మహేశ్వరం: కబ్జా నుంచి తన వ్యవసాయ భూమిని విడిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హల్‌చల్ చేసిన సంఘటన కందుకూరు మండల పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. దెబ్బడగూడ గ్రామానికి చెందిన వరికుప్పల రాజు గ్రామంలోని సర్వే నంబర్ 30, 31, 33లో తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా ఈ భూమిని అదే గ్రామానికి చెందిన రాములునాయక్ కబ్జా చేసి కడీలు పాతి, ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడని, దీనిపై అధికారులు, పోలీసుల వద్దకు వెళ్లినా న్యాయం చేయలేదని, కబ్జా నుంచి భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తూ గురువారం పొలం పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కాడు. తనకు ఆ భూమి తప్ప వేరే జీవనాధారం లేదని, న్యాయం చేయకపోతే దూకి చనిపోతానని బెదిరింపులకు దిగాడు. సుమారు 2 గంటల పాటు స్తంభం పైనే ఉండి ఆ ప్రాంతమంతా హల్‌చల్ సృష్టించాడు. వెంటనే సమాచారం అందుకున్న కందుకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సంబంధిత భూమి పత్రాలు పరిశీలించి న్యాయం చేస్తామని సర్దిచెప్పడంతో రాజు స్తంభం పైనుంచి దిగాడు. దీంతో పోలీసులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ( చదవండి: భువనగిరిలో ‘రియల్ దందా’.. 700 కోట్ల అక్రమాలు! )
Comments
Please login to add a commentAdd a comment