సీ బెళగల్ మండలం పోలకల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మన బడి నాడు–నేడు కింద కార్పొరేట్ స్కూలు రూపు సంతరించుకుంది. ఇప్పటివరకు ప్రహరీ లేకపోవడంతో ఆవరణలో పశువులు, పందుల సంచారం కనిపించేది. పైకప్పు పాడవడంతో నాలుగు చినుకులు పడినా తరగతి గదుల్లోకి నీరు వచ్చేది. ప్రభుత్వం ఈ పాఠశాల అభివృద్ధికి రూ.98 లక్షలు కేటాయించింది. ప్రహరీ, తరగతి గదులు నిర్మించారు. బల్లలు, టేబుళ్లు, సమకూర్చారు. ఆటస్థలం, పార్కు, అనేక ఆటవస్తువులు ఏర్పాటు చేయడంతో ఈ పాఠశాల అందరినీ ఆకట్టుకుంటోంది.
కోసిగి మండలం దుద్ది గ్రామంలోని బీసీ కాలనీలోకి గతంలో అడుగుపెట్టాలంటేనే భయం వేసేది. కాలనీలో డ్రైనేజీ సౌకర్యం లేక మురుగు నీరంతా రోడ్లపై పారి వీధులన్ని దుర్గంధంగా తయారయ్యేవి. ఆ దారిలో వెళ్లేవాళ్లు ముక్కు మూసుకోవాల్సిందే. మురుగునీరు వీధుల్లో చేరడంతో స్థానికులు తరచు అనారోగ్యాలకు గురయ్యేవారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ప్రతి నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించడంతో బీసీ కాలనీలోని రోడ్లు, డ్రైనేజీకి మోక్షం లభించింది. ప్రస్తుతం ఈ కాలనీల్లో రూ.15 లక్షలు వెచ్చించి సీసీ రోడ్లు వేశారు.
కర్నూలు (అర్బన్): రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కర్నూలు జిల్లాలోని పల్లెపల్లెలో అభివృద్ధి కుసుమాలు వికసిస్తున్నాయి. దశాబ్దాలుగా ఎవరికీ పట్టని గ్రామసీమలు ప్రగతిపథంలో సాగుతున్నాయి. గ్రామ సచివాలయ, వలంటీరు వ్యవస్థలతో ప్రజల సమస్యలన్నీ వెంటనే తీరుతున్నాయి. గ్రామాల్లో రూ.779.42 కోట్లతో కార్యాలయాల భవనాల నిర్మాణం జరుగుతోంది. దీన్లో రూ.350 కోట్లతో చేపట్టిన 876 గ్రామ సచివాలయ భవన నిర్మాణాల్లో 343 భవనాలు పూర్తయ్యాయి. రూ.184.42 కోట్లతో చేపట్టిన 845 రైతుభరోసా కేంద్ర భవనాల్లో 53 నిర్మాణాలు పూర్తవగా 81 శ్లాబ్ దశకు చేరుకున్నాయి. రూ.110 కోట్లతో 634 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం ప్రారంభించగా 56 పూర్తయ్యాయి. రూ.135 కోట్లతో 823 పాలశీతల కేంద్ర భవనాలు నిర్మించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో రూ.15 కోట్ల వంతున కర్నూలు మినహా మిగిలిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో మొత్తం రూ.195 కోట్లతో సీసీ రోడ్లు వేస్తున్నారు. అన్ని గ్రామాల్లోను పనులు సాగుతుండటంతో అందరికీ పనులు లభిస్తున్నాయి. కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలోని 611 వైఎస్సార్ జగనన్న లేఅవుట్లలో 75,774 ఇళ్లు నిర్మించనున్నారు.
రూ.325.14 కోట్లతో పాఠశాలల్లో అభివృద్ధి పనులు
జిల్లాలోని 1,080 ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి విడతగా రూ.325.14 కోట్లతో 9 రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. తాగునీరు, మరుగుదొడ్లు, పెయింటింగ్స్, ఇంగ్లిష్ ల్యాబ్ తదితర 7,827 పనులు చేపట్టారు. ఇప్పటివరకు రూ.72.23 కోట్లు వ్యయం కాగా 2,243 పనులు పూర్తయ్యాయి. 261 పాఠశాలల్లో రూ.100 కోట్లతో ప్రహరీల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికి 100 పాఠశాలల ప్రహరీ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పాఠశాలల్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
పాఠశాల రూపురేఖలు మారిపోయాయి
రాష్ట్ర ప్రభుత్వం మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు విడుదల చేయడం వల్ల మా ఊళ్లో పాఠశాల అభివృద్ధి సాధ్యమైంది. దశాబ్దాల కిందట నిర్మించిన పాఠశాలలోని పలు గదులు కూలిపోయేందుకు సిద్ధంగా ఉండేవి. ప్రభుత్వం రూ.98 లక్షలు నిధులు విడుదల చేయడంతో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో పాఠశాలను ఆధునికీకరించారు. ప్రస్తుతం ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన సాగుతోంది.
– గోవిందు, పాఠశాల కమిటీ చైర్మన్, పోలకల్, సీ బెళగల్ మండలం
సీసీ రోడ్డు వేయడం సంతోషంగా ఉంది
ఆరునెలల కిందటి వరకు బీసీ కాలనీలోని వీధులు పూర్తి అపరిశుభ్రంగా ఉండేవి. మురికినీరంతా వీధుల్లో ప్రవహించడం వల్ల దుర్గంధభరితంగా మారి.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఇతోధికంగా నిధులు విడుదల చేయడం వల్ల మురికికూపాలుగా ఉన్న వీధులన్నీ నేడు సీసీ రోడ్లతో కళకళలాడుతున్నాయి. బీసీ కాలనీలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు వేయడంతో కాలనీ ప్రజలు సంతోíÙస్తున్నారు.
– నాగరాజు, దుద్ది గ్రామం, కోసిగి మండలం
మార్చి నాటికి పూర్తిచేసేలా చర్యలు
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలను మార్చి చివరి నాటికి దాదాపు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాం. ఎన్నికల నియమావళి ఉన్న కారణంగా పాలశీతల కేంద్ర భవన నిర్మాణాలను కోడ్ ముగిసిన అనంతరం చేపడతాం. మార్చి నాటికి రూ.300 కోట్లు వ్యయం చేసేందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేస్తున్నాం.
– కె.సుబ్రమణ్యం, పంచాయతీరాజ్ ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment