Andhra Pradesh CM YS Jagan Speech At Kunavaram Alluri District With Flood Victims - Sakshi
Sakshi News home page

అధికారులను నిలదీయడానికి రాలేదు.. శభాష్‌ అని చెప్పడానికే వచ్చా: సీఎం జగన్‌

Published Mon, Aug 7 2023 1:23 PM | Last Updated on Mon, Aug 7 2023 3:20 PM

CM YS Jagan Speech At Kunavaram Alluri District With Flood Victims - Sakshi

సాక్షి, అల్లూరి సీతారామరాజు: కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలపై  కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వరద బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం జగన్‌ తెలిపారు. సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చామని..నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అధికారులు వారంపాటు గ్రామాల్లోనే ఉండి.. వరద బాధితులకు నిత్యవసరాలు అందించారని పేర్కొన్నారు.

డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం ప్రభుత్వానికి లేదు
వరదల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ10 వేలు ఇవ్వాలని , ఇళ్లలోకి నీరు వచ్చినన వారికి రూ. 2 వేలు ఆర్థికసాయం ఇచ్చామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి తనకు చెప్పాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదని, ఏ ఒక్క బాధితుడు మిగిలిపోకుండా సాయం అందించారని తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే మా తాపత్రయమని.. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

సీఎం జగన్‌ ఇంకేం మాట్లాడరంటే..
‘కొన్ని రోజుల కిందట గోదావరి నది పొంగి వరద వచ్చిన పరిస్థితుల్లో దాదాపు 16 లక్షల క్యూసెక్కుల పరివాహంతో నీళ్లు వచ్చాయి. మన ప్రాంతాలకు ఎక్కడెక్కడ దెబ్బ తగిలి నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి కలెక్టర్‌కు వరద వచ్చినప్పుడే ఆదేశాలు ఇచ్చాం. మొట్టమొదటి సారిగా వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గతానికంటే భిన్నంగా చూశారు.

సాయం అందలేదనే మాట రావొద్దని ఆదేశించాం
మనందరి ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు ఏ నష్టం వచ్చినా కూడా అది ఏ ఫొటోల కోసమో లేకపోతే అప్పటికప్పుడు వచ్చి అధికార యంత్రాంగం అంతా నా చుట్టూ తిరుగుతున్నట్లు చేయడమో చేయలేదు. అధికారులకు కావాల్సిన వనరులు ఇచ్చి వారం రోజుల పాటు సహాయ కార్యక్రమాలకు ఏ మాత్రం అలసత్వం లేకుండా చేయాలని చెప్పాం. కలెక్టర్లకు సదుపాయాలు ఇచ్చి, గ్రామ సచివాలయాల దగ్గర నుంచి వలంటీర్ల నుంచి యాక్టివేట్‌ చేశాం. వారం రోజుల తర్వాత నేను వస్తాను, గ్రామాల్లో తిరిగినప్పుడు మాకు రావాల్సిన సాయం అందలేదనే మాట ఎవరైనా అంటే అది బాగుండదని ఆదేశాలు ఇచ్చాం’ అని పేర్కొన్నారు.
చదవండి: పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్‌ కోసం ఆలోచించదు: సీఎం జగన్‌

సాయం అందకుంటే నాకు చెప్పండి
► గొప్పగా, ట్రాన్స్‌పరెంట్‌గా ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని తాపత్రయ పడే ప్రభుత్వం మనది. 
►మనందరి ప్రభుత్వంలో డబ్బులు ఎలా మిగిలించుకోవాలనే తాపత్రయం లేదు. 
► ఏ ఒక్కరూ మిగిలిపోకూడదనే తపన, తాపత్రయం ఉంది. 
►ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితుల్లో ఏ కుటుంబానికైనా ఆ ఇంటికి నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడమే కాకుండా రూ.2 వేలు ఇవ్వకపోయి ఉంటే తప్పే. 
►అలా జరగకపోతే ఎవరైనా నాకు చెప్పవచ్చు. 

ప్రతి ఇంటికీ 10 వేలు ఇవ్వాలని ఆదేశం
► ఇళ్లలోకి నీళ్లు రాకపోయినా మన గ్రామాలు కటాఫ్‌ అయిపోయి ఉంటే, ఆ ఇళ్లకు రేషన్‌ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
►25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్‌, పాలు, కూరగాయలు ఇటువంటివన్నీ 5 రకాలు కలిపి ఇచ్చే కార్యక్రమం చేయాలని ఆదేశించాం. 
► అటువంటివి ఎవరికైనా దక్కకపోయి ఉంటే ఇక్కడ చెప్పొచ్చు. దానికి ప్రభుత్వం జవాబుదారీ తనం తీసుకుంటుంది. 
►కచ్చా ఇళ్లుగానీ, ఇళ్లు దెబ్బతినడం గానీ జరిగితే పార్షియల్లీ దెబ్బతినిందని, పూర్తిగా దెబ్బతినిందని వ్యత్యాసం వద్దు.
►పేదవాడికి ఎటువంటి వ్యత్యాసం చూపించవద్దని, పూర్తిగా ప్రతి ఇంటికీ 10 వేలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. 
►ఎన్యుమరేషన్‌ చేసే ఖాతాలోకి రాకపోయి ఉంటే అది కూడా తప్పే. 

అందరికీ మేలు జరగాలి
► ప్రతి అడుగులోనూ, గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాలు పెడుతున్నాం. అందరికీ మేలు జరగాలని పెట్టాం.
►పొరపాటున నష్టం జరిగి ఉండి జాబితాలో పేరు లేకపోతే వెంటనే జాబితాలోకి పేరు చేర్చి మంచి జరిగించే కార్యక్రమం చేయడం కోసమే మీ జగన్‌ మీ దగ్గరకు వచ్చాడు. 
►ఈ ప్రభుత్వం మీది అని తెలియజేస్తున్నా. మీరంతా తోడుగా ఉన్నారు కాబట్టే మీ బిడ్డ ఈరోజు సీఎం స్థానంలో కూర్చున్నాడు. 
►మీలో ఏ ఒక్కరికి ఏ కష్టమొచ్చినా దానికి తీర్చడం కోసం ఎళ్లవేలళా కృషి చేస్తాడు. 
► మీలో కొంత మందికి మాట్లాడటానికి మైక్‌ ఇస్తా. మాట్లాడొచ్చు.

పోలవరం పునరావాస ప్యాకేజీ 
►ఈ ప్రాంతానికి జనరల్‌ ఇష్యూ ఉంది. పోలవరం ప్యాకేజీకి సంబంధించింది. 
►ఇంతకు ముందు కూడా మీ అందరికీ ఇదే చెప్పాం..
►మీ జగన్‌లో కల్మషం లేదు. మీ జగన్‌ ఎప్పుడైనా మంచి చేయడం కోసమే ఆరాటం, పోరాటం చేస్తాడని తెలియజేస్తున్నా.
► గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు 41.05లో కాంటూర్‌లెవల్‌లో మావి లేనప్పటికీ కటాఫ్‌ అయిపోయిన గ్రామాల్లో మేము ఉండిపోతామని చెప్పడం జరిగింది. 
► అటువంటి గ్రామాలకు మంచి చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చి వెళ్లిన తర్వాత సర్వే చేయించాం. 
►32 గ్రామాలు 48 హ్యాబిటేషన్లను 41.15 దాకా మొదటి స్టేజ్‌ కింద నిలబెట్టినా కూడా ఆ మొదటి దఫా నిలబెట్టినప్పుడు కూడా కటాఫ్‌ అయిపోయిన గ్రామాల్లోకి నీళ్లు నిలబడటం వల్ల మరో 48 గ్రామాలు చేరుతాయి. 
►ఈ గ్రామాలకు వెళ్లడానికి దారి ఉండదు. కాబట్టి వాటిని చేర్చాలని సర్వే చేయించి, దాని ద్వారా ఇందులోకి సైంటిఫిక్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఆయా గ్రామాలను తీసుకొచ్చాం. 
చదవండి: స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్న భూమన

మూడు దశల్లో పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతాం
►ఆ గ్రామాలన్నిటినీ కేంద్ర ప్రభుత్వానికి పంపాం. 
►41.15 మీటర్ల దాకా నీళ్లు నింపాలంటే 3 దఫాలుగా నింపాలి. 
► ఒకటే స్టేజీలో నింపితే లీకేజీ అవుతుందనే ఉద్దేశంతో 3 ఫేజుల్లో నింపాలి. 
► మూడు సంవత్సరాల్లో 3 ఫేజుల్లో డ్యామ్‌ను నింపాలని సీడబ్ల్యూసీ నిబంధనల్లో ఉంది. 
►డ్యామ్‌ కట్టిన తర్వాత నీళ్లు నింపేది 41.15కు నింపుతారు. 
►కాంటూర్‌ లెవల్‌లో వచ్చే ప్రతి నిర్వాసిత కుటుంబాలకు కూడా వాళ్లందరికీ ఇవ్వాల్సిన ప్యాకేజీ ఇచ్చి, అందరికీ న్యాయం చేయడం జరుగుతుంది. 

సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ ఆదేశాల ప్రకారమే ముందుకు
► నిర్వాసితులను చూసుకోవంతో పాటు సర్వే ద్వారా 32 గ్రామాలకు సంబంధించి 48 హ్యాబిటేషన్లు కూడా ఫస్ట్‌ ఫేజ్‌లోకి తీసుకురావడం జరుగుతోంది. 
► దాని వల్ల 41.15 మీటర్లకు సంబంధించి ఎవరెవరికి ఏమేం రావాలో ఫస్ట్‌ ఫేజ్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. 
►మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే లిడార్‌ సర్వే పూర్తి చేశాం. కేంద్రానికి పంపి ఒప్పించడం జరిగింది. 
►దేవుడి దయతో ఈ నెలాఖరుకల్లా కేబినెట్‌ దాకా పోయే కార్యక్రమం జరుగుతోంది.
►పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాళ్లు సంతకాలు పెట్టడం జరిగింది. 
► సీడబ్ల్యూసీ వాళ్లకు చేరింది. మరో వారం దాటేలోపు కేంద్ర జలశక్తి వాళ్లు క్లియర్‌ చేసి పంపుతారు. 

 కేంద్రంమే స్వయంగా పరిహారం చెల్లించినా పర్వాలేదు.
► ప్రధాని మోదీకి నేను రాసిన లేఖలో ఒకటే చెప్పా.. అయ్యా మీరే బటన్‌ నొక్కండి నేరుగా మీరే బ్యాంకు అకౌంట్లలోకి డబ్బులు పంపించండి. 
► మేమే చెయ్యాలని ఆరాట పడటం లేదు. ప్రజలకు మంచి జరగాలని తాపత్రయ పడుతున్నాం. 
►క్రెడిట్‌ ఎవరికి వచ్చినా పర్వాలేదు. నాకు కావాల్సిందల్లా మంచి జరగాలి. ఇంతకన్నా నాకు వేరే అవసరం లేదని చెప్పా. 
►ఆర్‌అండ్‌ ఆర్‌ కింద ఇవ్వాల్సినవన్నీ జరిగిపోతాయి. లిడార్‌ సర్వేలో వచ్చిన 48 హేబిటేషన్ష్‌ కూడా కవర్‌ అవుతాయి. 
► ఇక్కడి ప్రజలు సంతోష పడాలంటే ఇదొక్కటి జరిగించాలి. 

కేంద్రంపై ఒత్తిడి
►కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6.8 లక్షల పునరావాస ప్యాకేజీకి తోడు 3.9 లక్షల ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనమే ఇస్తాం. జీవో ఇష్యూ చేశాం. 
►మీ బిడ్డ కట్టుబడి ఉన్నాడని తెలియజేస్తున్నా. 
►దేవుడు ఆశీర్వదిస్తే మీకు రావాల్సిన ప్యాకేజీపై మంచే జరుగుతుంది. ఎన్నికలకు వెళ్లేలోపు కేంద్రం ఇవ్వాల్సినవి, రాష్ట్రం నుంచి ఇవ్వాల్సినవి వచ్చే ఆరేడు నెలల్లో  మీకు అందేలా చేస్తాం
► ఇక్కడ మీ బిడ్డ మీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. గట్టిగా కృషి చేస్తున్నాడు.
► వైఎస్సార్‌ హయాంలోనే లిడార్‌ సర్వే, దీని ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది.
►సైంటిఫిక్‌గా జరిగింది. ఎవరకీ అన్యాయం జరగదు.
►మా సంకల్పం అంతా ప్రజలకు న్యాయం చేయడమే.
►పోలవరంపై ఎప్పటికప్పుడు కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నాం.

చంద్రబాబు పట్టించుకోలేదు
►పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్‌ కోసం ఆలోచించదు. ప్రజలకు న్యాయం చేయడమే మా సంకల్పం
►ఇంతకు ముందు పాలకుల మాదిరిగా ఇంత ఇస్తే సరిపోతుంది, పోలవరం కట్టే అధికారం ఇస్తే సరిపోతుందని అనుకోలేదు.
► గతంలో పాలకులు చెప్పింది మార్పు చేస్తూ, వాళ్లరందరికీ జ్ఞానోదయం అయ్యటట్లుగా చేశాం. 
►2013, 2014కు సంబంధించిన రేట్లు ఇచ్చి 2022లో ఇస్తే ప్రాజెక్టు ఎలా చేయగలుగుతారు మీరే ఆలోచించండి చెప్పాం.
►పోలవరం బాధితుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు
►పోలవరం నిర్మా ణంలో చంద్రబాబు బుద్ధి లేకుండా వ్యవహరించారు.
► మీరైనా ఆలోచన చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యక్రమం చేశాడు మీ బిడ్డ.

శభాష్‌ అని చెప్పి, వెన్ను తట్టడానికే వచ్చా
►పోలవరానికి సంబంధించిన ఈ విషయాలన్నీ ఈ పద్ధతిలో జరిగిపోతాయి. 
►ఈ వరదకు సంబంధించి మీకు ఏ మంచి జరిగింది? కలెక్టర్‌ ఏ విధంగా చేయించాడు. 
►కూనవరం ఎస్‌ఐ వెంకటేశ్‌ గురించి మంచి వార్త విన్నా.. గొప్పగా ఆదుకున్నాడు, నిలబడ్డాడని విన్నా. 
►కలెక్టర్‌కు చెప్పా ఆగస్టు 15న ఇచ్చే మెడల్స్‌లో ఆయన పేరు ఉండాలని సూచించాను. 
►నేను అధికారులను నిలదీయడానికి రాలేదు. 
► అధికారులకు శభాష్‌ అని చెప్పి, వెన్ను తట్టి బాగా చేశాడు అని చెప్పడం కోసం, మీ దగ్గర నుంచి ఆ రకంగా మంచి సమాధానాలు వస్తాయని వినడం కోసం వచ్చా.

నష్టపోయామనే మాట ఎక్కడా వినపడకూడదు
►ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే అధికారులు, ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. 
►ఏదైనా పరిష్కరించడం కోసమేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 
►పోలవరం ప్రాజెక్టు మొదట్లో దివంగత వైఎస్సార్‌ హయాంలో ల్యాండ్‌ అక్విజేషన్‌ జరిగినప్పుడు లక్ష, లక్షన్నరకు కొనుగోలు చేశారు.
►దాన్ని నేను 5 లక్షలు ఇస్తానని చెప్పాను. 
►ఆ మిగిలిన 3.5 లక్షలు కూడా కచ్చితంగా ఇచ్చేస్తాం. 
►మీ బిడ్డ వల్ల నష్టపోయామనే మాట ఎక్కడా వినపడదని చెబుతున్నా.
►మీ బిడ్డ మంచే చేస్తాడు. చెడు మాత్రం ఎప్పుడూ మీ బిడ్డ చేయడని గుర్తు పెట్టుకోండి’ అంటూ సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement