సాక్షి, అమరావతి: వేలాది మందికి ఉపాధి కల్పించేలా ఒక కొత్త పరిశ్రమ వస్తుంటే ‘ఈనాడు’కు ఏడుపు ముంచుకొస్తోంది. ఈ ప్రభుత్వానికి ఎక్కడ మైలేజీ ఇంకా పెరిగిపోతోందోనని ఆందోళన చెందుతోంది. ఉన్నవి లేనివి అన్నీ కలిపి.. టన్నులకొద్దీ బురదజల్లుతూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతోంది. ఏదైనా ఇండస్ట్రీ రాకపోతే ఏడవడం మామూలే అనుకుంటే.. ఎంతో మందికి ఉపకరించే పరిశ్రమ మన రాష్ట్రంలో వెలుస్తోందంటే ఎందుకు ఏడుస్తున్నట్లు? ఎవరి కోసం ఏడుస్తున్నట్లో ఇట్టే అర్థమవుతోంది.
ఇండస్ట్రియల్ హబ్ పేరుతో షిర్డిసాయి ఎలక్ట్రికల్ అనుబంధ కంపెనీ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నెల్లూరు జిల్లా రావూరు, చేవూరు గ్రామాల్లోని 4,827.04 ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టేస్తోందని మంగళవారం ‘ఈనాడు’ అక్కసు వెళ్లగక్కింది. షిర్డి సాయి ఏ విధంగా చిన్న సంస్థ? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పీఎల్‌ఐ)కు అర్హత సాధించిన కంపెనీ. ఆర్థిక స్థితిగతులు, కంపెనీ పనితీరు, సామర్థ్యం చూశాకే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది.
ఇలాంటి కంపెనీని పట్టుకుని ‘ఈనాడు’ విషం కక్కడం దుర్మార్గం. కేవలం కడపకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చెందిన సంస్థ కావడమే పాపమైపోయింది. విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములను ఎంవీవీఎస్ మూర్తి ఆక్రమించినప్పుడు ఏనాడైనా ఈనాడు ఇలాంటి కథనం రాసిందా? ‘షిర్డిసాయికి 4,827 ఎకరాలు’ శీర్షికన ప్రచురించిన ఈనాడు కథనంలో అసలు వాస్తవాలు ఇలా ఉన్నాయి.
ఆరోపణ : సీఎంకు సన్నిహితుడైన వ్యక్తికి చెందినది..
వాస్తవం : ఈ కంపెనీ కోసం ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు చాలా ఆఫర్లు ఇచ్చాయి. ప్రస్తుతం పరిశ్రమల కోసం వివిధ రాష్ట్రాలు పోటీ పడుతున్న ప్రస్తుత వాతావరణంలో ఇలాంటి కంపెనీలు వస్తున్నాయంటే రెడ్ కార్పెట్ పరుస్తారు. అలాంటివేమీ అవసరం లేకుండానే వెనకబడ్డ రామాయపట్నం లాంటి ప్రాంతంలో కంపెనీ పెట్టడానికి ముందుకొచ్చింది.
గతంలో కియా సంస్థకు ఇచ్చిన స్థాయిలో కూడా ఇండోసోల్‌కు రాయితీలు ఇవ్వలేదు. భూమి, కరెంట్, ఎస్‌జీఎస్‌టీ, మౌలిక సౌకర్యాల విషయంలోనూ కియా కంటే తక్కువ ప్రోత్సాహకాలే ఇచ్చారు. ఈ స్థాయిలో ఏ కంపెనీ వచ్చినా ఏ ప్రభుత్వమైనా సహకరిస్తుంది. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా మాత్రమే వ్యవహరిస్తుండటం.
ఆరోపణ: హైదరాబాద్‌లో రిజిస్టరైన కంపెనీ
వాస్తవం : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలోనే రిజిస్టర్ అయి ఉండక్కర్లేదు. ఉదాహరణకు కియా పరిశ్రమనే తీసుకుంటే ఆ సంస్థ మన రాష్ట్రానికి చెందిందా? కియా కోసం యూనిట్ రూ.3 చొప్పున 100 శాతం విద్యుత్‌ను 20 ఏళ్ల పాటు ఇస్తుంది. ఇండోసోల్‌కు మాత్రం 7 సంవత్సరాల పాటు యూనిట్‌కు రూ.4.5 చొప్పున, ఆ తర్వాత 8 సంవత్సరాలకు యూనిట్‌కు రూ.4.5 చొప్పున 40% విద్యుత్‌ను మాత్రమే కేటాయించారు.
సొంత విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా విద్యుత్ యూనిట్ ఏర్పాటుకు (క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను) స్థలం కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం ఇండోసాల్ తన సొంత ఖర్చుతో 7.2 గిగా వాట్స్ విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించింది. కియాకు ఎకరా రూ.6 లక్షలతో మాత్రమే సేకరించే అవకాశం ఇచ్చింది. పైగా భూమిని చదును చేసే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించింది.
ఆరోపణ: అప్పనంగా భూములు కట్టబెట్టేస్తోంది..
వాస్తవం : ఈనాడు చెబుతున్నట్టుగా 4,827 ఎకరాల భూమిని ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం లేదు. పైగా అవి ప్రభుత్వ భూములు కావు. రామాయపట్నంలో ఏపీఐఐసీ, మారిటైమ్ బోర్డ్ ద్వారా భూ సేకరణను సులభతరం చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం అమల్లో విధానం ప్రకారం భూసేకరణ కయ్యే వ్యయాన్ని పూర్తిగా మార్కెట్ ధర ప్రకారం ఇండోసోల్ కంపెనీయే భరిస్తుంది. అంతే గానీ భూమి కొనుగోలు కోసం ఇండోసోల్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీ ఇవ్వలేదు.
ఆరోపణ: కలెక్టర్ లేఖ ఆధారంగా భూ సేకరణ
వాస్తవం : దేశంలోనే అతి పెద్ద పీవీ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ కోసం ఈ భూమిని సేకరిస్తున్నారు. ఈ యూనిట్ మొదటి దశకు కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద అర్హత సాధించింది. దాని ప్రకారం జాతీయ ప్రాముఖ్యతను కలిగిన ప్రాజెక్టు కోసం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భూసేకరణ జరుగుతోంది. ఇంధన భద్రత, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అవసరమైన భాగాలపై ఆధార పడటాన్ని తగ్గించడం, గ్రామీణ విద్యుదీకరణ కోసం అవసరమైన విధానాలను కేంద్రం రూపొందించింది.
ఇండ్రస్టియల్ కారిడార్లు, హబ్‌ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల మేరకు అధిక జీతంతో కూడిన ఉద్యోగాలను సృష్టించే పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల విద్యుత్ అవసరాలను తీర్చడం వంటి అంశాలు ఈ ప్రాజెక్టులో భాగం. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దంగా, కేబినెట్ ఆమోదంతో ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుకు భూ సేకరణ కోసం చర్యలు చేపట్టింది.
ఆరోపణ: ఏళ్ల తరబడి కార్యకలాపాలు సాగించలేదు..
వాస్తవం : రాష్ట్రంలోని ప్రముఖ విద్యుత్ ఉప కరణాల తయారీ కంపెనీ షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. ఇప్పటికే షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 2,500 మందికి పైగా ఉద్యోగాలను కల్పిస్తోంది. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌ఇడిఎ) ద్వారా సమీకృత సోలార్ మాడ్యూల్ తయారీకి సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) బిడ్డింగ్‌లో రిలయన్స్, అదానీలతో పోటీ పడి ఎల్–1గా నిలిచి రూ.1875 కోట్ల రాయితీలను దక్కించుకుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఐదేళ్ల వ్యవధిలో దశల వారీగా ప్రత్యక్షంగా 11,500 మందికి, పరోక్షంగా దాదాపు 10,000 –11,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా 11,500 మందికి ఉపాధి కల్పిస్తుండటంతో రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు జాగ్రత్తగా పరిశీలించాకే ప్రోత్సాహకాలను వర్తింప చేసింది.
Comments
Please login to add a commentAdd a comment