10 పాసైతే చాలు కోర్సులో చేరిపోవచ్చు​.. అదిరేటి రుచులతో ఆదాయం మీ సొంతం | Food Craft Institute In Visakhapatnam | Sakshi
Sakshi News home page

10 పాసైతే చాలు.. కోర్సులో చేరిపోవచ్చు​.. అదిరేటి రుచులతో ఆదాయం మీ సొంతం

Published Mon, Aug 1 2022 10:45 AM | Last Updated on Mon, Aug 1 2022 2:35 PM

Food Craft Institute In Visakhapatnam - Sakshi

వంట చేయడం గొప్ప కళ. ఆ కళను ఉపాధి మార్చుకుని అదిరేటి రుచులు అందించే వారే ఆధునిక నలభీములు. ఆతిథ్య రంగంలో చెఫ్‌లకు అంతర్జాతీయంగా ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ప్రాంతీయ సంస్కృతికి ప్రాధాన్యమిస్తూనే ఆహారంలో ఆధునికత, కొత్త ఆవిష్కరణలతో రాణిస్తే.. కాకా హోటల్‌ నుంచి కార్పొరేట్‌ కిచెన్‌ వరకు విస్తృతమైన అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలను అందుకోవాలంటే నైపుణ్యాలు తప్పనిసరి. పాకశాస్త్రంలో సిద్ధహస్తులను తయారు చేస్తున్న సంస్థలెన్నో ఉన్నా.. రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థ ఒక్కటే ఉంది. అదే విశాఖలో నిర్వహిస్తున్న ఫుడ్‌క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌. ఈ నలభీముల తయారీ సంస్థకు 35 ఏళ్లు పూర్తయింది. ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో దేశ, విదేశాల్లో చెఫ్‌లుగా రాణిస్తూ.. ఆహా అనిపించే కమ్మని రుచులను అందిస్తున్నారు.

విశాఖపట్నం: నగరంలో జాతీయ రహదారిని ఆనుకుని రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయం పక్కనే ఫుడ్‌క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఉంది. అతి తక్కువ ఫీజుతో ప్రభుత్వమే నిర్వహిస్తున్న ఈ ఇన్‌స్టిట్యూట్‌కు 35 ఏళ్లు పూర్తయింది. ప్రస్తుతం ఇక్కడ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ పరిమితమైన సీట్లు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలోనే ఏకైక ఫుడ్‌క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ఆగస్టు 11 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

 
కనీస అర్హత 10వ తరగతి 
ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడానికి కనీస అర్హత పదో తరగతి. 25 ఏళ్లు లోపు ఉండాలి. దీన్ని ఈ ఏడాది నుంచి 30 ఏళ్లకు పెంచాలని వినతులు వచ్చినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన వారికి స్టేట్‌ బోర్డు ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో కోర్సు ముగిసిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇండ్రస్టియల్‌ ట్రైనింగ్‌ ఇచ్చి సర్టిఫికెట్‌ అందజేస్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో ఇక్కడ మరింత నాణ్యత ప్రమాణాలతో కూడిన ల్యాబ్‌ (ప్రయోగశాల)ను ఇటీవల ఆధునికీకరించారు.

ప్రైవేట్‌ ఫుడ్‌క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు దీటుగా ఇక్కడ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అన్ని రకాలైన వంటకాల్లోనూ తరీ్ఫదు ఇచ్చి వారితోనే తయారు చేయిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు తయారు చేస్తున్న వంటకాలను ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌ ఎప్పటికప్పుడు రుచులు చూసి.. మరింత మెరుగు కోసం సూచనలు, సలహాలు ఇస్తున్నారు.  

ఇక్కడ అందించే కోర్సులివే.. 
ప్రస్తుతం ఇక్కడ ఫుడ్‌ ప్రొడెక్షన్‌ అండ్‌ పెటిసరీ, బేకరీ అండ్‌ కన్ఫెక్షనరీ, ఫుడ్‌ సరీ్వస్‌ ఆపరేషన్స్‌ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఏడాదిన్నర కాల వ్యవధి గల కోర్సులు. ఏడాది పాటు థియరీ, ఆరు నెలల పాటు ఇండ్రస్టియల్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. ఇందులో భాగంగా నగరంలో స్టార్‌ హోటళ్లలో ఇండ్రస్టియల్‌ ట్రైనింగ్‌కు పంపిస్తారు. ఇక్కడ ప్రయోగశాలలో ప్రాక్టీస్‌ చేయిస్తారు.

ఇక్కడ విశాలమైన వంట గది(ప్రయోగశాల) ఉంది. ఇందులో శిక్షణ పొందే వారికి వివిధ రకాల వంటకాలు తయారు చేయడంలో తరీ్ఫదు ఇస్తారు. ఆంధ్ర, తెలంగాణ వంటకాలు, దక్షిణ, ఉత్తర భారత దేశంలో ప్రసిద్ధి వంటకాలు చేయడం నేర్పుతారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు నగరంతో పాటు వివిధ ముఖ్య పట్టణాలు, దేశ విదేశాల్లోని స్టార్‌ హోటళ్లు, ఆతిథ్య రంగంలో ఉపాధి పొందుతున్నారు. షిప్‌ల్లో కూడా పనిచేస్తున్నారు. కొందరు సొంతంగా హోటళ్లు, పార్లర్లు, పాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు నిర్వహిస్తూ.. 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 

ప్రవేశాలు జరుగుతున్నాయి 
ఇక్కడ తక్కువ ఫీజుతో కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. రాష్ట్రంలో ఇదొక్కటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్‌క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌. అందుకే ఇక్కడ కోర్సులకు డిమాండ్‌ ఉంది. 10 తరగతి చదువుకుని 25 ఏళ్ల వయసు లోపు వారికి ప్రవేశాలు కలి్పస్తున్నాం. ఇక్కడ శిక్షణ పొందిన వారికి విదేశాల్లో సైతం ఉద్యోగాలు లభిస్తున్నాయి. అందుకే 25 ఏళ్లు దాటిన వారు కూడా శిక్షణ కావాలని కోరుతున్నారు. కనీస అర్హత 30 ఏళ్లకు పొడిగిస్తే మరింత మంది శిక్షణ తీసుకుని అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఈ విద్యా సంవత్సరానికి ఆగస్టు 11 నుంచి తరగతులు ప్రారంభిస్తాం. ప్రవేశాలు పొందాలనుకునే వారు నేరుగా వచ్చి ఇన్‌స్టిట్యూట్‌లో సంప్రదించవచ్చు.
 – రవి, ప్రిన్సిపాల్, ఫుడ్‌క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement