సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ రాబడిపై కోవిడ్ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. కోవిడ్ ఫస్ట్ వేవ్ కాలంతో పోలిస్తే రాబడి భారీగా పెరిగినట్టు కనిపిస్తున్నా.. ముందు నెలలతో పోలిస్తే మాత్రం రాబడి క్రమేపీ క్షీణిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో జీఎస్టీ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.1,826 కోట్ల (అడహక్ చెల్లింపులు కాకుండా) రాబడి మాత్రమే సమకూరింది. వాస్తవంగా రాష్ట్రంలో జీఎస్టీ ద్వారా ఆగస్టు నెలలో కేంద్రానికి రూ.2,591 కోట్ల రాబడి వచ్చినప్పటికీ.. ఐజీఎస్టీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర ఖాతాలోకి రూ.1,826 కోట్లు మాత్రమే వచ్చినట్టు స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ రవిశంకర్ నారాయణ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇదే సమయంలో గతేడాది ఆగస్టులో జీఎస్టీ ద్వారా రూ.1,516 కోట్ల రాబడి వచ్చింది. అంటే గతేడాదితో పోలిస్తే జీఎస్టీ రాబడి రూ.710 కోట్లు (అడ్‌హక్ చెల్లింపులతో కలుపుకుని) పెరిగింది. అయితే, ఈ ఏడాది జూలై నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు రూ.411 కోట్ల మేర తగ్గాయి.
ఈ ఏడాది జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు (రుణం, అడహక్ చెల్లింపులు లేకుండా) రూ.2,237 కోట్లుగా ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా జీఎస్టీ చెల్లింపులకు జూలై వరకు కేంద్ర ప్రభుత్వం సమయం ఇవ్వడంతో రాబడి పెరగడానికి కారణంగా అధికారులు వివరించారు. ఇతర వ్యాట్, వృత్తి పన్ను అన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది ఆగస్టులో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.4,204 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే కాలంలో వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.2,494 కోట్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ రూపంలో ఆదాయం రూ.868 కోట్ల నుంచి రూ.1,258 కోట్లకు చేరింది.
ఐదు నెలల్లో రూ.21,157 కోట్ల ఆదాయం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రూ.55,535 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. ప్రస్తుత 5 నెలల కాలానికి (ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు) రూ.21,157 కోట్ల ఆదాయం సమకూరినట్టు వాణిజ్య పన్నుల శాఖ ప్రాథమికంగా లెక్క తేల్చింది. జీఎస్టీ ద్వారా రూ.11,805 కోట్ల ఆదాయం సమకూరగా.. పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాల ద్వారా రూ.5,952 కోట్లు, మద్యంపై వ్యాట్ ద్వారా రూ.3,300 కోట్లు, వృత్తి పన్ను ద్వారా రూ.100 కోట్లు సమకూరింది.
బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రతినెలా సగటున రూ.4,627 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా, ఐదు నెలల ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటే సగటున రూ.4,231 కోట్లు మాత్రమే వస్తోంది. జీఎస్టీ ఎగవేతదారులు, తక్కువ పన్ను చెల్లించిన వారిని గుర్తించి పన్ను వసూలు చేయడానికి నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్ సత్ఫలితాలిస్తోంది. ఈ ఏడాది ప్రత్యేక డ్రైవ్ ద్వారా కనీసం రూ.1,500 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 5 నెలల కాలానికి రూ.592 కోట్లు వసూలు చేశారు. చెల్లించాల్సిన దానికంటే తక్కువ పన్ను చెల్లించినట్టు గుర్తించిన సంస్థల ఖాతాలను ప్రత్యేకంగా ఆడిటింగ్ నిర్వహించే కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కాబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment