యలమంచిలి టికెట్ జనసేనకు ఇచ్చారని తెలిసి కుర్చీలు, సామగ్రి ధ్వంసం చేసిన తమ్ముళ్లు
రాజీనామాలు చేస్తామంటూ పోలవరం నేతల హెచ్చరిక
పొత్తుల వ్యవహారం పలు జిల్లాల్లో చిచ్చురేపింది. ఇప్పటికే జనసేన పొత్తు ఖరారు కాగా.. తాజాగా బీజేపీ కూడా చేతులు కలపడం.. సీట్ల కేటాయింపులు కూడా జరిగిపోవడంతో ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ ఆశావహులు భగ్గుమన్నారు. కొన్ని చోట్ల శనివారం తమ అనుచరులతో నిరసన గళాలు వినిపించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని కొనసాగుతుంటే తమ ఆశలను నట్టేటా ముంచారని అధినేతపై మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో పార్టీ సమావేశంలో కుర్చీలు, సామగ్రి ధ్వంసం చేసి టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. పలు చోట్ల నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు.
యలమంచిలి రూరల్/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, పుట్టపర్తి/పాడేరు: పొత్తులో భాగంగా అనకాపల్లి జిల్లా యలమంచిలి టికెట్ జనసేనకు కేటాయిస్తున్నట్టు టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిన సమాచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహజ్వాలలు రగిలించింది. ఐదేళ్లూ పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని జనసేనకు టికెట్ కట్టబెట్టడమేమిటని ప్రశ్నిస్తూ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. తమ నేతకు సీటు ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు.
ఈ మేరకు తమ అసంతృప్తిని తెలియజేస్తూ శనివారం యలమంచిలి పట్టణంలోని కల్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో కుర్చీలు, సామగ్రి ధ్వంసం చేశారు. సీనియర్లంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు వేదికపైకి దూసుకెళ్లడంతో సమావేశం రసాభాసగా మారింది. ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంతో ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావుకు తీవ్ర అన్యాయం చేశారని పలువురు నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ప్రగడ నాగేశ్వర్రావుకు మొండిచెయ్యి చూí³స్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. అధిష్టానం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే సీనియర్లతోపాటు కార్యకర్తలంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించారు.
పోలవరంలో పొత్తు రగడ
ఏలూరు జిల్లా పోలవరంలో పొత్తు రగడ తారస్థాయికి చేరింది. టికెట్ జనసేనకు కేటాయించామని టీడీపీ నేతలకు పార్టీ స్పష్టత ఇవ్వడంతో అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంది. శనివారం నియోజకవర్గ ఇన్‌చార్జి బొరగం శ్రీనివాస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం తెలుగుదేశం పార్టీలో ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఏళ్ల తరబడి నుంచి టికెట్ కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది.
అయితే ఇద్దరిలో ఎవరికి వచ్చినా ఫర్వాలేదు.. ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు కేటాయించవద్దంటూ జిల్లా అధ్యక్షుడు మొదలుకొని జాతీయ అధ్యక్షుడి వరకు అందరికీ విన్నవించారు. కట్ చేస్తే.. ఈ సీటు జనసేనకు కేటాయించి.. పొత్తు ధర్మం పాటించండి అంటూ చంద్రబాబునాయుడు నుంచి ఫోన్ రావడంపై బొరగం శ్రీనివాస్ వర్గం మండిపడుతోంది. శనివారం నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్ నేతృత్వంలో బుట్టాయగూడెంలో ఏడు మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సీటు ఇవ్వకపోతే సామూహిక రాజీనామా చేస్తామని హెచ్చరించారు.
అయోమయంలో టీడీపీ శ్రేణులు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో నలుగురైదుగురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఎవరిని సీటు వరిస్తుందో తెలియని పరిస్థితి. ఈ సారీ జనసేనకో, బీజేపీకో కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి, కిల్లు రమేష్‌నాయుడు, ఎంవీఎస్ ప్రసాద్ తదితరులు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు.
‘శంఖారావం’ను పట్టించుకోని నేతలు
నారా లోకేశ్ చేపట్టిన శంఖారావ సభలు ‘శంకా’రావాలుగా మారిపోతున్నాయి. పుట్టపర్తి జిల్లాలో శంఖారావ సభలకు శుక్రవారం వచ్చిన లోకేశ్ టికెట్ల ఖరారుపై స్పష్టత ఇస్తారని స్థానిక టీడీపీ నేతలు భావించారు. కానీ ఆయన ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమయ్యారు. ఫలితంగా ధర్మవరం టికెట్ ఆశిస్తున్న పరిటాల శ్రీరామ్, కదిరిపై ఆశలు పెట్టుకున్న వెంకటప్రసాద్, పుట్టపర్తి టికెట్ కోరుతున్న పల్లె రఘునాథరెడ్డి అలకబూనారని తెలిసింది.
బీజేపీతో పొత్తులో భాగంగా హిందూపురం పార్లమెంటులో ఏ సీటు ఇస్తారనే దానిపై టీడీపీ నాయకుల్లో గుబులు రేగుతోంది. లోకేశ్ శంఖారావం సభలను కీలక నేతలు పట్టించుకోలేదు. మడకశిరలో గుండుమల తిప్పేస్వామి, పెనుకొండలో బీకే పార్థసారథి వర్గాలు లోకేశ్ సభలకు గైర్హాజరయ్యాయి. నాయకులు పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి లేకుండా ఫ్లెక్సీలు, పేపరు ప్రకటనలు రావడం గమనార్హం. పల్లెకు టికెట్ వద్దని కొందరు తెగేసి చెబుతున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment