
సాక్షి, అమరావతి: రాజధానిని నిర్ణయించేప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధిని, పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని.. అమరావతి విషయంలో అది జరగలేదంటూ విశ్రాంత ఐజీ సుందర్ కుమార్‌దాస్ హైకోర్టును ఆశ్రయించారు. పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాల్లో తననూ ప్రతివాదిగా చేర్చుకుని, తన వాదనలూ వినాలంటూ ఆయన ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లో పేర్కొన్న ప్రధాన అంశాలివీ..
గత ప్రభుత్వానికి రహస్య అజెండా ఉంది..
► గత ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఏకపక్షంగా నిర్ణయించింది. ప్రపంచంలో అత్యధిక రాజధానులన్నీ ప్రజలందరి ఆమోదం మేరకు తటస్థ ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి.
► ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అప్పటి ప్రభుత్వం నామమాత్రంగా మార్చేసింది. శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులకు విరుద్ధంగా విజయవాడ–గుంటూరులలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు అప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో చాలా వ్యూహాత్మకంగా తీర్మానం చేసింది.
► విజయవాడ–గుంటూరులో రాజధాని ఏర్పాటు చేయాలని ముందుగానే నిర్ణయించి.. ఆ మేరకు అప్పటి ప్రభుత్వం పావులు కదిపింది. దీని వెనుక అప్పటి ప్రభుత్వానికి రహస్య అజెండా ఉంది.
► పాలక వర్గానికి చెందిన వారికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. ఇందులో అనేక రాజకీయ ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి.
► ఆఫ్రికా దేశాల్లో నియంతలు ఓ నిర్ధిష్ట రహస్య అజెండాతో తమకు కావాల్సిన ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించేవారు. తద్వారా తమ వాణిజ్య, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు పెద్దపీట వేసేవారు. అమరావతి విషయంలోనూ అలాగే జరిగింది.
► అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్ పర్యావరణం, సామాజిక, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రపంచ బ్యాంకు ఇన్‌స్పెక్షన్ ప్యానెల్ నివేదిక ఇచ్చింది. దీంతో ప్రపంచ బ్యాంక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
► ప్రస్తుత ప్రభుత్వం అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి కోసం, పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శాసన వ్యవస్థ నిర్ణయాల్లో న్యాయ సమీక్ష చెల్లదు.
Comments
Please login to add a commentAdd a comment