సాక్షి, అమరావతి: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ చికిత్సలను రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి ఆస్పత్రులకూ విస్తరిస్తోంది. ఇప్పటివరకూ బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రులకే కోవిడ్ చికిత్సలు పరిమితమయ్యాయి. మూడో వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇకపై సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కోవిడ్ చికిత్సలు అందించేలా వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 30 నుంచి 50 పడకల వరకూ ఉంటాయి. వీటిల్లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా వైద్యుల బృందం ఉంటుంది. 18ఏళ్ల లోపు పిల్లలకు కోవిడ్ సోకినా ఇబ్బందులు తలెత్తకుండా సీహెచ్‌సీల్లోనూ సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల బాధితులకు సత్వరమే సమీపంలోనే సేవలు అందనున్నాయి. 24 గంటలూ కరెంటు ఉండేలా చర్యలు చేపట్టారు.
వెంటనే ఆస్పత్రికి చేరుకునేలా..
సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు కలిపి 50కిపైగా ఆస్పత్రులను కోవిడ్ చికిత్సకు సిద్ధం చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇవికాకుండా 10 ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఇంతకుముందు వీటిల్లో కోవిడ్ సేవలు అందించలేదు. కొత్తగా కోవిడ్ చికిత్స కోసం వీటిని సిద్ధం చేస్తున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు సాధారణంగా నియోజకవర్గ స్థాయిలోనే ఉంటాయి కాబట్టి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. పైగా తక్షణమే ఆస్పత్రికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆస్పత్రుల్లో కొత్తగా ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు, వార్డుల పునరుద్ధరణ చేపట్టారు. కోవిడ్‌కు అవసరమైన మౌలిక వసతులను అన్నిటినీ ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సమర్థంగా చికిత్స అందించేలా వసతులు కల్పిస్తున్నారు. పీడియాట్రిక్ వైద్యులు లేని చోట్ల తక్షణమే నాన్‌కోవిడ్ ఆస్పత్రులకు చెందిన పిల్లల వైద్యులను నియమిస్తారు.
ఏ జిల్లాలో ఎక్కడ..?
► అనంతపురం: అనంతపురం సీడీహెచ్, గుత్తి, కల్యాణదుర్గం, మడకశిర, పెనుగొండ,ఉరవకొండ సీహెచ్‌సీలు
► తూర్పు గోదావరి: రంపచోడవరం, తుని (ఏరియా ఆస్పత్రి), అడ్డతీగల, చింతూరు, గోకవరం, పి.గన్నవరం, పెద్దాపురం, పత్తిపాడు, రాజోలు, ఏలేశ్వరం సీహెచ్‌సీలు
► గుంటూరు: చిలకలూరిపేట, సత్తెనపల్లి (ఏరియా ఆస్పత్రులు), ఫీవర్ ఆస్పత్రి
► ప్రకాశం: గిద్దలూరు,యర్రగొండపాలెం (ఏరియా ఆస్పత్రులు), డోర్నాల, కంభం సీహెచ్‌సీలు, ఎంసీహెచ్ ఒంగోలు
► చిత్తూరు: మహల్, పుత్తూరు, సత్యవేడు, వాయల్పాడు సీహెచ్‌సీలతో పాటు తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రి
► పశ్చిమ గోదావరి: భీమవరం,చింతలపూడి, నరసాపురం,పాలకొల్లు (ఏరియా ఆస్పత్రులు), కొవ్వూరు, నిడదవోలు సీహెచ్‌సీలు
► కృష్ణా: జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ (విజయవాడ), సీహెచ్‌సీ మైలవరం
► శ్రీకాకుళం: నరసన్నపేట, సీతంపేట ఏరియా ఆస్పత్రులు
► కడప: జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి (ఏరియా ఆస్పత్రులు), బద్వేల్, పోరుమామిళ్ల, వేంపల్లి, మైలవరం సీహెచ్‌సీలు
► కర్నూలు: బనగానపల్లి, ఆదోని, ఎమ్మిగనూరు సీహెచ్‌సీలు
► విశాఖపట్నం: అగనంపూడి (ఏరియా ఆస్పత్రి),చింతపల్లి, కోటపాడు, నక్కపల్లి, యలమంచిలి సీహెచ్‌సీలు
Comments
Please login to add a commentAdd a comment