లక్షల గళాల గర్జన  Emmiganoor road show is super hit | Sakshi
Sakshi News home page

లక్షల గళాల గర్జన 

Published Sat, Mar 30 2024 3:12 AM | Last Updated on Sat, Mar 30 2024 3:15 AM

Emmiganoor road show is super hit - Sakshi

కోడుమూరు, హంద్రీ కైరవాడి, గోనెగండ్ల, ఎమ్మిగనూరు రోడ్‌ షోలు సూపర్‌ హిట్‌ 

మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  పెత్తందార్లపై పోరుకు తామంతా సిద్ధమంటూ ఎమ్మిగనూరు వేదికగా లక్షలాది గొంతుకలు సింహగర్జన చేశాయి. పొత్తులు.. జిత్తులు.. మోసాలు.. కుట్రలను ఎదుర్కొని పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా? అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుఇవ్వడంతో లక్షల మంది పిడికిళ్లు బిగించి మేమంతా సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా  నినదించారు. చంద్రబాబు లాంటి మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను సిద్ధం... మీరంతా సిద్ధమైతే సెల్‌ఫోన్‌లో టార్చ్‌ లైట్‌ ఆన్‌ చేయాలని సీఎం జగన్‌ కోరడంతో ఒక్కసారిగా లక్షల మంది సెల్‌ఫోన్లలో టార్చ్‌ లైట్‌ వెలిగించడంతో సభా ప్రాంగణం ఆకాశంలో చుక్కలను తలపించింది.

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వీవర్స్‌ కాలనీ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో కనిపించిన దృశ్యాలివీ.. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీ సునామీ సృష్టించడం ఖాయమని ఎమ్మిగనూరు సభ మరోసారి చాటిచెప్పిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎం జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన విశ్వాసానికి ఇది  ప్రతీకగా నిలిచిందని అభివర్ణిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్‌ చేపట్టిన బస్సు యాత్ర మూడో రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర జైత్రయాత్రను తలపించింది.

గురువారం పెంచికలపాడు వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సీఎం జగన్‌ రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం కర్నూలు సిటీ, పాణ్యం, కోడుమూరు సహా పలు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఎన్నికల్లో విజయానికి చేపట్టాల్సిన చర్యలపై వారికి సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్రను ప్రారంభించి రామచంద్రాపురం మీదుగా కోడుమూరుకు చేరుకున్న సీఎం జగన్‌కు భారీ గజమాలతో అభిమానులు ఘనస్వాగతం పలికారు. కోడుమూరులో సీఎం జగన్‌ రోడ్‌ షోకు జనం బ్రహ్మరథం పట్టారు.

రోడ్‌ షో సాగుతున్నంత దూరం బస్సు ముందు చిన్నారులు కోలాటమాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది బారులుతీరి సీఎం జగన్‌పై బంతి పూలవర్షం కురిపించారు. చేనేత కార్మికులు చీరను, మగ్గాన్ని బహూకరించి సీఎం జగన్‌కు మద్దతు పలికారు. బుడగ జంగం సామాజికవర్గ ప్రజలు సీఎం జగన్‌ను కలిసిసంఘీభావం తెలిపారు. కురుబ సామాజికవర్గానికి చెందినవారు సీఎం జగన్‌కు మేకను బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

కోడుమూరు నుంచి హంద్రీ కైరవాడి చేరుకునే సమయానికి ఎండ తీవ్రత పెరిగింది. ఎండను లెక్క చేయకుండా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, చిన్నారులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి సీఎం జగన్‌పై పూలవర్షం కురిపిస్తూ వైఎస్సార్‌సీపీని గెలిపించేందుకు మేమంతా సిద్ధమంటూ... నినదించారు. గోనెగండ్లలోనూ సీఎం జగన్‌ బస్సు యాత్రకు జనం నీరాజనాలు పలికారు. అనంతరం సీఎం జగన్‌ భోజన విరామం తీసుకున్నారు.  

ఎమ్మిగనూరులో జన సునామీ.. 
భోజన విరామం అనంతరం రాళ్లదొడ్డి నుంచి బయలుదేరిన సీఎం జగన్‌ బస్సు యాత్రకు ఎర్రకోటలో జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్‌ బస్సుపై బంతిపూలవర్షం కురిపించారు. షెడ్యూలు ప్రకారం బస్సు యాత్ర ఎమ్మిగనూరుకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా, ప్రజలు అడుగడుగునా నీరాజనాలుపలకడంతో రెండుగంటలు ఆలస్యంగా 5.30 గంటలకు చేరుకుంది. సీఎం జగన్‌ ఎమ్మిగనూరుకు చేరుకునేసరికి కర్నూలు జిల్లా నలుమూల నుంచి లక్షల సంఖ్యలో జనవాహిని తరలిరావడంతో జనసంద్రాన్ని తలపించింది.

ఉదయం 11 గంటల నుంచి ఎమ్మిగనూరు వీవర్స్‌ కాలనీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి మొదలైన జనప్రవాహం సాయంత్రం 4.30 గంటలకు సునామీని తలపించింది. 30 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. పక్కనే పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కు, ఇరువైపులా రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఎమ్మిగనూరు చరిత్రలో సీఎం జగన్‌ సభ సువర్ణాక్షరాలతో లిఖించేలా నిలిచిపోతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 

జననేత కోసం నిరీక్షణ.. 
ఎమ్మిగనూరు సభ రాత్రి 7.20 గంటలకు ముగిసింది. అనంతరం బస్సుయాత్ర హనుమాపురం చేరుకుంది. సీఎం జగన్‌ను చూసేందుకు అవ్వతాతలు, మహిళలు, చిన్నారులు భారీ ఎత్తున రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డారు. సీఎం జగన్‌ రాగానే  బంతిపూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హనుమాపురం నుంచి ఆస్పరి చేరుకునే సరికి రాత్రి 8.30 గంటలైంది. బస్సు యాత్ర అక్కడికి చేరుకోగానే హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.

జన నీరాజనాల మధ్య చిన్నహుల్తి,  పత్తికొండ బైపాస్‌ మీదుగా రాతన వద్ద ఏర్పాటు చేసిన బస శిబిరానికి రాత్రి 9.47 గంటలకు సీఎం జగన్‌ చేరుకున్నారు. కర్నూలు జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ నియోజక వర్గాల్లో సాగిన బస్సు యాత్ర గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. బస్సు యాత్ర శనివారం నాలుగో రోజు ఉదయం కర్నూలు జిల్లా పత్తికొండ బైపాస్‌ నుంచి ప్రారంభమై మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది.   

ఉప్పొంగిన భావోద్వేగం 
ఐదేళ్ల పాలనలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేయడంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు తెచ్చి పేదరికాన్ని రూపుమాపడం, రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు చేపట్టిన చర్యలను వివరిస్తూ సీఎం జగన్‌ ప్రసంగించారు. 2014 ఎన్నికల్లో ప్రధాని మోదీ, పవన్‌ కళ్యాణ్, తన ఫొటోతోపాటు సంతకం చేసిన లేఖను ఇంటింటికీ పంపిన చంద్రబాబు రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోభృతిగా ఇస్తానని, చేనేత, పవర్‌లూమ్స్‌ రుణాలు మాఫీ చేస్తానని, అర్హులందరికీ మూడు సెంట్ల భూమి ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిస్తాననే ముఖ్యమైన హామీలతోపాటు 650 హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చకుండా వంచించటాన్ని ప్రస్తావించినప్పుడు లక్షల మంది ప్రజలు ఔనంటూ.. చేతులు ఎత్తి ఏకీభవించారు.

ఇప్పుడు మళ్లీ అదే పొత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలతో సూపర్‌ సిక్స్‌ అంటూ మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని, వాటిని ఎదుర్కొని పేదల భవిష్యత్తును మరింతగా గొప్ప మార్చేందుకు వైఎస్సార్‌సీపీని గెలిపిచేందుకు సిద్ధమా? అంటూ సీఎం జగన్‌ ఇచ్చిన పిలుపుతో మేమంతా సిద్ధమే.. అంటూ లక్షల గొంతుకలు ప్రతిస్పందించాయి. శింగనమలలో ఎస్సీ (మాదిగ) సామాజికవర్గానికి చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ వీరాంజనేయులకు వైఎస్సార్‌సీపీ టికెట్‌ ఇస్తే చంద్రబాబు ఎద్దేవా చేసి తన పెత్తందారీ పోకడలను రుజువు చేసుకున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు. పేదవాడు పైకి ఎదిగితే ఎందుకంత మంట? అని నిలదీశారు.

మడకశిరలో ఈర లక్కప్ప అనే ఉపాధి కూలీకి టికెట్‌ ఇచ్చామని, దాన్ని కూడా ఎద్దేవా చేస్తావా బాబూ? అని ప్రశ్నించారు. ‘‘నా...’’ అంటూ అక్కున చేర్చుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 200 శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో వంద సీట్లు ఇచ్చామని గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ పేదల పార్టీ కాబట్టే సగం సీట్లు ఇచ్చామన్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని అవహేళన చేయడంతోపాటు తోకలు కత్తిరిస్తానంటూ బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి, మైనార్టీలను అణగదొక్కిన చంద్రబాబు తోకను కత్తిరించేలా తీర్పు ఇవ్వాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చి నప్పుడు మేమంతా సిద్ధమే అంటూ లక్షల గొంతుకలు నినదించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement