కూతురిని కాపాడి.. తండ్రి మృత్యుఒడికి.. | East Godavari: Father Saved Daughter And Lost His Life | Sakshi
Sakshi News home page

తాను మృత్యుఒడికి చేరుతూ బిడ్డ ప్రాణాలు కాపాడిన తండ్రి

Published Wed, Apr 21 2021 1:34 PM | Last Updated on Wed, Apr 21 2021 7:00 PM

East Godavari: Father Saved Daughter And Lost His Life - Sakshi

జయబాబు మృతదేహం వద్ద విలపిస్తున్న భార్య, బంధువులు

సాక్షి, తూర్పుగోదావరి : నాన్నంటే నమ్మకం.. ఈ మాటను అక్షరాలా నిజం చేశాడో తండ్రి.. తాను మృత్యుఒడికి చేరుతూ బిడ్డ ప్రాణాలను కాపాడాడు.. వివరాలివీ.. తుని మండలం హంసవరానికి రావాడ జయబాబు(50)కు భార్య అప్పలకొండ, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె విశాఖపట్నంలో చదువుతోంది. చిన్న కుమార్తె నిర్మల గ్రామంలోనే ఇంటర్మీడియెట్‌ చదువుతోంది. భార్యభర్తలిద్దరూ కష్టపడితేనే పూట గడిచేది. రోజులాగే ఆ దంపతులు మంగళవారం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. కుమార్తె నిర్మల కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే కనిపించడంతో తల్లి అప్పలకొండకు కోపం వచ్చింది. నిర్మలను గట్టిగా మందలించింది. మనస్తాపం చెందిన నిర్మల ఆత్మహత్య చేసుకుంటానంటూ కిలో మీటరు దూరంలో రైల్వే ట్రాక్‌వద్ద ఉన్న పోలవరం ఎడమ ప్రధాన కాలువ బ్రిడ్జి పైకి పరుగు తీసింది.


భార్య, పిల్లలతో మృతుడు జయబాబు (పాత చిత్రం)

కుమార్తెను ఆపేందుకు తండ్రి జయబాబు కూడా వెంట పరుగెత్తాడు. తండ్రి కళ్లెదుటే బ్రిడ్జిపై నుంచి నిర్మల పోలవరం కాలువలోకి దూకేసింది. కూతురిని కాపాడేందుకు తండ్రి కూడా వెంటనే కాలువలోకి దూకాడు. నీట మునిగిన కూతురిని భుజాలపై ఎక్కించుకుని అతి కష్టం మీద కొంతమేర ఒడ్డుకు వచ్చాడు. ఈలోగానే ఆయాసంతో కుప్పకూలి  నీటిలో పడి గల్లంతయ్యాడు. కుమార్తె ఒడ్డున పడింది. సమీపంలో కొందరు స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది గాలించగా గంట తర్వాత జయబాబు మృతదేహం లభించింది. నిర్మల తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. భర్త మృతదేహం వద్ద అప్పలకొండ, బంధువులు బోరున విలపించారు. రూరల్‌ సీఐ కె.కిషోర్‌బాబు, ఎస్సై వై.గణేష్‌కుమార్‌ సంఘన స్థలాన్ని పరిశీలించారు.

చదవండి: 
ప్యాంట్‌ విప్పి తనిఖీ.. అవమానంతో రైలు కిందపడి
భర్త రెండో పెళ్లికి ప్లాన్‌.. ప్రాణాలు తీసుకున్న భార్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement