
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబరు 14వ తేదీన 'దీపావళి ఆస్థానాన్ని' టీటీడీ శాస్రోక్తంగా నిర్వహించనుంది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య(దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటి గంట నివేదన వరకు కైంకర్యాలు జరుగుతాయి. అనంతరం ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. (శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానందేంద్రస్వామి)
ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. కాగా సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా నవంబరు 14న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment