సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డీఐజీ త్రివిక్రమ్‌వర్మ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/కందుకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో 8 మంది మృతికి కారణమైన చంద్రబాబు నాయుడు రోడ్ షోలో నిబంధనలు ఉల్లంఘించారని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు.
గురువారం ఆయన నెల్లూరు ఎస్పీ విజయారావుతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్షించిన అనంతరం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో మాట్లాడారు.
పోలీస్ శాఖ ఎన్టీఆర్ సర్కిల్‌లో చంద్రబాబు వాహనం నిలిపి మాట్లాడేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. కానీ వాహనం మాత్రం సర్కిల్ నుంచి దాదాపు 50 మీటర్లు ముందుకు వెళ్లడంతో వెనుక వైపు ఉన్న జనం ఒక్కసారిగా ముందుకు కదిలారని తెలిపారు.
వై ఆకారంలో ఉన్న ఆ ప్రాంతంలో రెండు వైపులా జనం ముందుకు చొచ్చుకు రావడంతో ఆ చిన్న ప్రదేశంలో అప్పటికే అక్కడ ఉన్న వారు ఎటూ వెళ్లలేక ప్రమాదంబారిన పడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
పోలీస్ శాఖ అనుమతి లేకుండానే శింగరాయకొండ హైవే నుంచి చంద్రబాబు వాహనం ముందు 1,000 – 1,500 బైకులతో ర్యాలీ నిర్వహించారన్నారు. ఒకవైపు పట్టణ సీఐ బైకు ర్యాలీ వద్దని వారిస్తున్నా లెక్క చేయలేదని తెలిపారు.
అనుమతి ఇవ్వకపోయినా క్రాకర్స్ కాల్చారన్నారు. 7.30 గంటలలోపు సభ ముగించాలని ముందుగా స్థానిక డీఎస్పీ సృష్టం చేసినప్పటికీ, పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇలా పలు నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారి ఈ కేసు దర్యాప్తు చేస్తారని డీఐజీ తెలిపారు.
ఘటనపై కేసు నమోదు
కందుకూరు ఘటనలో గాయపడిన స్థానికుడు పిచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఆర్‌పీసీ 174 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి ఎవరినీ నిందితులుగా చేర్చలేదు. పూర్తి విచారణ తర్వాత అన్ని అంశాలు చేరుస్తామని పట్టణ ఎస్‌ఐ కిశోర్ తెలిపారు.
ఇదిలా ఉండగా, 8 మంది మృతదేహాలకు గురువారం ఉదయం రిమ్స్ నుంచి వచ్చిన వైద్యులు వేణుగోపాల్‌రెడ్డి, సురేష్‌ల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఊపిరి ఆడక పోవడం వల్లే వారంతా మృతి చెందారని నిర్ధారించినట్లు సమాచారం. పంచనామా అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment