AP Degree Second Counselling Date 2021: 4 నుంచి డిగ్రీ రెండో విడత కౌన్సెలింగ్‌ - Sakshi
Sakshi News home page

4 నుంచి డిగ్రీ రెండో విడత కౌన్సెలింగ్‌

Published Mon, Feb 1 2021 9:16 AM | Last Updated on Mon, Feb 1 2021 1:22 PM

Degree Second Installment Counseling From 4th - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా డిగ్రీ కోర్సుల్లో సీట్ల భర్తీకి అమల్లోకి తెచ్చిన ఆన్‌లైన్‌ విధానం విద్యార్థులకు ఉపయుక్తంగా మారింది. తొలివిడత కౌన్సెలింగ్‌ పూర్తికావడంతో ఉన్నత విద్యామండలి ఈనెల 4వ తేదీనుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. ఆన్‌లైన్‌ విధానంతో విద్యార్థులకు మెరిట్‌ ఉంటే తాము కోరుకున్న కాలేజీలో, కోర్సులో సీటు పొందే అవకాశం దక్కింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే రిజర్వుడ్‌ వర్గాలకు గతంలో ప్రముఖ ప్రైవేటు కాలేజీల్లో చదివేందుకు అవకాశం దక్కేది కాదు. ఇప్పుడు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు భర్తీ చేస్తుండటంతో ఆయా వర్గాల వారికి సీట్లు దక్కుతున్నాయి. విద్యార్థులు గతంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కాలేజీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంట్లో కూర్చునో, లేదంటే దగ్గర్లోని ఇంటర్నెట్‌ సెంటర్‌కు వెళ్లి ఆన్‌లైన్లో తమకు నచ్చిన కాలేజీల్లో, నచ్చిన కోర్సుల్లో సీటు కోసం ఆప్షన్‌ ఇచ్చి సీట్లు పొందుతున్నారు. (చదవండి: ఘరానా మోసం: మరణించినట్లుగా నమ్మించి..)

విద్యార్థులకు అందుబాటులో కాలేజీల సమాచారం
రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల పరిధిలో ప్రభుత్వ, ప్రయివేటు ఎయిడెడ్, ప్రయివేట్‌ అన్‌ ఎయిడెడ్‌.. మొత్తం 1,301 కాలేజీల్లో వివిధ కోర్సులకు సంబంధించి 4,95,956 సీట్లున్నాయి. కాలేజీలో ఉన్న కోర్సులు, సదుపాయాలు, ల్యాబ్‌లు, లెక్చరర్లు, న్యాక్‌ గుర్తింపు వంటి అన్ని వివరాలను ఉన్నత విద్యామండలి.. వెబ్‌ కౌన్సెలింగ్‌ కోసం ఏర్పాటుచేసిన హెచ్‌టీటీపీఎస్‌://ఓఏఎండీసీ.ఏపీ.జీఓవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో జిల్లాల వారీగా ఉంచింది. ఈ వివరాలు పరిశీలించిన విద్యార్థులు తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చారు.(చదవండి: బడి 'రెడీ': నేటి నుంచి ప్రైమరీ స్కూళ్లు)

గతనెల 6వ తేదీనుంచి 21వ తేదీవరకు తొలివిడత కౌన్సెలింగ్‌ను నిర్వహించి 24వ తేదీన 1,95,645 సీట్లను కేటాయించారు. విద్యార్థుల ఫోన్లకు ఏ కాలేజీలో ఏ కోర్సులో సీటు వచ్చిందో సమాచారం పంపించారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో చిత్తూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి విడతలో సీట్లు రానివారికోసం, తాము అనుకున్న కాలేజీలో, కోర్సులో సీట్లు పొందలేని వారికోసం రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement