సాక్షి, విశాఖపట్నం: కాసులు కురిపించే ట్యూనా (సూర) చేపలు బోటు యజమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. కొన్నాళ్ల నుంచి ఇవి సముద్రంలో విరివిగా లభ్యమవుతున్నాయి. ఏడాది పొడవునా వీటి లభ్యత ఉన్నా డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ట్యూనాలకు సీజన్. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరింతగా ఇవి దొరుకుతాయి. మరబోట్లు వలలు వేసి చేపల వేట సాగిస్తారు. కానీ ట్యూనాల కోసం వలలతో కాకుండా గాలం (హుక్)లతో వేటాడతారు. లోతైన సముద్ర ప్రాంతం (డీప్ సీ) ఉన్న చోట ట్యూనాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సముద్రతీర ప్రాంతానికి దూరంగా ఉండే లోతు ప్రదేశానికి వీటి కోసం మరబోట్లలో వెళ్తుంటారు. విశాఖ హార్బర్ నుంచి అలా సముద్రం లోతు ఎక్కువగా ఉండే బంగ్లాదేశ్ వరకు ట్యూనాల వేటకు వెళ్తారు. మామూలు చేపలవేటకు వారం పది రోజుల అవసరమైతే.. ట్యూనాల వేటకు 25 రోజుల నుంచి నెల వరకు సమయం తీసుకుంటుంది.
ట్యూనాల కోసం ప్రత్యేక బోట్లు
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో 700కు పైగా మరబోట్లున్నాయి. వీటిలో 400 వరకు బోట్లు వలలతో చేపలవేట సాగిస్తుంటాయి. మరో 300కు పైగా ట్యూనా చేపల వేట కోసం ప్రత్యేకంగా తయారు చేయించినవి ఉంటాయి. ఈ బోట్లలో 10–12 కిలోమీటర్ల దూరం తాడుకు 600–700 వరకు గాలాలు అమర్చి సముద్రంలో వదిలిపెడ్తారు. ఏడెనిమిది గంటల తర్వాత గాలాలను పరిశీలించుకుంటూ వెళ్తారు. హుక్‌లకు తగిలిన ట్యూనాలను తీసి బోటులో వేస్తారు. ఇలా గాలాలు వేసిన ఒక్కో ప్రాంతంలో ఒకరోజు కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒకసారి వేటకు వెళ్తే ఐదు నుంచి 10 టన్నుల వరకు ట్యూనాలు పట్టుబడతాయి. వీటిలో ఐదు నుంచి 80 కిలోల బరువున్నవి ఉంటాయి. కొన్నాళ్లుగా ఇవి రోజుకు 60 టన్నులకు పైగా ట్యూనాలతో హార్బర్‌కు వస్తున్నాయి.
టన్ను ట్యూనాల ధర రూ.2 లక్షలు
టన్ను ట్యూనా చేపల ధర రూ.2 లక్షలు పలుకుతోంది. చిన్న ట్యూనాలైతే రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు కొనుగోలు చేస్తున్నారు. బోటు యజమానుల నుంచి వర్తకులు ఈ ట్యూనాలను కొనుగోలు చేసి కేరళతో పాటు యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కేరళలో ట్యూనాలను అమితంగా ఇష్టపడతారు. అందువల్ల ఆ రాష్ట్రంలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. యూరోపియన్ దేశాల్లో ట్యూనా చేపలను లొట్టలేసుకుని తింటారు. ఈ ట్యూనాల్లో నామాల సూర (స్కిప్ జాక్), కన్ను సూర, రెక్క సూర (ఎల్లో కిన్) వంటివి ఉంటాయి. వీటిలో కన్ను, రెక్క సూరలకంటే నామాల సూరల రేటు తక్కువగా ఉంటుంది.
కోనాంలు కూడా..
కొన్నాళ్లుగా ట్యూనాలతో పాటు కొమ్ము కోనాం, బాతు కోనాం తదితర రకాల భారీ చేపలు లభ్యమవుతున్నాయి. ఈ రకాల చేపలు కూడా పెద్ద సైజులో ఉంటాయి. ఇవి కిలో రూ.100 ధర పలుకుతోంది. ట్యూనాలకంటే ఈ కోనాం చేపలు కూడా లభించడం వల్ల బోటు యజమానులకు ఒకింత లాభదాయకంగా ఉంటోందని, లేనిపక్షంలో నష్టాలను భరించాల్సి వస్తుందని ట్యూనా వేట సాగించే బోటు యజమాని కాకి నాని ‘సాక్షి’తో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment