సాక్షి, అమరావతి: విశాఖలో వచ్చే నెల 3, 4వ తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)–2023 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే లాభాల గురించి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తోంది. ఇందుకోసం అడ్వాంటేజ్ ఏపీ పేరుతో ప్రత్యేకంగా వెబ్‌సైట్ ఏర్పాటు చేయడమే కాకుండా దేశ వ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న వసతులు, పెట్టుబడులు పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఇన్వెస్టర్లకు వివరించింది.
ఏకంగా 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంతో పాటు.. సహజ వనరులను వినియోగించుకోవడం ద్వారా నిర్వహణ వ్యయం ఏ విధంగా తగ్గనుందన్న విషయాన్ని జీఐఎస్‌లో ప్రధానంగా వివరించనుంది. మలేషియా, సింగపూర్ వంటి తూర్పు దేశాలకు ముఖ ద్వారంగా ఆంధ్రప్రదేశ్ అత్యంత సమీపంగా ఉండటంతో తీర ప్రాంత వ్యాపార అభివృద్ధికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక ప్రాజెక్టులను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశాఖలో మేజర్ పోర్టుతో పాటు గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, రవ్వ క్యాపిటివ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టుతో కలిపి మొత్తం ఆరు పోర్టులు నిర్వహణలో ఉన్నాయి.
ఇప్పుడు వీటికి అదనంగా సుమారు రూ.30,000 కోట్లతో మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోంది. రామయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పోర్టుల నిర్మాణం చేపట్టగా, కాకినాడ గేట్‌వే పోర్టు పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరో పోర్టు నిర్మాణం చేపడుతోంది. ఈ పోర్టులను జాతీయ రహదారులు, రైల్వే లైన్లతో అనుసంధానం చేయడమే కాకుండా పోర్టు సమీపంలోనే పరిశ్రమలు ఏర్పాటయ్యేలా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది.
ఆరు ఎయిర్‌పోర్టులు.. గన్నవరం, విశాఖ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతిలకు అదనంగా భోగాపురం, రామాయపట్నం ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి పూనుకుంది. తద్వారా వేగంగా ఎగుమతులు, దిగుమతులతో పాటు లాజిస్టిక్ వ్యయాలు భారీగా తగ్గనున్నాయి.
చౌక ధరలకే వేల ఎకరాలు
తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత చౌకగా వేలాది ఎకరాల భూములు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై–బెంగళూరు, బెంగళూరు–హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. ఈ మూడు కారిడార్లలో పలు చోట్ల ప్రభుత్వం అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది.
ఈ కారిడార్ల పరిధిలో 46,555 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. విశాఖ–చెన్నై కారిడార్ పరిధిలో అచ్యుతాపురం, నక్కపల్లి, కడప, చిత్తూరు నోడ్స్‌ను అభివృద్ధి చేస్తుండగా, చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద, బెంగళూరు–హైదరాబాద్ కారిడార్ పరిధిలో ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన కడప నోడ్‌లో ఎకరం రూ.12 నుంచి రూ.15 లక్షలకే లభిస్తుందనే విషయాన్ని విశాఖ సమ్మిట్‌లో ప్రధానంగా వివరించనుంది.
రంగాల వారీగా ప్రత్యేక పాలసీలు
రాష్ట్రంలోని 5 కోట్ల జనాభాలో 70 శాతం మంది యువతీ యువకులే. అమెరికాలో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లలో 25 శాతం మంది తెలుగు మాట్లాడే వారే. ఈ లెక్కన పుష్కలంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఎంతగా అందుబాటులో ఉన్నాయనేది స్పష్టమవుతోంది. దీనికి తోడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం ప్రధానంగా ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం.
2021–22లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ (జీఎస్‌డీపీ) 11.43 శాతం వృద్ధితో రూ.7,46,913 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో 12.78 శాతం వృద్ధి నమోదైంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పరిపాలనను తెలియజేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం 2023–28 నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంతోపాటు వివిధ రంగాలను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది.
లాజిస్టిక్ పాలసీ 2022–27, రెన్యువబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలసీ 2020–25, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీ–22, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020–25, టూరిజం పాలసీ 2020–25, ఏపీ రిటైల్ పార్క్ పాలసీ 2021–26.. ఇలా అనేక పారిశ్రామిక పాలసీను ప్రవేశపెట్టింది. వీటన్నింటి దృష్ట్యా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా తగిన రాష్టమని విశాఖ సమ్మిట్‌లో ప్రభుత్వం వివరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment