పలు ప్రాంతాల్లో నీటిలో చిక్కుకున్న ప్రజలు
ఏలూరు జిల్లాలో కొట్టుకుపోయిన కారు.. ఐదుగురు సురక్షితం
కామవరం వద్ద అడవిలో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చిన స్థానికులు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేపల వేటకు వెళ్లిన వారిని కాపాడిన గ్రామస్తులు
సాక్షి నెట్‌వర్క్: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల ఆనకట్టలు దెబ్బ తింటున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు, అధికారులు రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు, వైరా ఏరు, మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోలోనూ మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెనాలి మండలంలో 28.4 మి.మీ వర్షపాతం నమోదైంది.
వరి, పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని, నీరు పొలాల్లో నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం 41.6 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. 2 వేల ఎకరాల్లోని తొలకరి పంట నీట మునిగింది. తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 67.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో వరి నాట్లు, ఆకుకూరలు, కూరగాయల పంటలు నీటిలో మునిగాయి. ఓ వైపు గోదావరి, మరోవైపు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
సహాయక చర్యలకు విద్యుత్ శాఖ, జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. జిల్లాలోని దేవరాపల్లి వద్ద ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నీరు గుండుగొలను – కొవ్వూరు మధ్య జాతీయ రహదారిపై నుంచి ప్రవహించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలోకి చేరింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 46.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోసమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు చేరింది. అధికారులు ఆలయాన్ని మూసివేశారు.
కాలువలో కొట్టుకుపోయిన కారు.. ఐదుగురిని కాపాడిన గిరిజనులు
ఏలూరు జిల్లాలో పెదవాగు గేట్లు ఎత్తేయడంతో వేలేరుపాడు మండలం అల్లూరినగర్ వద్ద కొడిసెల కాలువ పొంగి ప్రవహిస్తోంది. మేడేపల్లి నుంచి రుద్రమకోట వైపు వెళ్తున్న కారును స్థానికులు అడ్డుకొని, వెళ్లవద్దని వారించారు. అయినా వినకుండా కారు వెళ్లడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయింది. ఇంతలో కారు డోర్లు తెరుచుకోవడంతో అందులో ఉన్న లింగవరపు జ్యోతి, గడ్డం సాయికుమారి, పిల్లలు కుందన కుమార్, జగదీష్‌కుమార్, డ్రైవర్ రామారావు పెదవాగు ప్రవాహం వైపు కొట్టుకుపోయారు.
అదృష్టవశాత్తూ చెట్ల కొమ్మలు దొరకడంతో వాటిని పట్టుకుని అలానే ఉండిపోయారు. వారి అరుపులు విని అల్లూరి నగర్, కోయ మాధవరం గ్రామాల గిరిజనులు వచ్చి, తాళ్ల సహాయంతో వారి వద్దకు చేరుకున్నారు. ఐదు గంటలు శ్రమించి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అడవి నుంచి 100 మంది సురక్షితంగా బయటకు ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో కామవరం అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి గురువారం ఉదయం పలువురు భక్తులు కొండ వాగు దాటుకొని వెళ్లారు. అప్పటికి వాగులో సాధారణ ప్రవాహం ఉంది.
భారీ వర్షాలకు మధ్యాహ్నం కొండవాగు ఒక్కసారిగా పొంగడంతో సుమారు 100 మంది భక్తులు, వ్యాపారులు గుడి వద్దే చిక్కుకుపోయారు. ఓ పక్క వాగు పొంగడం, మరోపక్క వర్షం కూడా కురుస్తుండటంతో సాయంత్రానికి కూడా వారు బయటకు రాలేకపోయారు. మరోపక్క చీకటి పడుతుండటంతో అడవిలో ప్రాణ భయమూ నెలకొంది. దీంతో స్థానికులు రంగంలోకి దిగారు.
వారి సాయంతో గుడి దగ్గర చిక్కుకున్న వారు సుమారు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ అతి కష్టం మీద వాగు దాటుకొని రాత్రి 8:30 గంటలకు కామవరం చేరుకున్నారు. వర్షాలు తగ్గే వరకు గుబ్బల మంగమ్మ దర్శనాన్ని నిలిపివేస్తున్నామని ఆలయం ప్రతినిధులు కోర్సా కన్నపరాజు, గుజ్జా రామారావు, కోర్సా సుబ్బు, మడివి బొజ్జి, తెల్లం ప్రసాద్, కుర్సం వెంకటస్వామి తెలిపారు.
చేపల వేటకు వెళ్లి.. వాగులో చిక్కుకుని..
అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్ పురం మండలం గుర్రంపేటకు చెందిన పూనెం నాగమణి, సోడె సంధ్యారాణి, కారం వెంకటేష్, మొట్టుం బాబూరావు, మొట్టుం సురేష్ గురువారం సాయంత్రం పెదవాగు వద్దకు చేపల వేటకు వెళ్లారు. వాగు ప్రవాహం పెరగడంతో ఒక్కసారిగా నీరు చుట్టుముట్టింది. బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో కాపాడాలంటూ పెద్దగా కేకలు పెట్టారు.
కొద్ది దూరంలో గొర్రెలు మేపుకొంటున్న సరిహద్దు రాజేశ్వరావు అధికారులకు సమాచారమిచ్చారు. తహసీల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్ , కూనవరం ఎస్‌ఐ శ్రీనివాస్, జెడ్పీటీసీ వాళ్ల రంగారెడ్డి, ఎంపీటీసీ పూనెం ప్రదీప్ వెంటనే అక్కడికి వచ్చారు. గ్రామంలోని యువకులతో కలసి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment