డిగ్రీలో సీట్లు రాని వారికి మరో విడత కౌన్సెలింగ్
25 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం..
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల్లో ఇప్పటివరకు మీసేవ కేంద్రాల్లో అథెంటికేషన్, ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని సీట్లు లభించని విద్యార్థులకు మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ (దోస్త్) కసరత్తు చేస్తోంది. ఇన్‌వ్యాలిడ్ అథెంటి కేషన్, అథెంటికేషన్ రద్దు అయిన వారికి కూడా అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఈనెల 25 నుంచి 28 వరకు అథెంటికేషన్ ఇన్‌వ్యాలిడ్ అయిన వారితోపాటు, రద్దు అయిన వారికి మీసేవ కేంద్రాల్లో అథెంటికేషన్, రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అవకాశం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతోపాటు వారికి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు.
వచ్చే నెల 2 లోగా చివరి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు లభించిన విద్యార్థులు కాలేజీల్లో చేరేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. మొదటి విడత, రెండో విడత, మూడో విడత కౌన్సెలింగ్ ద్వారా ఇప్పటివరకు 1,85,887 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరగా, ఇంకా 2,24,390 సీట్లు ఖాళీగా ఉన్నాయి.