సాక్షి, అమరావతి: పార్టీ రహిత పంచాయతీ సమరంలో బ్యాలెట్ పేపర్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో జరగనున్న నేపథ్యంలో 2,723 సర్పంచి, 20,157 వార్డు సభ్యుల పదవులకు మంగళవారం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ ముగిసిన వెంటనే అక్కడే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. తొలిసారిగా పంచాయతీ ఎన్నికలలోనూ ‘నోటా’గుర్తు ప్రవేశపెట్టారు. అయితే ఓట్ల లెక్కింపు సమయంలో నోటా గుర్తుకు వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకోకుండా పోటీలో ఉన్న అభ్యర్థులలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలుపొందినట్లు ప్రకటిస్తారు. కాగా బ్యాలెట్ పేపరులో అభ్యర్థుల గుర్తులు మారడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు గ్రామాల్లో చివరి నిమిషంలో వార్డు సభ్యుల ఎన్నికలు మాత్రం ఆగిపోయాయి. ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు యథాతథంగా జరగనున్నాయి.
525 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం..
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లన్నింటినీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అప్పగించారని, అందుకనుగుణంగా అంతా సిద్ధం చేసినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ చేయగా 525 చోట్ల సర్పంచి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా వెలిచెర్ల గ్రామంలో సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,723 చోట్ల సర్పంచి పదవులకు ఎన్నికలు జరుగుతున్నట్లు వివరించారు. ఆయా చోట్ల మొత్తం 7,506 మంది పోటీలో ఉన్నట్లు చెప్పారు. మొత్తం 32,502 వార్డు సభ్యుల పదవులకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతుండగా 12,185 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, మరో 160 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 20,157 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ద్వివేదీ తెలిపారు. వార్డు పదవులకు 43,601 మంది పోటీలో ఉన్నట్లు వివరించారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్తున్న సిబ్బంది
అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 3,594..
తొలివిడతలో 29,732 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనుండగా 3,594 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా, మరో 3,458 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల కోసం 48,449 బ్యాలెట్ బాక్స్‌లను వినియోగిస్తుండగా 18,608 పెద్దవి , 8,503 మధ్య రకం, 21,338 చిన్న బ్యాలెట్ బాక్స్‌లను ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. పోలింగ్ విధులకు 83,736 మందిని, జోనల్, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లుగా 4,681 మందిని ఎన్నికల విధుల్లో వినియోగిస్తున్నట్లు చెప్పారు.
కరోనా పాజిటివ్ వ్యక్తులకు చివరి గంట సేపు అవకాశం..
కోవిడ్ నిబంధనల ప్రకారం పోలింగ్ సిబ్బందికి మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, గ్లౌజులను కేంద్రాల వారీగా సిద్ధం చేసినట్లు ద్వివేది తెలిపారు. కరోనా పాజిటివ్ వ్యక్తుల కోసం పీపీఈ కిట్లు ఏర్పాటు చేశామని, పోలింగ్ చివరిలో గంట (2.30 నుంచి 3.30 గంటల మధ్య) పాటు వారు ఓటు వేసేందుకు అనుమతిస్తున్నట్లు
తెలిపారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా వసతుల కల్పనకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
ఓట్ల లెక్కింపుపై 52,285 మందికి శిక్షణ..
పోలింగ్ ముగిసిన అనంతరం ఆ కేంద్రాల వద్దే ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు 14,535 మంది సూపర్‌వైజర్లు, 37,750 ఇతర సిబ్బందికి కౌంటింగ్ అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు ద్వివేది తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో జిల్లాకొకరు చొప్పున ప్రత్యేక అధికారులను నియమించామన్నారు.
ఓటర్లంతా హక్కు వినియోగించుకోవాలి..
ఎన్నికల సరళిని ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నట్లు చెప్పారు. మొదటి దశ పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీల్లో ఓటర్లంతా ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞఫ్తి చేశారు. కరోనా జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చి చర్యలు చేపట్టినట్లు ద్వివేదీ విలేకరులకు తెలిపారు.
రెండు గ్రామాల్లో వార్డు ఎన్నికలు నిలిపివేత: గిరిజా శంకర్
బ్యాలెట్ పేపరులో అభ్యర్థుల గుర్తులు మారడంతో పశ్చిమ గోదావరి జిల్లా బొప్పనపల్లి, వడ్డేగూడెంలో వార్డు సభ్యుల ఎన్నికలు నిలిచిపోయాయని, ఆ గ్రామాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే సమయంలో నిర్వహిస్తామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా క్యూలైన్‌లో ఉండే ఓటర్లను ధర్మల్ స్క్రీనింగ్‌తో పరీక్షించిన అనంతరం పోలింగ్ కేంద్రాలలోకి అనుమతించనున్నట్లు తెలిపారు.
టీడీపీ బరితెగింపుపై కమిషన్‌కు ఫిర్యాదు
– ఎస్‌ఈసీ తక్షణమే స్పందించాలి: లేళ్ల అప్పిరెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరింపులు, సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాల ఉపసంహరణ లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తక్షణమే స్పందించి టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలపై సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే కుంభా రవి, అంకమరెడ్డి నారాయణమూర్తి, మనోహర్‌రెడ్డి, ఎన్.పద్మజ తదితరులు ఆయన వెంట ఉన్నారు. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడంతోపాటు నామినేషన్ల సందర్భంగా పార్టీ జెండాలు, కరపత్రాలు, డబ్బులను గ్రామాల్లో పంచుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారని అప్పిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ నేతలు మద్యం, డబ్బులను పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా నిమ్మగడ్డ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఉరవకొండ, పొన్నూరు, కుప్పంలో టీడీపీ డబ్బు పంపిణీ
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గం, గుంటూరు జిల్లా పొన్నూరు, చిత్తూరు జిల్లా కుప్పంలోని గ్రామాలలో టీడీపీ శ్రేణులు డబ్బులు పంచుతూ అక్రమాలకు పాల్పడుతున్నాయని అప్పిరెడ్డి చెప్పారు. ప్రొద్దుటూరులో ప్రత్యర్థి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి దౌర్జన్యం చేసి గాయపరిచారన్నారు. 45 ఏళ్లుగా వరదరాజులరెడ్డి స్వగ్రామమైన కామనూరులో పంచాయతీ ఎన్నికలలో పోటీ లేకుండా వారి బంధువులు, అనుచరులు బెదిరించి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారన్నారు. ప్రస్తుతం కామనూరు పంచాయతీ బీసీలకు రిజర్వ్ కావడంతో వైఎస్సార్‌సీపీ అభిమాని షేక్ కరీమూన్ నామినేషన్ వేశారన్నారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సోదరులు రాఘవరెడ్డి, భార్గవరెడ్డి, హనుమంతరెడ్డిలు తీవ్రంగా ఒత్తిడి చేశారని తెలిపారు. ఆమెకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నేత బాలవరదరాజులరెడ్డి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారని చెప్పారు. తక్షణమే ఎస్‌ఈసీ జోక్యం చేసుకొని షేక్ కరీమూన్‌కు రక్షణ కల్పించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. వరదరాజులరెడ్డితో పాటు ఆయన సోదరులను తక్షణమే ఆరెస్ట్ చేయాలన్నారు.
కళ్యాణదుర్గంలో అప్రజాస్వామికంగా ఏకగ్రీవం
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కొండాపూరం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీదేవిని టీడీపీ నాయకులు చౌలం మల్లిఖార్జున, డాక్టర్ ఉన్నం మారుతీ చౌదరి, అనిల్ చౌదరి, పవన్ చౌదరి, ముత్యాలరెడ్డిలు బెదిరించి బలవంతంగా నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని చెప్పారు. దీంతో టీడీపీ బలపరిచిన త్రివేణి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైందన్నారు. ఈ అప్రజాస్వామిక ఎన్నికను రద్దు చేసి లక్ష్మీదేవి అభ్యర్థిత్వాన్ని పునరుద్ధరించి తిరిగి ఎన్నికలు నిర్వహించాలన్నారు.
పాడేరు ఏజన్సీలో పోలింగ్ సమయం మార్చాలి..
విశాఖపట్నం జిల్లా పాడేరు డివిజన్‌లో ఈనెల 17న తేదీన ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరపాలని తొలుత ఎస్‌ఈసీ నిర్ణయించారని చెప్పారు. కానీ ఇప్పుడు ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని ప్రకటించారని, ఇది పర్వత ప్రాంతం కావడంతో ఓటర్లు కాలి నడకన కి.మీ దూరం ప్రయాణం చేసి పోలింగ్ స్టేషన్‌కి చేరుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. తొలుత ప్రకటించిన ప్రకారం పాత సమయాన్నే కొనసాగించాలని కోరారు.
తొలి దశకు పటిష్ట బందోబస్తు
తొలి విడతలో భాగంగా మంగళవారం పోలింగ్ జరగనున్న గ్రామాల్లో పోలీస్ విభాగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి బాడీవోర్న్ కెమెరాలు, డ్రోన్లు, కాల్ సెంటర్, డయల్ 100 వంటి వాటిని వినియోగిస్తున్నారు. అలాగే సోమవారం ఏజెన్సీ ప్రాంతాలకు చేరిన పోలీసు బలగాలు గ్రామాల్లో తిరిగి.. ఓటు వేసేందుకు రావాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్‌లు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపైనా ప్రత్యేక నిఘా పెట్టారు. కాగా, 2013లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి తొలిదశ పోలింగ్ ముందు రోజు వరకు 87 కేసులు నమోదైతే.. ఈసారి 44 కేసులే నమోదయ్యాయి. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యానికి.. పోలీసులు, ఎస్‌ఈబీ సిబ్బంది సరిహద్దుల్లో చెక్ పెడుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని డీజీపీ సవాంగ్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment