జల వివాదం: నిరంతర విద్యుదుత్పత్తి.. ఇద్దరికీ నష్టమే | Damage To Telugu States With Uninterrupted Power Generation For Irrigation | Sakshi
Sakshi News home page

Krishna Water: నిరంతర విద్యుదుత్పత్తి.. ఇద్దరికీ నష్టమే

Published Sun, Jul 11 2021 8:28 AM | Last Updated on Sun, Jul 11 2021 9:35 AM

Damage To Telugu States With Uninterrupted Power Generation For Irrigation - Sakshi

శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 834 అడుగులు దాటాకనే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా అవసరాల కోసం కృష్ణా బోర్డు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే.. ఆ రాష్ట్రం విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు తరలించాలి. కానీ ప్రస్తుత నీటి సంవత్సరం మొదటి రోజునే అంటే జూన్‌ 1న శ్రీశైలంలో 808.4 అడుగుల్లో కేవలం 33.39 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. కృష్ణా బోర్డుకు కనీసం సమాచారం ఇవ్వకుండానే తెలంగాణ సర్కార్‌ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది.

విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కృష్ణా బోర్డు ఆదేశించినా నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేసింది.  జూన్‌ 1 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకూ శ్రీశైలం ప్రాజెక్టులోకి 28.87 టీఎంసీల ప్రవాహం వస్తే విద్యుదుత్పత్తి ద్వారా 26.05 టీఎంసీలను దిగువకు వదిలేసింది.  విద్యుదుత్పత్తి చేయకుండా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం ఇప్పటికే 848 అడుగులు  దాటి ఉండేది. 

శ్రీశైలం..
తెలంగాణ: జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో నీటి మట్టం ఎంత గరిష్టంగా ఉంటే.. విద్యుత్‌ అంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ ఎత్తులో నీటి మట్టం ఉన్నప్పుడు పది వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్‌.. నీటి మట్టం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు 20 వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్‌కు సమానం. తక్కువ ఎత్తు నుంచే తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడం వల్ల శ్రీశైలం నీటి మట్టం పెరగలేదు. దీనివల్ల తెలంగాణకూ నష్టమే. శ్రీశైలంలో నీటి నిల్వలు అడుగంటిపోవడం వల్ల తీవ్ర కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీళ్లందించలేని దుస్థితి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు: శ్రీశైలంలో నీటి మట్టం కనీసం 848 అడుగులకు చేరితేనే దుర్భిక్ష రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు, చెన్నై నగరానికి అత్యవసరాల కోసం రెండు వేల క్యూసెక్కులనైనా తరలించే వీలు  ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.

నాగార్జునసాగర్‌.. 
విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్‌ శ్రీశైలం నుంచి వదిలేస్తున్న జలాలకు స్థానికంగా కురిసిన వర్షం వల్ల వచ్చే ప్రవాహం తోడవడంతో జూన్‌ 1 నుంచి ఇప్పటిదాకా నాగార్జునసాగర్‌లోకి 28.26 టీఎంసీలు వచ్చాయి. విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్‌ 31.22 టీఎంసీలను దిగువకు 
వదిలేసింది.

తెలంగాణ: సాగర్‌లో 510 అడుగుల కంటే నీటి మట్టం దిగువకు చేరితే హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేయడం సాధ్యం కాదు. సాగర్‌ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టు కింద కింద ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌: సాగర్‌ కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం, ఎడమ కాలువ ద్వారా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది.

పులిచింతల..
కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం కోసం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. విజయవాడ సర్కిల్‌ ఎస్‌ఈ ఆయకట్టుకు రోజు నిర్దిష్టంగా ఎన్ని  క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలో ప్రతిపాదనలు పంపితేనే.. ఆ మేరకు నీటిని వినియోగిస్తూ తెలంగాణ సర్కార్‌ విద్యుదుత్పత్తి చేయాలి. కానీ తెలంగాణ సర్కార్‌ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి ప్రారంభించింది. సాగర్‌ నుంచి తెలంగాణ సర్కార్‌ వదిలేస్తున్న ప్రవాహానికి స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వచ్చే ప్రవాహం తోవడంతో ఇప్పటిదాకా పులిచింతల ప్రాజెక్టులోకి 36.64 టీఎంసీలు వస్తే విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు. 6.67 టీఎంసీలను తెలంగాణ సర్కార్‌ దిగువకు వదిలేసింది. ఇందులో 5.55 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా సముద్రంలో కలిశాయి. మిగిలిన జలాలు నదిలో ప్రవాహం రూపంలో ఉన్నాయి.

తెలంగాణ: తక్కువ ఎత్తు నుంచి ఉత్పత్తి చేయడం వల్లే.. ఎక్కువ నీటిని ఉపయోగించినా తక్కువ విద్యుత్తే అందుబాటులోకి వస్తుంది. 

ఆంధ్రప్రదేశ్‌: కృష్ణా డెల్టా పరిధిలో కృష్ణా, పశ్చి మగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఖరీఫ్‌ పంటలకు రైతులు ఇంకా సన్నద్ధం కాలేదు. దీంతో పులిచింతల నుంచి తెలంగాణ వదిలేసిన నీటిని వదిలేసినట్లుగా వృథాగా సముద్రంలోకి విడుదల చేయాల్సి వస్తోంది. ఇలా ఇప్పటిదాకా 5.55 టీఎంసీలు వృథా అయ్యాయి.

బోర్డు పరిధి.. ప్రాజెక్టులు
కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా విభజన చట్టం సెక్షన్‌ 85(1) ప్రకారం కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసినా పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్‌ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడం వల్ల బోర్డుకు ఎలాంటి అధికారాలు లేవు. దీంతో తరచూ జల వివాదాలు ఉత్పన్నమవుతున్నా బోర్డు చేతులెత్తేస్తోంది. ఈ వివాదాలకు పరిష్కారం దొరకాలంటే ప్రాజెక్టులపై అజమాయిషీ తమకే ఇవ్వాలని బోర్డు కోరుతోంది. బేసిన్‌ పరిధిలో తెలంగాణ, ఏపీల నియంత్రణలోని ప్రాజెక్టులు, ఇప్పటికే చేపట్టిన, కొత్తగా చేపట్టనున్న అన్ని ప్రధాన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకునేందుకు ముసాయిదాను ఇరు రాష్ట్రాలకు పంపింది. ట్రిబ్యునల్‌ అవార్డులు, కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా నీటి కేటాయింపులు చేస్తామని స్పష్టం చేసింది. విద్యుదుత్పత్తిని సైతం పర్యవేక్షిస్తామని పేర్కొంది. ఏడేళ్లుగా బోర్డు, తెలుగు రాష్ట్రాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నా దీనిపై తేలడం లేదు.

పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు ఇవే... 
బోర్డు పరిధి నోటిఫై అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉన్న హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, కేసీ కెనాల్, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాలపై ఆధారపడి ఉన్న విద్యుత్‌ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీశైలంపై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు–నగరి, హంద్రీనీవా, ముచ్చుమర్రి, వెలిగొండ, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి, శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాలు, సాగర్‌పై ఆధారపడ్డ కుడి, ఎడమ కాల్వలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్‌పీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి రానున్నాయి.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement