సంక్షేమ పథకాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. గడప గడపకు మన ప్రభుత్వంతో నాయకులు ఇంటి వద్దకే వచ్చి అభివృద్ధిని వివరించడంతో పాటు సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తుండటం సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఈ కోవలోనే శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే రెండు విడతలుగా విజయదుందుభి మోగించిన వైఎస్సార్‌సీపీ.. హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నా తెలుగుదేశం పారీ్టలో అభ్యర్థి ఎవరనే విషయంలోనూ స్పష్టత కొరవడింది. ఇప్పటి వరకు అంటీముట్టనట్లుగా ఉన్న ఇద్దరు నాయకులు ఇప్పుడు తమ ‘ఉనికి’ చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ‘తమ్ముళ్ల’ను గందరగోళానికి గురిచేస్తుండటం గమనార్హం.
సాక్షి, నంద్యాల: శ్రీశైలం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులే విజయకేతనం ఎగరవేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై 39వేలకు పైగా మెజారీతో గెలుపొందారు. 2024లో జరిగే ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ నమోదు దిశగా పార్టీ దూసుకుపోతోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో అభ్యర్థి ఎవరనే విషయంలోనూ స్పష్టత కరువైంది. ఓటమి తప్పదని తెలిసినా ఇద్దరు నేతలు సీటు తనకంటే తనకని సిగపట్లకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా గ్రూపులుగా ఏర్పడి దూషణలకు తెరతీయడం పార్టీ పరువు బజారున పడుతోంది. ఇదే సమయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సీట్ల కేటాయింపు విషయంలో బేరం పెట్టారనే చర్చ జరుగుతోంది.
ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకుంటారో వాళ్ల వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీ వర్గీయులే చెప్పుకుంటున్నారు. ఇకపోతే 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత అధికారంలో ఉన్న టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆయనపై నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిణామం 2019 ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. టీడీపీ నుంచి పోటీ చేసిన బుడ్డా వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి చేతిలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నా.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనీస పోటీ ఇవ్వలేకపోవడం గమనార్హం.
పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసి ప్రజా క్షేత్రంలో తిరుగులేదని చాటుకుంది. లోకేశ్ మద్దతు తనకే ఉందని, జిల్లా టీడీపీ నాయకులు కూడా అభ్యర్థిగా తన పేరునే అధిష్టానికి సూచించారని చెప్పుకుంటున్న బుడ్డా పార్టీ ఫిరాయింపు మచ్చను ఇప్పటికీ తుడిచేసుకోలేకపోతున్నారు. వైఎస్సార్‌సీపీపై అభిమానంతో గెలుపును అందిస్తే.. తమ మనోభావాలను టీడీపీకి తాకట్టు పెట్టారని ప్రజలు ఇప్పటికీ ఆయనపై భగ్గుమంటున్నారు.
డబ్బు మూటలతో ఏరాసు..
ఏరాసు ప్రతాపరెడ్డి కాంగ్రెస్ హయాంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందినా.. రాష్ట్ర విభజన తర్వాత 2014లో పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేశారు. అయితే ప్రజలు ఆయనను ఆదరించకపోవడంతో ఓటమిని చవిచూశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. తాజాగా ఆయన శ్రీశైలం నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టీడీపీ తరపున పావులు కదుపుతున్నారు. ఎన్నికల సమయంలో తప్పితే ఎప్పుడూ కనిపించని, ప్రజలతో సత్సంబంధాలు లేని ఈయన డబ్బును నమ్ముకుని రాజకీయం చేసేందుకు సిద్ధమయ్యారనే చర్చ జరుగుతోంది. టిక్కెట్ తనకు ఇస్తే ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదనే విషయాన్ని ఆయన ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి తన ప్రతిపాదనను ఆయన ముందుంచినట్లు తెలిసింది. ఆ మేరకు ఆయన జనవరిలో తనను ఇన్‌చార్జ్‌గా ప్రకటిస్తారని తన వర్గంతో చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే ఏరాసు అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ నేతలు మాండ్ర శివానందరెడ్డి, గౌరు వెంకటరెడ్డి అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా వేదికగా వార్
నిన్న మొన్నటి వరకు ప్రజల్లో ఎక్కడా కనిపించని ఏరాసు ఎన్నికల సమయంలో తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేసమయంలో టీడీపీ టిక్కెట్ తనకేనని ఆయన ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో బుడ్డా వర్గం సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలకు దిగుతోంది. ఎన్నికల సమయంలో ఆయన షో చేస్తున్నారని ఘాటు గా స్పందిస్తోంది. టిక్కెట్ ఎవరికనే విషయంలో ఆ పార్టీ నిర్ణయం తీసుకోలేకపోవడం పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. ఇప్పటి ఆ పార్టీ వర్గీయులు ఒక్కొక్కరుగా వైఎస్సార్‌సీపీలో చేరిపోతుండగా.. నేతలను కూడా ఓటమి భయం వెంటాడుతోంది. వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలతో రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్ కూడా టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment