సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు వరుస అబద్ధాలతో, కట్టు కథలతో రాష్ట్ర ప్రభుత్వంపై విషం జిమ్ముతున్న ఈనాడు రామోజీరావు మరోసారి అడ్డగోలు రాతలకు దిగారు. ఇళ్లు లేనివారు రాష్ట్రంలో ఒక్కరు కూడా ఉండకూడదని ప్రభుత్వం 31 లక్షల మందికి పైగా పేద మహిళలకు ఇంటి స్థలాలు ఇచ్చినా రామోజీ తట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఇళ్లను ప్రభుత్వం లబ్దిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నా ఓర్వలేక విషం జిమ్ముతున్నారు.
లక్షలాది మంది పేద అక్కచెల్లెమ్మలకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ అడ్డగోలు రాతలతో బరితెగించారు. పేదలకు ఇచ్చిన లక్షలాది ఇళ్లకు రిజిస్ట్రేషన్లు చేయడం, వారికి కన్వేయన్స్ డీడ్‌లు ఇవ్వడాన్ని తప్పుపడుతూ తన కడుపుమంటకు మందే లేదని రామోజీ చాటుకున్నారు. ఇందులో భాగంగానే ‘ఎన్‌వోసీ లేకుండా హక్కులు ఇవ్వగలరా’ అంటూ ‘ఈనాడు’లో పెడార్థాలు తీశారు.
ఎన్‌వోసీ (నిరభ్యంతర ధ్రువపత్రం) పేరుతో పేదలు భవిష్యత్తులో ఇబ్బందులు పడకూడదనే కన్వేయన్స్ డీడ్ ఇస్తారు. ఆ విషయం తెలిసి కూడా ప్రజల్లో అపోహలు సృష్టించడమే లక్ష్యంగా రామోజీ తన పచ్చ పైత్యాన్ని ప్రదర్శించారు.
ఇచ్చిన హామీ కంటే మిన్నగా..
వైఎస్సార్‌సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాలు లేని 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, వారికి ఇళ్లు కట్టించి ఇస్తామని.. వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇచ్చిన హామీ కంటే మిన్నగా ప్రభుత్వం 31.19 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో 22 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామనే మాటకు కట్టుబడి 2020లోనే జీవో ఇచ్చింది. అయితే పేదలకు మంచి జరగకూడదనే ఉద్దేశంతో టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడ్డుకున్నారు.
రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలోపు పేదలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఒకేసారి 71,811 ఎకరాల భూమిని సేకరించి డీకేటీ పట్టాలిచ్చింది. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించడానికి అసైన్ ల్యాండ్స్ (పీవోటీ) చట్టాన్ని 2021లో సవరించింది. దీనిప్రకారం.. పదేళ్ల తర్వాత ఇంటి స్థలాన్ని లబ్దిదారులు అమ్ముకునే అవకాశం కల్పించింది.
ఇళ్ల పట్టా ఇచ్చి, ఇళ్లు మంజూరు చేయడంతోపాటు ఇచ్చిన మాటకు కట్టుబడి న్యాయపరమైన అవరోధాలను అధిగమించి ఇటీవలే ఆర్డినెన్స్ తెచ్చింది. తద్వారా రిజిస్ట్రేషన్లు చేయడానికి మార్గం సుగమం చేసింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను పట్టాతో పోల్చడం ‘ఈనాడు’ దివాళాకోరుతనం కాక మరేమిటి?
రిజిస్ట్రేషన్‌కు విలువ ఉండదా?
విలువ లేని రిజిస్ట్రేషన్ అంటూ ‘ఈనాడు’ తన కథనంలో అసత్యాలను వల్లె వేసింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ని సైతం పట్టా అని తప్పుదోవ పట్టించింది. రిజిస్ట్రేషన్ చేస్తుంటే దాన్ని విలువ లేని రిజిస్ట్రేషన్ అంటారా? ఇళ్ల పట్టాకు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది. ఏకంగా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుంది కాబట్టి బ్యాంకులు త్వరగా రుణాలిస్తాయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాబట్టి డేటా బేస్‌లోనూ ఆ వివరాలన్నీ పదిలంగా ఉంటాయి.
ఎప్పుడంటే అప్పుడు సర్టిఫైడ్ కాపీ పొందొచ్చు. ఫోర్జరీ, ట్యాంపర్ భయాలు అసలు ఉండవు. ఇంటిని అమ్ముకునే సమయంలో ఈ డాక్యుమెంట్ ఒక్కటి సరిపోతుంది.. ఎటువంటి లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు. నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉండగా విలువ లేని రిజిస్ట్రేషన్ అంటూ అబద్ధాలను అచ్చేయడం ‘ఈనాడు’ కడుపు మంట కాక మరేమిటి? పట్టా రూపంలో ఇచ్చే కన్వేయన్స్ డీడ్ వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ఉపయోగం ఉండదని లబ్దిదారుల్లో అపోహ సృష్టించడమే ‘ఈనాడు’ పచ్చరాతల లక్ష్యం.
డీడ్‌లో ఏ తేదీ నుంచి లబ్దిదారులకు సర్వహక్కులు లభిస్తాయో స్పష్టంగా ఉంటుంది. ఏ విధమైన ఎన్‌వోసీ లేకుండా బదిలీ చేసుకోవచ్చు. లబ్దిదారులు ఏ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ ఎన్‌వోసీ కోసం తిరగనక్కర్లేదు. ఇది ఉపయోగం కాదా? ఎలాంటి ఉపయోగం లేదని ‘ఈనాడు’ వక్రభాష్యం చెప్పడం ఎంతవరకు సమంజసం?
వక్రీకరణలు.. అసత్యాలు..
కన్వేయన్స్ డీడ్ విధానంలో జరిగే రిజిస్ట్రేషన్ల సమయంలో షరతులు విధించినట్లు ‘ఈనాడు’ అబద్ధాలను అచ్చేసింది. ఇంటి నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేయాలనే షరతును వక్రీకరించింది. ఈనాడుకు చట్టాల మీద ఎటువంటి అవగాహన లేదని దీని ద్వారా స్పష్టమవుతోంది. ప్రతి డి పట్టా మీద ఈ షరతు ఉంటుందని చట్టాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. టీడీపీ ప్రభుత్వంలో ఒక్క డీకేటీ పట్టా అయినా ఇచ్చి ఉంటే.. ఈనాడుకు పట్టాలో పొందుపరిచే నిబంధనల గురించి తెలిసి ఉండేది.
లబ్ధిదారు రెండేళ్లలో ఇల్లు కట్టుకోలేరని తెలిసి, కన్వేయన్స్ డీడ్ చేయడానికి తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లో ఈ 24 నెలల సమయాన్ని పొడిగించే అధికారం తనకు ఉండేలా ప్రభుత్వం చూసింది. పేదల పక్షపాతి అయిన వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు అన్యాయం జరిగే ఏ నిర్ణయం తీసుకోదు. ప్రభుత్వానికి పేదలకు ఏ విధంగా మంచి చేద్దామనే ఆలోచన తప్ప మరే దురాలోచన లేదు.
Comments
Please login to add a commentAdd a comment