ప్రమాదానికి కారణమిదేనా? | Fire Accident in Hotel Swarna Palace COVID 19 Center Vijayawada | Sakshi
Sakshi News home page

విషాద 'జ్వాల'

Published Mon, Aug 10 2020 6:14 AM | Last Updated on Mon, Aug 10 2020 6:14 AM

Fire Accident in Hotel Swarna Palace COVID 19 Center Vijayawada - Sakshi

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ వద్ద సహాయక చర్యల్లో పోలీసులు

తూర్పు దిక్కున వెలుగును చిదిమేస్తూ ఎగసిపడిన అగ్నికీలలతో బెజవాడ భీతిల్లింది.. దట్టంగా అలుముకున్న పొగ ఊరంతా గాఢ నిద్రలో ఉన్న వేళ ఉత్పాతంలా విరుచుకుపడింది. కనీసం దారి కూడా కనిపించకుండా దండెత్తింది.. మహమ్మారి వైరస్‌ ఉసురు తీస్తుందోమోనన్న  భయంతో ఆస్పత్రిలో చేరిన రోగులను ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలను హరించింది.. విజయవాడ స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలో పాల్గొన్నారు.

సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడలోని హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న కోవిడ్‌కేర్‌ సెంటర్‌ అది. 31 మంది రోగులు అక్కడ చికిత్స పొందుతున్నారు. వారంతా ఎప్పటిలాగే శనివారం రాత్రి గాఢ నిద్రలోకి చేరుకున్నారు. వారికి సహాయంగా ఉన్న మరో 12 మంది ఆస్పత్రి, హోటల్‌ సిబ్బంది వారితో పాటు భవనంలోనే ఉన్నారు. వైరస్‌ బారిన పడ్డ వారిలో కొందరు ఇప్పటికే కరోనాపై విజయం సాధించి తెల్లవారితే తమ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు రెండు మూడు రోజుల్లో వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అగ్నిప్రమాద రూపంలో మృత్యువు వారిని వెంటాడింది. ప్రమాద ఘటనతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డ ఓ వ్యక్తి ఇటీవల గుండె నొప్పితో ఆస్పత్రికి వస్తే స్వర్ణ ప్యాలెస్‌లో ఉండమని సలహా ఇవ్వడంతో అతను రెండు రోజుల కిందటే అక్కడ చేరినట్లు తెలిసింది.  

కరోనా భయంతో.. 

స్వర్ణ ప్యాలెస్‌లోని కోవిడ్‌కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న రోగులందరూ స్వల్ప కరోనా లక్షణాలు కలిగిన వారే అని తెలిసింది. వీరంతా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు. అయితే కరోనా భయంతో వీరంతా రమేష్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్‌కేర్‌ సెంటర్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదంతో వీరిలో 10 మంది మృత్యువాత పడగా.. వారిలో 8 మంది కరోనా వైరస్‌ను జయించినట్లు యాంటీజెన్‌ పరీక్షల్లో తేలడం గమనార్హం. మిగిలిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది.  

శుక్రవారమే వెళ్లాల్సి ఉన్నా.. 
మృత్యువాత పడ్డ వారిలో అబ్రహాం అనే వ్యక్తికి శుక్రవారమే ఇంటికి వెళ్లాల్సి ఉంది. అయితే అతని భార్య కూడా అక్కడే చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం ఆమెకు నెగటివ్‌ రావడంతో ఆదివారం ఉదయం ఇంటికి వెళ్దామని నిర్ణయించుకొని శనివారం రాత్రి అక్కడే ఉండిపోవడంతో మృత్యువు వారిద్దరిని కబళించడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.  

తక్షణ స్పందనతో తప్పిన ప్రమాదం 
స్వర్ణప్యాలెస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని తెలిసిన నాలుగు నిమిషాల్లోనే అగ్నిమాపక దళాలు ప్రమాదస్థలికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు.  
వీరికి పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు తోడయ్యాయి. తొలుత మంటలను అదుపులోకి తెచ్చి అగ్నిమాపక సిబ్బంది ఆ వెంటనే మెట్ల మార్గం ద్వారా భవనంలోకి చేరుకునే ప్రయత్నం చేశారు.  
అది వీలు కాకపోవడంతో వారంతా నిచ్చెన సాయంతో పై అంతస్తులకు చేరుకుని రోగులను రక్షించారు.  
ఈ నేపథ్యంలో మొదటి, రెండో అంతస్తులో ఉన్న కిటికీల అద్దాలను పగులగొట్టి బాధితులను సురక్షితంగా కిందకు చేర్చారు.  
కింద నుంచి మంటలు చెలరేగి దట్టంగా పొగలు అలుముకోవడంతో రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న రోగులు కొందరు శ్వాస సంబంధిత సమస్యతో మృతి చెందినట్లు సమాచారం.  
మిగిలిన వారిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షణ కవచంగా నిలిచి ప్రాణాలతో రక్షించారు. రాష్ట్ర డీజీపీ గౌతంసవాంగ్, అగ్నిమాపక డీజీ హసన్‌ రెజా, నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, కలెక్టర్‌ ఇంతియాజ్, జేసీ శివశంకర్‌ తదితరులు ఎప్పటికప్పుడు అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.  

శోకసంద్రంలో పేట 
జగ్గయ్యపేట అర్బన్‌: విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో జగ్గయ్యపేటకు చెందిన బేతెస్థ చర్చి పాస్టర్‌ సబ్బతి రత్న అబ్రహాం(49), ఆయన సతీమణి రాజకుమారి(45) దంపతులు కానరాలి లోకాలకు చేరారు. జగ్గయ్యపేట ప్రాంతంలో పెద్ద సంఘంగా ఉన్న బేతస్థ చర్చికి అబ్రహాం పాస్లర్‌గా 23 ఏళ్లుగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం, కూతురు ఫెయిత్‌ స్థానిక వాగ్దేది మహిళా కళాశాలలో డిగ్రీ ఫైనల్‌ చదువుతుండగా.. కుమారుడు రత్న ఫెలిసిటి స్థానిక జేఆర్సీ కళాశాలలో ఇటీవల ఇంటర్‌ పూర్తి చేశాడు. వారికి ప్రస్తుతం గార్డియన్‌గా అబ్రహాం తల్లి శాంతా రత్నరాజు ఉన్నారు. బంధువులు, మిత్రులు, వేలాది మంది చర్చి సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

కొడాలిలో విషాదఛాయలు 
ఘంటసాల(అవనిగడ్డ): విజయవాడలో స్వర్ణప్యాలెస్‌లో అగ్నిప్రమాదంలో  పొట్లూరి పూర్ణచంద్రరావు (80) మృతి చెందడంతో కొడాలిలో విషాదఛాయలు అలముకున్నాయి. మండల పరిధిలోని కొడాలికి చెందిన పూర్ణచంద్రరావు గతంలో గుంటూరులో చీఫ్‌ ప్లానింగ్‌ అధికారిగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. గత పాలకవర్గంలో కొడాలి పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన సొసైటీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే మండల పరిధిలోని శ్రీకాకుళంలో కరోనా స్వాబ్‌ పరీక్ష చేయించుకున్నారు. ఫలితాలు రావడానికి సమయం పడుతుందని చెప్పగా, శ్వాస ఇబ్బంది వల్ల ఈనెల 6వ తేదీన విజయవాడలోని రమేష్‌ వైద్యశాలలో చేరి.. స్వర్ణ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా పరీక్షలో నెగిటివ్‌ రాగా.. శ్వాస సంబంధ వ్యాధితో చికిత్స పొందుతున్న ఆయన మరికొద్ది రోజుల్లో డిశ్చార్జి అయ్యేవారు. అంతలోనే ఆదివారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

ప్రమాదానికి కారణమిదేనా?
కోవిడ్‌–19 నిబంధనల నేపథ్యంలో హోటల్‌ స్వర్ణప్యాలెస్‌ మూడు నెలలుగా మూతబడి ఉంది. దీంతో ఇందులో ఏసీలు, ఫ్యాన్లు ఇతరత్రా వేటిని వినియోగించడం లేదు. గత నెల 18న రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం ఈ హోటల్‌ను లీజుకు తీసుకుని అందులో కోవిడ్‌కేర్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది. రోగుల కోసం ఫ్యాన్లు, ఏసీలు నిరంతరాయంగా నిర్వహించడం జరుగుతోంది. పురాతన హోటల్‌ కావడం.. అంతర్గత వైరింగ్‌ బలహీన పడటంతో అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. విద్యుత్తు కనెక్షన్లన్నింటికీ సంబంధించి మదర్‌బోర్డు రిసెప్షన్‌లో ఉండటం వల్ల ఇక్కడే ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అంతర్గతంగా వైర్లు వేడెక్కి మంటలు చెలరేగి ఉంటాయని, శానిటైజేషన్‌ వల్ల కూడా సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రాణాలతో వస్తాననుకోలేదు.. 
స్వర్ణప్యాలెస్‌ నుంచి ప్రాణాలతో వస్తాననుకోలేదు. ఆ సమయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎటువెళ్లాలో అర్థం కాలేదు. దట్టమైన పొగ నల్లగా కమ్ముకుంది. వేగంగా మంటలు వ్యాపించాయి. ఎటువెళ్లాలో తెలియని స్థితిలో కిటికీలు పగులగొట్టుకుని కారిడార్‌లోకి వచ్చి కాపాడండి అంటూ అరిచాను. తేరుకుని పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించాను. వారు తక్షణమే స్పందించి కాపాడారు. ఈ రోజు ప్రాణాలతో ఉన్నానంటే ఫైర్, పోలీసు సిబ్బంది చలువే.   – సీహెచ్‌ పవన్‌సాయి కిషన్, జగ్గయ్యపేట  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement