చం‍ద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు: ధర్మాన ప్రసాదరావు | Dharmana Demands Justice for Uttarandhra and Rayalaseema | Sakshi
Sakshi News home page

చం‍ద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు: ధర్మాన ప్రసాదరావు

Apr 7 2026 11:08 AM | Updated on Apr 7 2026 3:32 PM

Dharmana Demands Justice for Uttarandhra and Rayalaseema

శ్రీకాకుళం: అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా అందడమే నిజమైన ప్రజాస్వామ్యమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇవాళ శ్రీకాకుళంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తొలి ప్రధాని నెహ్రూ ఆశయాలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని చెప్పారు.

‘రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక తండ్రి లాంటి వారు.. అందరినీ సమానంగా చూడాలి. కానీ నేడు సీఎం కేవలం ఒక ప్రాంతానికే, కొద్దిమంది సంపన్నులకే కొమ్ముకాస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ హెచ్చరికలను చంద్రబాబు పెడచెవిన పెడుతున్నారు. నిధుల పంపిణీలో అసమానతల వల్లే గతంలో తెలంగాణ ఉద్యమం వచ్చిందని గుర్తుంచుకోవాలి. హైదరాబాద్‌పై పెట్టిన దృష్టి ఇతర ప్రాంతాలపై పెట్టకపోవడం వల్లే విభజన జరిగింది. మళ్లీ అదే తప్పు చేస్తూ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు.

విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం నియమించిన నిపుణుల కమిటీని చంద్రబాబు గౌరవించలేదు. అమరావతి రాజధానికి అనుకూలం కాదని నిపుణులు చెబితే వారిని అవమానించి పంపారు. రాజ్యాంగ విరుద్ధంగా అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ చట్టాన్ని సవరించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాజకీయ అవసరాల కోసం ఈ సవరణ చేయించారు’ అని చెప్పారు.

పొట్టచేతబట్టుకుని వలస.. 
అమరావతి బిల్లు సమయంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా వంటి కీలక నేతలు సభకు రాలేదని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ‘రాష్ట్ర రాజధాని ఫలానా చోటే ఉండాలని చెప్పే అధికారం కేంద్రానికి లేదని గతంలో అఫిడివిట్ ఇచ్చారు. రాజ్యాంగంలో సుప్రీంకోర్టు సీటు గురించి ఉందే తప్ప రాజధాని గురించి ఎక్కడా లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని విభజన చట్టమే స్పష్టంగా చెప్పింది. 80 ఏళ్ల వయసులో కూడా ఉత్తరాంధ్ర ప్రజలు పొట్టచేతబట్టుకుని వలస వెళ్తున్నారు.

రాయలసీమ బిడ్డగా ఉండి కూడా ఆ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారు? వెనుకబడిన ప్రాంతాల్లో కనీసం ఒక్క ఎకరా భూమిని కూడా పేదలకు పంపిణీ చేయలేదు. 60 ఏళ్లవుతున్నా ఉత్తరాంధ్రాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కావడం లేదు? విశాలమైన తీరప్రాంతం ఉన్నా ఒక్క హార్బర్ రాకుండా అడ్డుకోవడం ధర్మమేనా?

రాష్ట్ర బడ్జెట్ రూ.3.30 లక్షల కోట్లు ఉంటే శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ.1,000 కోట్లు కూడా ఇవ్వరా? లక్ష ఎకరాల్లో అమరావతిని కట్టాలంటే మౌలిక వసతులకే రూ. 2 లక్షల కోట్లు కావాలి. అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి 50 ఏళ్లు పడుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నారు.

నిధులు అన్ని అమరావతిలో పెడితే మా ప్రాంతాల పరిస్థితేంటి..

అంతకాలం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉండాలా? ఒకే ప్రాంతంపై లక్షల కోట్లు ఖర్చు పెడితే మళ్లీ హైదరాబాద్ తరహా విద్వేషాలు వస్తాయి. భవిష్యత్తు తరాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి చంద్రబాబే కల్పిస్తున్నారు.

రాష్ట్ర సంపద ఐదు కోట్ల ప్రజలకు చెందాలి కానీ ఒక్క అమరావతికే కాదు. విశాఖ, విజయనగరంలో వస్తున్న సంస్థల ఆస్తులు ఇతర ప్రాంతాల వ్యక్తులకే చెందుతున్నాయి. అభివృద్ధి చెందిన ప్రాంతాలనే మళ్లీ అభివృద్ధి చేస్తే వెనుకబడిన ప్రాంతాలకు గోచీ తప్ప ఏమీ మిగలదు. ముఖ్యమంత్రి పంతం కోసం ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలను మరుగున పడేయడం అన్యాయం.

వలసలు ఆగేలా, స్థానిక ప్రాజెక్టులు పూర్తయ్యేలా నిధులు ఎందుకు కేటాయించడం లేదు? ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కాకుండా సమాన అభివృద్ధికి సీఎం బాటలు వేయాలి. అమరావతి పేరుతో వెనుకబడిన జిల్లాల నోళ్లు నొక్కడం రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు నాయుడు తన నిర్ణయాలను పునరాలోచించుకోవాలి’ అని ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement