
రాష్ట్రవ్యాప్తంగా పదమూడు వేల మంది బాల బాలికలను గుర్తించినట్లు డీజీపీ పేర్కొన్నారు.
సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆపరేషన్ ముస్కాన్‌లో గుర్తించిన ఏడేళ్ల బిందును డీజీపీ గౌతమ్ సవాంగ్ అక్కున చేర్చుకున్నారు. నూతన వస్త్రాలు, టెడ్డీబేర్ ఇచ్చి చిన్నారి ముఖంలో సంతోషం నింపారు. తన యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, తన కాళ్ల మీద తాను నిలబడే స్థాయి వచ్చేంత వరకు బిందును అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా గుర్తించిన పిల్లలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం కాసేపు ముచ్చటించారు. అదే విధంగా రెస్క్యూ చేసిన బాల బాలికలతో పాటు తాడేపల్లి గుడ్ షప్పర్డ్ కరుణామయి హోమ్‌లోని పిల్లలకు స్టడీ కిట్ అందజేశారు. (చదవండి: ఉత్తరాంధ్ర, సీమ వాసుల అభ్యర్థన తిరస్కృతి )
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పదమూడు వేల మంది బాల బాలికలను గుర్తించినట్లు పేర్కొన్నారు. రెస్క్యూ చేసిన వీధి బాలలు, బాల కార్మికులను చైల్డ్ వెల్ఫేర్ హోమ్ లకు తరలించినట్లు వెల్లడించారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను అప్పజెపుతామని అన్నారు. పేద పిల్లల చదువు కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు పెట్టిందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్.. వాటిని సద్వినియోగం చేసుకుని పిల్లలను బడులకు పంపాలని విజ్ఞప్తి చేశారు.