సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఆర్నెల్లుగా జ్వరానికి వాడే పారాసెటిమాల్ అత్యధికంగా వినియోగించినట్లు వైద్య ఆరోగ్యశాఖ, ఏపీఎంఎస్‌ఐడీసీ (రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) పరిశీలనలో వెల్లడైంది. కోవిడ్ నేపథ్యంలో చిన్నపాటి జ్వరం సూచనలు ఉన్నా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పారాసెటిమాల్ తీసుకుంటున్నారు. గత ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ రాష్ట్రంలో 8,13,44,410 మాత్రలను వినియోగించారు. రోజుకు సగటున 4.51 లక్షల మాత్రలకు పైగా వినియోగం నమోదైంది. కోవిడ్‌కు ముందు అంటే 2020 కంటే ముందు పోలిస్తే ఈ వినియోగం చాలా ఎక్కువగా ఉన్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది.
భారీగా నొప్పి నివారణ మందులు..
చాలామంది తాత్కాలిక ఉపశమనం కోసం నొప్పి నివారణ మందులకు అలవాటు పడినట్టు గుర్తించారు. ఆరు నెలల్లో 6.63 కోట్ల డైక్లోఫినాక్ మాత్రలు వాడారంటే పెయిన్‌కిల్లర్స్ వినియోగం ఎలా ఉందో అంచనా వేయచ్చు. ఏదైనా గాయాలైనప్పుడు, ఆపరేషన్లు, విపరీతమైన నొప్పి
ఉన్నప్పుడు తాత్కాలికంగా వాడి గాయాల తీవ్రత
తగ్గగానే ఆపాలి. కానీ చాలామంది చిన్న తలనొప్పి, ఒళ్లు నొప్పులకు కూడా పెయిన్ కిల్లర్స్‌కు అలవాటు పడ్డారు. ఇవి ఎక్కువగా వాడటం వల్ల మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
మధుమేహంతో జాగ్రత్త
ఒక్కసారి మధుమేహం వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందే. కొత్తగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. గత 180 రోజుల్లో 6.44 కోట్ల మెట్‌ఫార్మిన్ మాత్రలు వినియోగమయ్యాయి. రక్తపోటు (బీపీ) బాధితులకు ఇచ్చే అటెన్‌లాల్ మాత్రలు 3.76 కోట్లు వినియోగమయ్యాయి. బీపీ, షుగర్ చాపకింద నీరులా విస్తరిస్తున్నాయని, వ్యాయామం, ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సమయానికి తినకపోవడం, జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం లాంటి కారణాలతో గ్యాస్ సమస్యలు తలెత్తి 3.24 కోట్ల ర్యాంటిడిన్ మాత్రలు వినియోగించారు.
గత ఆర్నెల్లలో రకరకాల మాత్రలకు రూ.73 కోట్లు వెచ్చించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక డబ్లూహెచ్‌వో/జీఎంపీ (గుడ్ మాన్యుఫాక్చరింగ్ స్టాండర్డ్స్) ప్రమాణాలను అనుసరించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 510 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో 481 రకాల మందులు ఏదో ఒక సందర్భంలో వినియోగించినట్టు తేలింది. కోవిడ్ సమయంలో ఎక్కడా మందుల కొరత లేకుండా సర్కారు పటిష్ట చర్యలు చేపట్టగలిగిందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment