వైఎస్సార్ జిల్లా: కడప లా కళాశాల వెనుక వీధిలో డయాలసిస్ బాధితుడు షేక్ షావలికి రూ. 10 వేల పెన్షన్ అందజేస్తున్న వలంటీర్ స్వాతి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు బుధవారం కూడా పింఛన్ల పంపిణీ కొనసాగింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లవద్దకు వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. బుధవారం రాత్రి వరకు మొత్తం 52,68,975 మందికి రూ.1,339.71 కోట్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల్లో 86.04 శాతం మందికి పంపిణీ పూర్తయింది. మరో మూడురోజులు పంపిణీ కొనసాగుతుందని సెర్ప్ అధికారులు తెలిపారు.
కేజీహెచ్‌లో అందజేత
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రామలింగపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సబ్బవరపు విజయానంద్ విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. గ్రామ వలంటీరు గొంప ఉమా కేజీహెచ్‌కు వెళ్లి విజయానంద్‌కు పింఛన్ సొమ్ము అందజేశారు.
– విజయనగరం
ఆస్పత్రికి వెళ్లి.. పింఛను అందించి..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని బంగారుపేటకు చెందిన గోవిందయ్య అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న వార్డు వలంటీర్ సాయిచరణ్ తన సొంత ఖర్చులతో బుధవారం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి గోవిందయ్యకు పింఛన్ నగదు అందజేశారు.
– వెంకటగిరి
చికిత్స పొందుతున్న వ్యక్తికి..
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రూరల్ మండలం రామచంద్రాపురం పంచాయతీ పొన్నాంపేట గ్రామానికి చెందిన చల్లా రామారావు అనారోగ్యంతో శ్రీకాకుళం జెమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గ్రామ వలంటీర్ కోటేశ్వరమ్మ బుధవారం ఆస్పత్రికి వెళ్లి ఆయనకు పింఛను అందజేశారు.
– ఆమదాలవలస రూరల్
Comments
Please login to add a commentAdd a comment