దొండపర్తి (విశాఖ దక్షిణ): తొక్కడానికి పనికిరాకుండా పోయిన సైకిల్‌ను బాగు చేయమని ఓ కొడుకు తన తండ్రిని అడిగితే.. ఆ సైకిల్‌ను బ్యాటరీ బైక్‌గా తీర్చిదిద్దాడు ఆ తండ్రి. గుంటూరుకు చెందిన మురళీకృష్ణ పదేళ్లుగా విశాఖలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జువాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ అక్కయ్యపాలెంలో ఉంటున్నారు. తన కుమారుడు సూర్యసిద్ధార్థ (7)కు చిన్న సైకిల్ ఉండేది. అది పూర్తిగా పాడైంది. దాన్ని బాగు చేయమని కొడుకు రెండేళ్ల కిందట అడిగాడు. దీంతో పాత సైకిల్‌ను కొత్తగా తయారు చేయడం కంటే.. దాన్ని చిన్న బైక్‌గా మార్చి తన కుమారుడికి ఇవ్వాలని మురళీకృష్ణ నిర్ణయించుకుని రూ.20 వేల ఖర్చుతో బైక్‌ను రూపొందించారు.
రెండేళ్ల కష్టం..
బ్యాటరీ బైక్ తయారు చేయడానికి ఏయే వస్తువులు, సాంకేతికత అవసరమో మురళీకృష్ణ తెలుసుకున్నారు. పాత సైకిల్ సామగ్రితో పాటు స్క్రాప్‌లో దొరికిన బైక్‌ల విడిభాగాలను తీసుకుని వాటిని తాను అనుకున్న మోడల్‌లో తయారు చేసుకున్నారు. చార్జింగ్ బైక్‌ను తయారు చేసే క్రమంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. బైక్‌కు మోటర్ కోసం డ్రిల్లింగ్ మెషిన్ మోటర్‌ను ముందు వినియోగించారు. దాని సామర్థ్యం సరిపోకపోవడంతో లారీ, బస్సుల అద్దాలను శుభ్రం చేసే వైపర్ మోటర్‌ను బైక్‌కు అమర్చారు. కంప్యూటర్ యూపీఎస్ బ్యాటరీ పెట్టారు. రెండేళ్లకు తాను అనుకున్న విధంగా ‘హార్లీ డేవిడ్ సన్’ బైక్ రూపురేఖలతో చార్జింగ్ బైక్‌ను తయారు చేశారు.
బైక్ ప్రత్యేకతలు..
- బైక్‌లో ఒక్కో భాగం ఒక్కో బైక్‌కు చెందినది.
- సెల్ఫ్ స్టార్ట్, త్రీ స్పీడ్ లెవెల్స్, కిలోమీటర్ల రీడింగ్‌తో స్పీడో మీటర్
- మోనో సస్పెన్షన్, సింగల్ షాక్ అబ్జార్బర్
- ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు
- బైక్‌కు అమర్చిన నాలుగు 12 ఓల్ట్స్, 7 యాంప్స్ బ్యాటరీలను 4 గంటల పాటు చార్జ్ చేస్తే 15 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం
- 40 కిలోలు బరువును మోసే సామర్థ్యం
సంతోషంగా ఉంది
ఈ బైక్ తయారీకి రెండేళ్లు కష్టపడ్డాను. ఏ వస్తువు దొరికినా దాన్ని తీసుకుని బైక్‌కు అనువుగా మలుచుకున్నాను. చేసింది బాగోలేకపోతే వాటిని తీసి కొత్త రకంగా తయారు చేయడంతో ఖర్చు పెరిగింది. రూ.20 వేల వరకు ఖర్చు అయింది. సరిగ్గా దీనిపై దృష్టి పెడితే రూ.15 వేలకే తయారు చేయవచ్చు. నా కొడుకు ఆ బైక్‌ను డ్రైవ్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. – మురళీకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment