కోవిడ్‌కు ముందు, కోవిడ్ తర్వాత వాణిజ్య పన్నుల ఆదాయం ఇలా..
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభంతో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక రంగం వేగంగా కోలుకుంటోంది. గతేడాది కోవిడ్‌తో భారీగా పడిపోయిన పన్నుల ఆదాయం ఇప్పుడు తిరిగి కోవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్ సంక్షోభానికి ముందు 2019–20లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల ఆదాయం రూ.21,967.90 కోట్లుగా ఉంటే అది ఈ ఏడాది ఇదే కాలానికి రూ.26,133.33 కోట్లకు చేరుకుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నుంచి రూ.55,535 కోట్ల ఆదాయాన్ని బడ్జెట్‌లో నిర్దేశించారు. 2019–20లో మొదటి ఆరు నెలల కాలానికి రూ.10,911.03 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ ఆదాయం ఈ ఏడాది ఇదే కాలానికి రూ.14,661.10 కోట్లకు చేరింది. ఇందులో ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పాత సంవత్సరాలకు సంబంధించిన అడహాక్ చెల్లింపులు, జీఎస్టీ పరిహారం, రుణాల రూపంలో ఇవ్వడంతో రూ.3,337 కోట్ల అదనపు ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందింది.
ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడంతో..
కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టింది. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడంతో ఆర్థిక కార్యకలాపాలు కోవిడ్ పూర్వ స్థితికి వేగంగా చేరుకోవడానికి దోహదపడ్డాయని అధికారులు తెలిపారు. దీనికితోడు తగ్గుతున్న ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేకంగా చేపట్టిన డ్రైవ్ కూడా సత్ఫలితాలను ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరం స్పెషల్ డ్రైవ్ ద్వారా రూ.1,772 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా ఈ ఏడాది రూ.1,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
తగ్గిన లిక్కర్ ఆదాయం
వాణిజ్య పన్నుల ఆదాయంలో జీఎస్టీ, పెట్రోలియం, వృత్తి పన్ను వంటి అన్ని విభాగాల్లో వృద్ధి నమోదైనా లిక్కర్ ఆదాయంలో క్షీణత నమోదు కావడం గమనార్హం. కోవిడ్‌కు ముందు 2019–20 మొదటి ఆరు నెలల కాలంలో రూ.5,735.48 కోట్లుగా ఉన్న లిక్కర్‌పై వ్యాట్ ఆదాయం ఈ ఏడాది రూ.4,104.26 కోట్లకు పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం దశలవారీ మద్యనిషేధంలో భాగంగా మద్యం షాపుల సంఖ్య తగ్గించడం, ఎక్సైజ్ సుంకాలను పెంచడంతో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. లిక్కర్‌పై వ్యాట్ ఆదాయం తగ్గడానికి ఇదే కారణమన్నారు. ఇదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల ఆదాయం రూ.5,215.14 కోట్ల నుంచి రూ.7,245.93 కోట్లకు, వృత్తి పన్నుల ఆదాయం రూ.106.24 కోట్ల నుంచి రూ.122.03 కోట్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment