సాక్షి, అమరావతి : ‘పిల్లలు ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా తండ్రి వద్ద ఉంటే అది అక్రమ నిర్బంధం కాదు. పిల్లలకు తండ్రే సహజ సంరక్షకుడు. సహజ సంరక్షకుడిగా పిల్లలను తన సంరక్షణలో పెట్టుకునేందుకు తండ్రి అర్హుడు. హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు అక్రమ నిర్బంధమే పరమావధి. అక్రమ నిర్బంధం లేదా అక్రమ కస్టడీ లేనప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదు’ అని హైకోర్టు తేల్చి చెప్పింది.
తన పిల్లలను తన భర్త అక్రమంగా నిర్బంధించారంటూ ఓ మహిళ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. పిల్లల అభిప్రాయాన్ని స్వయంగా తెలుసుకున్న అనంతరం న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
తండ్రి వద్దే ఉంటామని పిల్లలు స్పష్టంగా చెప్పినందున, పిల్లల కస్టడీ కావాలనుకుంటే చట్ట ప్రకారం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని ఆ మహిళకు సూచించింది. ఆమె పిటిషన్ దాఖలు చేసుకుంటే తాము వ్యక్తపరిచిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా విచారించాలని కింది కోర్టును ఆదేశించింది.
తన పిల్లలను తన భర్త డాక్టర్ భానుమూర్తి అక్రమంగా నిర్బంధించారని, వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లాకు చెందిన దేవప్రియ శిరీష హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ చదువుతున్న తన కుమార్తెను, అలాగే ఏడేళ్ల కుమారుడిని తన భర్త బలవంతంగా తీసుకెళ్లిపోయారని తెలిపింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ భర్త ఆమెను వదిలేసి మరో మహిళతో ఉంటున్నారని, అలాంటి వ్యక్తి వద్ద పిల్లలను ఉంచడం ప్రమాదకరమని అన్నారు. ధర్మాసనం ఆదేశాల మేరకు ఇద్దరు పిల్లలను పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. పిల్లలతో న్యాయమూర్తులు మాట్లాడారు. 17 ఏళ్ల కుమార్తె మానసికంగా చాలా పరిపక్వతతో ఉన్నట్లు ధర్మాసనం తెలిపింది. హాస్టల్ నుంచి తనను తండ్రి బలవంతంగా తీసుకెళ్లలేదని, పరీక్షల అనంతరం వేసవి సెలవుల్లో తండ్రి వద్ద ఉండేందుకు తానే వెళ్లానని కుమార్తె చెప్పినట్లు పేర్కొంది.
ఏడేళ్ల కుమారుడు కూడా తండ్రితోనే ఉంటానని చెప్పాడని తెలిపింది. తండ్రితో పాటు ఉంటున్న మహిళతో కలిసి తాము తండ్రి వద్దే సంతోషంగా ఉంటామని వారిద్దరూ ధర్మాసనానికి తెలిపారు. పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, తండ్రి వద్ద ఉండటం పిల్లలకు ప్రమాదకరం కాదని స్ప ష్టం చేసింది. వారి ఇష్టానుసారమే తండ్రి వద్ద ఉంటున్నారని తెలిపింది. దీనిని అక్రమ నిర్బంధంగా చెప్పడం సాధ్యం కాదంది. దేవప్రియ శిరీష దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment