
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల విధ్వంసం.. సచివాలయాలు, సీసీ రోడ్లు, ఆర్బీకేలే లక్ష్యంగా దాడులు
సాక్షి, నెట్‌వర్క్: టీడీపీ అధికారంలోకి వచ్చి 15 రోజులు గడిచినా ఆ పార్టీ నేతలు తమ విధ్వంసాలను ఆపడం లేదు. అధికారం అండగా విచ్చలవిడిగా, యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, సీసీ రోడ్ల శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు బుధవారం పగులకొట్టారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాలను, వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మెలను ధ్వంసం చేశారు.
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేరుతో ఉన్న శిలాఫలకాన్ని పగులకొట్టారు. విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మల సురేశ్, మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరి సీఐ బాబుకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం జగన్నాథపురంలో ఆర్బీకేలు, సచివాలయాలకు అతికించిన వైఎస్ జగన్ చిత్రాన్ని, నవరత్నాల వివరాలతో కూడిన శిలాఫలకాలను టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి.
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట విజయలక్ష్మీనగర్లో సీసీ రోడ్డుకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు రెడ్డి రాధాకృష్ణ, తదితరులు ఈ దుశ్చర్యపై మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా తుమ్మపాలలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం వద్ద శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. శిలాఫలకంపై ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి అమర్నాథ్ చిత్రాలను చెరిపివేశారు. శిలాఫలకం ధ్వంసంపై సర్పంచ్ తట్టా పెంటయ్య నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతిని విరగకొట్టారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా వాటిని తొలగించారు. వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ గోపాల్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జి.అగ్రహారంలో ఒంగోలు–కర్నూలు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మెను టీడీపీ కార్యకర్తలు పాలడుగు రమేశ్, తానికొండ బాలకోటయ్య జేసీబీతో ధ్వంసం చేశారు. అలాగే జెండా దిమ్మె పక్కన కొమ్ముల కోటమ్మ రేకుల షెడ్డును కూడా కూల్చారు.