ఇప్పుడు విజయవాడ వాంబే కాలనీలో మియావాకి తరహా అడవులు
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో ఎండ వేడిమిని తగ్గించేందుకు.. కాంక్రీట్ జంగిల్స్‌లో ప్రాణవాయువును అధికంగా అందించేందుకు అనువైన పార్కుల రూపకల్పనకు ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ నడుం బిగించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో (అర్బన్ లోకల్ బాడీస్–యూఎల్‌బీ) ఏర్పాటు చేయబోయే గ్రీన్ బెల్ట్, పార్కులు, సెంట్రల్ మీడియన్స్ వంటి వాటిలో పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలను ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విధిగా చేపట్టాలని ఆదేశించడంతో రాష్ట్రంలోని మునిసిపాలిటీలు పట్టణాల పరిధిలో పార్కుల అభివృద్ధిని ఈ సంస్థ ద్వారా చేపడుతున్నాయి.
ఆయా యూఎల్‌బీల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో పార్కులు, పట్టణ అడవులను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ప్రజల ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు ఆరోగ్యాన్ని పెంచే మొక్కలతో సహజ అడవులను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నాలుగు ఆగ్రో క్లైమాటిక్ జోన్లలో నాలుగు పార్కులను (విజయవాడ వాంబే కాలనీ, విశాఖ సమీపంలోని సింహాచలం ఏపీజీ అండ్ బీసీ సెంట్రల్ నర్సరీ, తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి ఏపీజీ అండ్ బీసీ సెంట్రల్ నర్సరీ, అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో) పెంచారు. ఈ పార్కుల ఏర్పాటు తర్వాత స్థానికంగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదలతోపాటు, ఎక్కువ స్థాయిలో ఆక్సిజన్ ఉత్పత్తి కావడం గమనించిన అధికారులు ఈ తరహాలోనే రాష్ట్రంలోని 124 యూఎల్‌బీల్లో సహజ అడవుల పెంపకానికి సిద్ధమవుతున్నారు.
ఏమిటీ.. మియావాకి అడవులు
తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అడవుల్లా పెంచే జపాన్ విధానాన్ని మియావాకి పద్ధతి అంటారు. ఈ విధానంలో పెంపకం వల్ల మొక్కలు అత్యంత త్వరితంగా పెరగడమే కాకుండా దట్టంగా పచ్చదనం పరుచుకుని వనం మాదిరిగా కనిపిస్తుంది. నగరాల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపయుక్తమైన ఈ విధానాన్ని జపాన్‌కు చెందిన వృక్ష శాస్త్రవేత్త అకీరా మియావాకీ కనుగొనడంతో దీనికి ఈ పేరు వచ్చింది.
ఈ విధానం నేల, వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పని చేస్తుందని మియావాకీ నిరూపించాడు. పైగా ఇది పట్టణ ప్రాంతాలకు అనువుగా ఉంటూ.. సేంద్రియ పద్ధతిలో పెరిగే అడవి కావడంతో స్థానిక జీవ వైవిధ్యానికి తోడ్పాటునిస్తుంది. ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి పెంచే మొక్కల కంటే ఈ విధానంలో మొక్కలు 10 రెట్లు వేగంగా పెరగడంతో పాటు 30 రెట్లు దట్టంగా ఉండటం గమనార్హం.
మియావాకి అనుసరించిన విధానం నుంచి ప్రేరణ పొంది మన ప్రాంతానికి అనువైన ‘హైడెన్స్ ప్లాంటేషన్’ విధానంలో రాష్ట్రంలో అర్బన్ పార్కులు, మినీ అడవుల పెంపునకు గ్రీనింగ్ కార్పొరేషన్ అధికారులు, ఇంజనీర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. తక్కువ నిర్వహణ వ్యయంతో ఏడాది కాలంలోనే దట్టమైన అడవిగా మారడంతో పాటు వివిధ రకాల పక్షులు, కీటకాల వంటి జీవులకు ఇవి ఆవాసంగా మారుతున్నాయి.
విజయవాడలోని వాంబే కాలనీలో ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 150 రకాల వృక్ష జాతులతో మొత్తం 2,600 మొక్కలు ఎంపిక చేసి నాలుగేళ్ల కిందట నాటారు. ఇప్పుడు ఆ ప్రాంతం నివాసాల మధ్య సహజమైన అడవిని తలపిస్తోంది. అనేక పక్షులకు నివాసంగా మారడంతో పాటు జీవవైవిధ్యం పరిరక్షణ, కార్బన్ సీక్వెస్ట్రేషన్ (కర్బనాలను వేరు చేయడం) మెరుగుపడినట్టు గుర్తించారు.
ప్లాంటేషన్ అయిన ఎనిమిది నెలల తర్వాత విజయవాడ వాంబే కాలనీలో మియావాకి తరహా అడవులు
జీవ వైవిధ్యం, ఆక్సిజన్ పెంపునకు తోడ్పాటు
చెట్లను విచక్షణా రహితంగా నరికేస్తూ పట్టణ ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీనివల్ల ఏటా ఉష్ణోగ్రతలు, రేడియేషన్ పెరిగిపోతున్నాయి. చెట్లు లేకపోవడంతో మనుషులతో మమేకమైన అనేక పక్షి జాతులు కనిపించకుండా పోయాయి. ప్రస్తుత కాంక్రీట్ జంగిల్స్‌లో ప్రజల మనుగడకు అవసరమైన స్వచ్ఛమైన గాలి కూడా కరవవుతోంది. ఈ క్రమంలో జీవరాశి మనుగడకు, అర్బన్ అడవులు తప్పనిసరని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వియావాకి పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది.
అర ఎకరం విస్తీర్ణంలో రూ.20 లక్షల ఖర్చుతో అద్భుతమైన మియావాకి అర్బన్ పార్కును తయారు చేయవచ్చు. నాటే మొక్కల్లో పళ్ల రకాలు, నీడనిచ్చేవి, ఔషధ రకాల మొక్కలు ఉండటం వల్ల కోతులు వంటి జీవులు, పక్షులకు ఆహారం లభిస్తుంది. తద్వారా అవి పట్టణాలపై దాడి చేయడం నిలిచిపోతుందంటున్నారు. మేం రూపొందించిన 4 మియావాకి పార్కులు మంచి ఫలితాలిచ్చాయి. ప్రభుత్వ భూముల్లో ఇలాంటి పార్కుల రూపకల్పన ఎంతో అవసరం.
– పి.సత్యనారాయణ, ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్
Comments
Please login to add a commentAdd a comment