సాక్షి ప్రతినిధి, కడప: ప్రైవేట్ వ్యక్తుల రియల్ ఎస్టేట్ వెంచర్‌ను ధ్వంసం చేసి అనంతరం కనిపించకుండా పోయిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోలీసుల కళ్లుగప్పి చెన్నై చేరుకున్నట్లు సమాచారం. మారెడ్డి రవీంద్రనాథరెడ్డి అలియాస్ బీటెక్ రవి మార్చి 30 ఆదివారం వైఎస్సార్ జిల్లా చక్రాయపేటలో ఈ దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకుని తన పొలిటికల్ గాడ్‌ఫాదర్‌ను ఆశ్రయించి గట్టెక్కే మార్గం సూచించాలని కోరారు. దీంతో హైదరాబాద్ నుంచి ఆ గాడ్‌ఫాదర్ స్పెషల్ ఫ్లయిట్‌లో మంగళవారం చెన్నైకి చేర్చారు.
అందుకే బీటెక్ రవి దౌర్జన్యం..
పులివెందుల నియోజకవర్గంలో దౌర్జన్యం చేయగలిగామని చెప్పుకునేందుకు బీటెక్ రవికి ఇప్పుడు రాజకీయ అవసరం ఎంతో ఉంది. అందుకు.. తిరగబడే స్వభావం తక్కువగా ఉన్న చక్రాయపేట ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల వెంచర్‌ను ధ్వంసం చేయడానికి అసలు కారణం అదేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక గత ఆదివారం దౌర్జన్యానికి పాల్పడ్డ బీటెక్ రవిని పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆయన హైదరాబాద్‌లో తన పొలిటికల్ గాడ్‌ఫాదర్‌ను ఆశ్రయించారు. దీంతో, బీజేపీలో కొనసాగుతున్న పూర్వపు టీడీపీ నేత సీఎం రమేష్ తెరపైకి వచ్చారు. అనంతరం.. సీఎం రమేష్, ఎం.రవీందర్, పి.శ్రీనివాసరావు అనే వ్యక్తులు ప్రత్యేక విమానంలో వెళ్తున్నట్లు అనుమతులు పొంది చెన్నై చేరుకున్నారు. అయితే, పోలీసులు గుర్తించకుండా ఉండేందుకే బీటెక్ రవి తన పేరును ఎం.రవీందర్‌గా మార్చుకున్నట్లు సమాచారం.
మరోవైపు.. చక్రాయపేట ఘటనలో 32మందిని గుర్తించి వారిలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టుచేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. అయితే, వీరందరినీ ముందుండి నడిపించిన బీటెక్ రవి ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లడం, మరో పేరుతో ఇతర ప్రాంతాలకు పారిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘నీతి, నిజాయితీ, దమ్మూ, ధైర్యం ఉంటే సదరు రియల్ ఎస్టేట్ వెంచర్ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురా.. నీ నిజాయితీ నిరూపించుకో..’ అంటూ నిజమైన్ వెంచర్ యజమానులు ఆ పోస్టులో సవాల్ విసురుతున్నారు.
ఇది కూడా చదవండి: దోషులు ఎవరూ తప్పించుకోలేరు: మంత్రి తానేటి వనిత
Comments
Please login to add a commentAdd a comment