కిడ్నీ సమస్యతో విజయవాడ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకరరావుకు పింఛన్ అందజేస్తున్న వలంటీర్ మహాలక్ష్మి
సాక్షి, నెట్‌వర్క్: మళ్లీ ఒకటో తేదీ రావడం ఆలస్యం.. వలంటీర్లు తెల్లవారుజామునే అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి వారికి పింఛన్ అందజేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 56,57,160 మందికి రూ.1,351.94 కోట్లు పంపిణీ చేశారు. తొలి రోజు 92.13 శాతం మందికి పింఛన్ సొమ్ము ఇచ్చామని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు. మంగళ, బుధవారాల్లో కూడా అందిస్తామని చెప్పారు.
► మార్చికి సంబంధించి మొత్తం 61,40,090 మందికి పింఛన్ల పంపిణీకి రూ.1,473.88 కోట్లను ఫిబ్రవరి 26నే అన్ని సచివాలయాల కార్యదర్శుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.
► బయోమెట్రిక్ ద్వారా పింఛన్ తీసుకోవడంలో లబ్ధిదారులకు ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మరో మూడు పద్ధతుల ద్వారా పింఛన్లు అందించేందుకు వీలు కల్పించారు. లబ్ధిదారుడి కుటుంబంలోని వేరొకరి బయోమెట్రిక్ ద్వారా డబ్బుల పంపిణీకి అవకాశమిచ్చారు.
120 కిలోమీటర్ల దూరం వెళ్లి మరీ..
120 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ ఆస్పత్రిలో ఉన్న వ్యాధిగ్రస్తురాలికి పింఛన్ అందించాడు.. చిత్తూరు జిల్లా కలకడ మండలానికి చెందిన వలంటీర్. మండలంలోని ఎనుగొండపాళ్యెం పంచాయతీకి చెందిన వలంటీర్ హరినాథ్ పరిధిలోని పి.రమణమ్మ అనే వృద్ధురాలు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆర్థికావసరాలు తెలుసుకున్న హరినాథ్ సొంత ఖర్చులతో తిరుపతికి వెళ్లి మరీ ఆమెకు పింఛన్ అందజేశాడు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం బి.కొత్తూరు వలంటీర్ చవల చినబాబు.. అంబటి అప్పారావు అనే లబ్ధిదారుడి ఇంటికి పింఛన్ ఇవ్వడానికి వెళ్లగా ఆయన అనారోగ్యంతో కాకినాడ ఆస్పత్రిలో ఉన్నట్లు బంధువులు చెప్పారు. దీంతో చినబాబు అప్పటికప్పుడు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ వెళ్లి ఆయనకు పింఛన్ అందజేశాడు. అలాగే అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివమ్మ అనే వృద్ధురాలికి గుంటూరు జిల్లా కాజ గ్రామ వెల్ఫేర్ సెక్రటరీ 16 కిలోమీటర్లు ప్రయాణించి మరీ పింఛన్ సొమ్ము అందించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ద్వారకాతిరుమల మండలం గుళ్లపాడుకు చెందిన డయాలసిస్ పేషెంట్ ఏలేటి మంగమ్మకు వలంటీర్ గొన్నూరి అంజనిమిత్ర స్వయంగా అక్కడకు వెళ్లి పింఛన్ సొమ్ము అందజేసింది.
మరికొద్ది గంటల్లో పెళ్లి కాబోతున్నా..
ఆ వలంటీర్‌కు మరికొద్ది గంటల్లో పెళ్లి కాబోతున్నా తన పరిధిలోని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశాడు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరంలో వలంటీర్ జావీద్ పెళ్లి దుస్తుల్లోనే ఇంటింటికీ వెళ్లి పింఛన్ అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.
పొలాలకెళ్లి మరీ పింఛన్ పంపిణీ
ఇంటికే కాదు.. అవసరమైతే లబ్ధిదారుల పని ప్రదేశానికి వెళ్లి మరీ పింఛన్ అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.. వలంటీర్లు. ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి (పీసీపల్లి) మండల పరిధిలోని తురకపల్లి గ్రామ వలంటీర్ శ్రీహరి తన పరిధిలోని లబ్ధిదారు కాకర్ల వరమ్మ నువ్వుల కళ్లంలో పనిచేస్తుంటే అక్కడికి వెళ్లి మరీ పింఛన్ సొమ్ము అందించాడు.
బాలింతయినా బాధ్యత మరవని వలంటీర్
పది రోజుల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చిన ఆ వలంటీర్.. అటువంటి పరిస్థితుల్లోనూ తన బాధ్యతను మరవలేదు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని జనార్దనస్వామి కాలనీకి చెందిన గ్రామ వలంటీర్ దేశాభక్తుల వరలక్ష్మి పచ్చి బాలింతరాలు. అయినప్పటికీ సోమవారం ఉదయాన్నే తన పరిధిలోని లబ్ధిదారులకు మరో వలంటీర్ సాయంతో పింఛన్లు అందజేసి అందరితో శభాష్ అనిపించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment