Degree counseling
-
4 నుంచి డిగ్రీ రెండో విడత కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా డిగ్రీ కోర్సుల్లో సీట్ల భర్తీకి అమల్లోకి తెచ్చిన ఆన్లైన్ విధానం విద్యార్థులకు ఉపయుక్తంగా మారింది. తొలివిడత కౌన్సెలింగ్ పూర్తికావడంతో ఉన్నత విద్యామండలి ఈనెల 4వ తేదీనుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఆన్లైన్ విధానంతో విద్యార్థులకు మెరిట్ ఉంటే తాము కోరుకున్న కాలేజీలో, కోర్సులో సీటు పొందే అవకాశం దక్కింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే రిజర్వుడ్ వర్గాలకు గతంలో ప్రముఖ ప్రైవేటు కాలేజీల్లో చదివేందుకు అవకాశం దక్కేది కాదు. ఇప్పుడు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు భర్తీ చేస్తుండటంతో ఆయా వర్గాల వారికి సీట్లు దక్కుతున్నాయి. విద్యార్థులు గతంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కాలేజీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంట్లో కూర్చునో, లేదంటే దగ్గర్లోని ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి ఆన్లైన్లో తమకు నచ్చిన కాలేజీల్లో, నచ్చిన కోర్సుల్లో సీటు కోసం ఆప్షన్ ఇచ్చి సీట్లు పొందుతున్నారు. (చదవండి: ఘరానా మోసం: మరణించినట్లుగా నమ్మించి..) విద్యార్థులకు అందుబాటులో కాలేజీల సమాచారం రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల పరిధిలో ప్రభుత్వ, ప్రయివేటు ఎయిడెడ్, ప్రయివేట్ అన్ ఎయిడెడ్.. మొత్తం 1,301 కాలేజీల్లో వివిధ కోర్సులకు సంబంధించి 4,95,956 సీట్లున్నాయి. కాలేజీలో ఉన్న కోర్సులు, సదుపాయాలు, ల్యాబ్‌లు, లెక్చరర్లు, న్యాక్ గుర్తింపు వంటి అన్ని వివరాలను ఉన్నత విద్యామండలి.. వెబ్ కౌన్సెలింగ్ కోసం ఏర్పాటుచేసిన హెచ్‌టీటీపీఎస్://ఓఏఎండీసీ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో జిల్లాల వారీగా ఉంచింది. ఈ వివరాలు పరిశీలించిన విద్యార్థులు తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చారు.(చదవండి: బడి 'రెడీ': నేటి నుంచి ప్రైమరీ స్కూళ్లు) గతనెల 6వ తేదీనుంచి 21వ తేదీవరకు తొలివిడత కౌన్సెలింగ్‌ను నిర్వహించి 24వ తేదీన 1,95,645 సీట్లను కేటాయించారు. విద్యార్థుల ఫోన్లకు ఏ కాలేజీలో ఏ కోర్సులో సీటు వచ్చిందో సమాచారం పంపించారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో చిత్తూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి విడతలో సీట్లు రానివారికోసం, తాము అనుకున్న కాలేజీలో, కోర్సులో సీట్లు పొందలేని వారికోసం రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనుంది. -
నేటి నుంచి డిగ్రీ నాలుగో విడత కౌన్సెలింగ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈరోజు(శనివారం) నుంచి 29 వరకు నాలుగో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 31న సీట్లను కేటాయించనున్నారు. సీజీజీలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ప్రవేశాల్లో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారని, వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నాలుగో విడత కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 4వ తేదీలోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు పేర్కొన్నారు. -
డిగ్రీలో సీట్లు రాని వారికి మరో విడత కౌన్సెలింగ్
25 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం.. సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో ఇప్పటివరకు మీసేవ కేంద్రాల్లో అథెంటికేషన్, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని సీట్లు లభించని విద్యార్థులకు మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) కసరత్తు చేస్తోంది. ఇన్వ్యాలిడ్ అథెంటి కేషన్, అథెంటికేషన్ రద్దు అయిన వారికి కూడా అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఈనెల 25 నుంచి 28 వరకు అథెంటికేషన్ ఇన్వ్యాలిడ్ అయిన వారితోపాటు, రద్దు అయిన వారికి మీసేవ కేంద్రాల్లో అథెంటికేషన్, రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అవకాశం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతోపాటు వారికి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. వచ్చే నెల 2 లోగా చివరి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు లభించిన విద్యార్థులు కాలేజీల్లో చేరేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. మొదటి విడత, రెండో విడత, మూడో విడత కౌన్సెలింగ్ ద్వారా ఇప్పటివరకు 1,85,887 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరగా, ఇంకా 2,24,390 సీట్లు ఖాళీగా ఉన్నాయి. -
నేటి నుంచి డిగ్రీ తుది కౌన్సెలింగ్
- 31 వరకు అథెంటికేషన్, రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు - అందుబాటులో 2,57,479 సీట్లు సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా తుది దశ కౌన్సెలింగ్‌ను ఈనెల 22 నుంచి ప్రారంభించనున్నట్లు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటాచలం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 22 నుంచి 31వ తేదీ వరకు తుది దశ ప్రవేశాల కోసం మీసేవా కేంద్రాలు/కాలేజీల హెల్ప్‌లైన్ కేంద్రాల్లో బయోమెట్రిక్, ఆధార్ అథెంటికేషన్ చేయించుకోవాలని సూచించారు. 31లోగా ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని పేర్కొన్నారు. మొదటి, రెండో దశ కౌన్సెలింగ్ కోసం ఇది వరకే అథెంటికేషన్, రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు. తమ ఐడీ నంబర్‌తో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. గేమ్స్, స్పోర్ట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, క్యాప్, వికలాంగులు అదనపు కరిక్యులర్ యాక్టివిటీస్ సర్టిఫికెట్లు కలిగిన వారు యూనివర్సిటీల హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఈనెల 28, 29 తేదీల్లో వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. మొదటి, రెండు దశల్లో సీట్లు పొందిన వారిలో 1,51,588 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరగా, తుది దశ కౌన్సెలింగ్‌లో 2,57,479 సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థు లకు వచ్చే నెల 4వ తేదీన సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులంతా వచ్చే నెల 4వ తేదీ నుంచి 11వ తేదీలోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. వెబ్సైట్ నుంచి (dost. cgg.gov.in) సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని కాలేజీకి వెళ్లి సీటు కన్ఫర్మ్ చేయించుకోవాలని వివరించారు.