
సాక్షి, కృష్ణా: గత ప్రభుత్వం కట్టిన రిటైనింగ్ వాల్ నిరుపయోగంగా మారిందని, నిర్మాణం నాసిరకంగా కట్టడం వల్ల ఈ రోజు వాల్ ఉన్నా నీళ్లు లోపలకు వస్తున్నాయని వెఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదలకు విజయవాడలో నీటమునిగిన కృష్ణలంక ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. కృష్ణా కరకట్ట ప్రాంతంలో నీటి మునిగిన 15వ డివిజన్‌లో పర్యటించిన దేవినేని మీడియోతో మాట్లాడారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చి చేరుతుందని, బ్యారేజ్ నుంచి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారని తెలిపారు. క్రమంగా వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గత పాలకులు నిర్లక్ష్యంతో రిటైనింగ్ వాల్ నిర్మాణం సగంలో ఆపేశారని తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం సగంలో ఆపడం కారణంగానే ప్రస్తుతం ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. స్థానిక ఎమ్యెల్యే మాటలు తప్ప ఎక్కడ చేతలు కనబడవని, రిటైనింగ్ వాల్ నిర్మాణం కచ్చితంగా ప్రభుత్వం చేసి తీరుతుందని తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాల్ నిర్మాణానికి డబ్బులు కేటాయించారని గుర్తు చేశారు. త్వరలోనే వాల్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలను వరద కష్టాల నుంచి తప్పిస్తామని తెలిపారు. సహయక చర్యల్లో కార్యకర్తలు అందరూ ప్రజలకు తోడు ఉండాలని దేవినేని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment