
సాక్షి, తిరుమల: కాలం చెల్లిన వాహనాలు ఇకపై తిరుమలతో పాటు, ఘాట్ రోడ్లపై అనుమతి కోల్పోనున్నాయి. ఈ మేరకు గురువారం తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య పాత వాహనాల నిషేధాన్ని వెల్లడించారు. పది ఏళ్లు పూర్తి చేసుకున్న వాహనాలను ఇకపై తిరుమలకి అనుమతించేది లేదని తెలిపారు. పాతవి, ఫిట్‌నెస్ లేని వాహనాలను తిరుమల ఘాట్ రోడ్లపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 2010 కంటే ముందు రిజిస్టరైన వాహనాలను తిరుమలకు తీసుకురాకూడదని, ఫిట్‌నెస్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించమని ఆయన వెల్లడించారు.
రెండో ఘాట్ రోడ్డులోని శ్రీవారి సహజ శిలా స్వరూపం కనిపించే ప్రదేశంలో వాహనాలు నిలిపేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆ ప్రదేశంలో భక్తులు వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమల క్షేత్రం ‘నో హారన్’ జోన్ కావడంతో భక్తులు తమ వాహనాల హారన్ మోగించకూడదని సూచించారు. వాహనాల హారన్ మోగించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం జరిమానా విధిస్తామని ఏయస్పీ మునిరామయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment