేయించుకోలేక, అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వైపు ఆశగా చూస్తారు. ఈ సొమ్ము వస్తే ప్రాణాలతో బయట పడతామని కొండంత ఆశతో దరఖాస్తు చేసుకుంటారు. స్వయానా ముఖ్యమంత్రి విచక్షణ మేరకు విడుదల చేసే ఈ నిధుల్లో కూడా కోట్లకు కోట్లు కొల్లగొట్టిన వైనం 2014–19 మధ్య కాలంలో తవ్వే కొద్దీ బయటపడుతోంది. కార్పొరేట్‌ ఆస్పత్రులు, సీఎంఓ కార్యాలయం సిబ్బంది 
కుమ్మకైసీఎంఆర్‌ఎఫ్‌ నిధులు అందినకాడికి దోచుకున్నారు. అప్పట్లో ఆరోగ్యశ్రీ సరిగా అమలు కానందున, కనీసం సీఎం అయినా కనికరించి ఆర్థిక సాయం చేస్తే వైద్యం చేయించుకుందామన్న రోగుల ఆశలను ఆస్పత్రులు, అప్పటి సీఎంఆర్‌ఎఫ్‌ సిబ్బంది కలిసి మొగ్గలోనే చిదిమేశారు. వేలాది కుటుంబాలకు నిరాశ మిగిల్చారు.

ట్రీట్‌మెంట్‌ పూర్తయ్యాక ఎల్‌ఓసీలా!
సాధారణంగా పేషెంట్‌కు ట్రీట్‌మెంట్‌ జరిగేటప్పుడు లేదా డిశ్చార్జికి ముందు ఎల్‌ఓసీకి దరఖాస్తు చేస్తారు. ఎల్‌ఓసీలో అనుమతుల మేరకు చికిత్స తర్వాత ఆ సొమ్మును క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ డిశ్చార్జి తర్వాత అయితే రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని వేల కేసులకు సంబంధించి పేషెంట్‌ డిశ్చార్జి అయిన నెలకు ఎల్‌ఓసీల కోసం దరఖాస్తు చేసుకుని, క్లెయిమ్‌ చేసుకున్నారు.  ఇందులో మరో కోణమేంటంటే ట్రీట్‌మెంట్‌ పూర్తయ్యాక బిల్లుకు రెండు రెట్లు ఎక్కువగా ఎల్‌ఓసీ తెచ్చుకుని నిధులు పొందారు.

సెక్రటరీ సంతకాలు లేకుండానే
ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్‌ చూడటానికి ప్రత్యేక అధికారి ఉంటారు. ప్రతి ఫైలునూ క్షుణ్ణంగా పరిశీలించాకే ఆమోదిస్తారు. ఇతన్ని అసిస్టెంట్‌ సెక్రటరీ (ఏఎస్‌) టు సీఎం అంటారు. ఇతను సంతకం చేశాకే ఆ ఫైలు రెవెన్యూ శాఖకు వెళుతుంది. అక్కడ నుంచి చెక్కు ఆస్పత్రికి వెళుతుంది. కానీ ఇక్కడ ఏఎస్‌ టు సీఎం సంతకం లేకుండానే ఫైళ్లు రెవెన్యూ శాఖకు వెళ్లాయి. కనీసం డాక్టర్‌ పరిశీలన కూడా లేకుండా వెళ్లినట్టు వెల్లడైంది. ఆస్పత్రులు నేరుగా రెవెన్యూ శాఖ అధికారులతో కుమ్మక్కై పని చేయించుకున్నారు. ఇంత దారుణం జరుగుతున్నా కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ఇలా వందలాది ఫైళ్లు సెక్రటరీ సంతకాలు లేకుండానే రెవెన్యూ శాఖ అనుమతికి వెళ్లినట్టు తేలింది. ఇలాంటి వాటిలో ఎక్కువగా విజయవాడ రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం చెక్కులున్నట్టు స్పష్టమైంది.

జబ్బు ఒకటి.. చికిత్స మరొకటి
ఆస్పత్రి ఎస్టిమేషన్‌లో విధిగా జబ్బు, దాని చికిత్సకు అయ్యే ఖర్చు గురించి విపులంగా ఇస్తారు. కానీ కొన్ని వందల బిల్లుల్లో ఎల్‌ఓసీలో ఒక జబ్బు రాసి ఉంటే.. డిశ్చార్జి సమ్మరిలో మరో జబ్బును పేర్కొని లక్షలకు లక్షలు బిల్లు వేశారు. ‘సాక్షి’ పరిశీలనలోనూ ఇలాంటి నిజాలు వెల్లడయ్యాయి. ఇలా ఎల్‌ఓసీలో ఇచ్చిన జబ్బులు కాదని ఇతర జబ్బులున్నాయంటూ వైద్యం చేసి బిల్లులు క్లెయిమ్‌ చేసుకున్నారు. ఆరా తీస్తుంటే పలు అంశాలు బయటికి వస్తున్నాయి.

9 వేల చెక్కులకు బ్యాంకులు హానర్‌ చెయ్యలేదు
2019 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది. దీనికి కొద్దిరోజుల ముందు రమారమి 9 వేలకు పైగా సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను విడుదల చేశారు. కానీ వీటిలో ఒక్కటంటే ఒక్కటీ పాస్‌ కాలేదంటే అప్పటి సీఎంఆర్‌ఎఫ్‌ తీరు ఎలా ఉందో అంచనా వేయొచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇష్టారాజ్యంగా చెక్కులు విడుదల చేయడం, అవి పాస్‌ కాకపోవడంతో బాధితులు అష్టకష్టాలు పడ్డారు. 2019లోనే 9 వేల చెక్కులు బౌన్స్‌ అయ్యాయి. ఎన్నికల కోసమే చెక్కులు ఇచ్చి రోగులను మోసం చేశారు. 2019కి ముందు కూడా మరో 4 వేల చెక్కులు చెల్లలేదు. సీఎం సహాయ నిధి చెక్కులే పెండింగులో పడితే.. ఏ లెక్కన ఇష్టారాజ్యంగా చెక్కులిచ్చారో తెలుస్తోంది.

సీఎంఓ కార్యాలయం కీలక పాత్ర
ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే ఒక అసిస్టెంట్‌ సెక్రటరీ, మరో డాక్టర్‌.. కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులతో కుమ్మకై కోట్లకు కోట్ల దుర్వినియోగానికి పాల్పడినట్టు ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. మెజారిటీ చెక్కులు ఏఎస్‌ సంతకం లేకుండా వెళ్లాయంటే రెవెన్యూ, సీఎంఓ, కార్పొరేట్‌ ఆస్పత్రులు.. ఈ ముగ్గురూ కుమ్మక్కయ్యారనేది స్పష్టమవుతోంది.

రూ.1,300 కోట్లలో సగం పక్కదారి!
2014 జూలై నుంచి 2019 మార్చి వరకు గత ప్రభుత్వంలో రోగులకు సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు మంజూరు చేశారు. నెలకు సగటున రూ.24 కోట్ల చొప్పున 57 నెలల్లో రూ.1368 కోట్లు మంజూరు చేశారు. ఆ ఐదేళ్లలో చోటుచేసుకున్న అవకతవకలు పరిశీలిస్తే ఇందులో సగానికి పైగా సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 

ఒకటా.. రెండా.. ఎన్నెన్నో అక్రమాలు
రూప్‌సింగ్‌ అనే వ్యక్తి 2017లో వైద్యం కోసం ఎల్‌ఓసీకి దరఖాస్తు చేశారు. ఎల్‌ఓసీ నంబర్‌ 17047/సీఎంఓ/ఎల్‌/2017. ఈ దరఖాస్తుకు రూ.50 వేలు ఎల్‌ఓసీ మంజూరైంది. కానీ వైద్యం చేయించుకున్నది నాంచారయ్య అనే వ్యక్తి.
వట్టికొండ సూర్యవతి అనే మహిళ 2018లో సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసింది. రూ.1,22,000 మంజూరు చేస్తూ ఎల్‌ఓసీ (108238/సీఎంఓ/ఎల్‌/2018) ఇచ్చారు. కానీ ఆస్పత్రి రికార్డులో వేరే పేరు చూపించారు.
2018లో గరిమెళ్ల వెంకట రమణమ్మ అనే మహిళ సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోగా, రూ.1.08 లక్షలు మంజూరు చేస్తూ ఎల్‌ఓసీ (83122/సీఎంఓ/ఎల్‌/2018 ఇచ్చారు. ఈమెకు వైద్యం అందివ్వకుండానే ఎల్‌ఓసీ క్లెయిమ్‌ చేశారు.
వడ్లవల్లి ప్రసన్న అనే మహిళ..వైద్యానికి దరఖాస్తు చేసుకోగా ఎల్‌ఓసీ (149707/సీఎంఓ/ఎల్‌/2019) ఇస్తూ.. రూ.2.78 లక్షలు మంజూరు చేశారు. కానీ పేషెంట్‌తో సొమ్ము కట్టించుకుని, ఎల్‌ఓసీని సీఎంఓకు క్లెయిమ్‌ చేశారు.
తిమ్మారెడ్డి శివమ్మ అనే మహిళ హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో వైద్యం కోసం సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసింది. రూ.8 లక్షలకు ఎల్‌ఓసీ (127161/సీఎంఓ/ఎల్‌/2018) ఇచ్చారు. కానీ ఈ పేషెంట్‌ వద్ద నుంచి డబ్బు వసూలు చేశారు. ఎల్‌ఓసీ క్లెయిమ్‌కు పంపించగా, ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక దాన్ని పెండింగ్‌లో పెట్టింది. 
వై.రాము అనే వ్యక్తి మంగళగిరిలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడానికి సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేశారు. రూ.4.50 లక్షలకు ఎల్‌ఓసీ (172231/సీఎంఓ/ఎల్‌/2019) ఇచ్చారు. విచిత్రమేమంటే ఇతనికి 2018 జూలైలో ట్రీట్‌మెంట్‌ జరిగ్గా... 2019 మార్చిలో ఎల్‌ఓసీకి దరఖాస్తు చేశారు. ప్రస్తుత సీఎంఓ అధికారులు బిల్లును పెండింగ్‌లో పెట్టారు.
చదవండి:
గట్టిగా కేకలు వేయడంతో గుట్టుచప్పుడు కాకుండా.. 
రెచ్చిపోతున్న ఆన్‌లైన్‌ మోసగాళ్లు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement