
సాక్షి, అమరావతి/హిందూపురం: రాష్ట్రంలో తొలి వ్యాక్సినేషన్ తయారీ యూనిట్ త్వరలో అందుబాటులోకి రానుంది. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు వద్ద ఇండస్ జీన్ ఎక్స్‌ప్రెషన్స్ లిమిటెడ్ రూ.720 కోట్లతో బయో టెక్నాలజీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. మొత్తం 3 దశల్లో అభివృద్ధి చేయనున్న ఈ యూనిట్ తొలి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి దశలో రూ.220 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి కావచ్చాయి. ఇక్కడ సిద్ధమవుతున్న బయో టెక్నాలజీ యూనిట్ ద్వారా క్యాన్సర్, ఆర్థరైటిస్, మధుమేహం వంటి వ్యాధులపై పరిశోధనలు చేయనున్నారు.
యూనిట్ పనులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. బయో మెడిసిన్ ఉత్పత్తి, ల్యాబ్స్‌ను పరిశీలించారు. అనంతరం మంత్రి మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ.. బయో టెక్నాలజీ హబ్‌గా ఎదిగేందుకు అనంతపురం జిల్లాకు అపార అవకాశాలున్నాయని చెప్పారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించాలని సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారని చెప్పారు. ఈ పర్యటనలో పాల్గొన్న సీఎంవో ప్రత్యేక అధికారి హరికృష్ణ మాట్లాడుతూ ఇది రాష్ట్రంలో నెలకొల్పుతున్న తొలి వ్యాక్సిన్ తయారీ కేంద్రమని, త్వరలో ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. వారి వెంట మంత్రి శంకరనారాయణ, ఎంపీ మాధవ్ తదితరులు ఉన్నారు.
ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉపాధి
ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా స్థానికంగా వెయ్యి మంది బయో టెక్నాలజీ సైంటిస్టులు, బయోకెమిస్ట్రీ విద్యార్థులకు అవకాశాలు లభిస్తాయని ఇండస్ జీన్ కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతోపాటు మరో 1,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment