డాక్టర్ వైఎస్‌ఆర్ ఉచిత భోజనం, వసతి భవనం
సాక్షి: కడప అర్బన్ : ఆస్పత్రికి వచ్చే రోగుల సహాయకులు ఎవరూ ఇబ్బంది పడకూడదు. దు:ఖంలో ఉన్నవారికి కొంతయినా చేయూతనివ్వాలి... వారి ఆకలి తీర్చాలి. వసతి కల్పించాలి... ఎంత ఖర్చయినా సొంతంగానే భరించాలని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి సంకల్పించారు... అనుకున్నట్లే రోగుల సహాయకుల సౌకర్యార్థం కడప రిమ్స్‌లో భోజనం, వసతి కోసం శాశ్వత భవనాన్ని నిర్మించారు. రెండు పూటలా ఆకలి తీరుస్తూ, వసతి కల్పిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ప్రాంగణంలో రోగుల సహాయకుల కోసం శాశ్వతంగా రెండు పూటలా ఉచిత భోజనం, రాత్రి వేళ వసతి కల్పించారు.
కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి సొంత ఖర్చులతో ఈనెల 1న ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే తల్లిదండ్రులు స్వర్గీయ పోచిమరెడ్డి తులశమ్మ, రామాంజులరెడ్డి జ్ఞాపకార్థం శాశ్వత భవనాన్ని నిర్మించారు. లోపలికి వెళ్లగానే కుడి, ఎడమ వైపుగా భోజనశాలకు వెళ్లేదారి ఉంటుంది. రెండువైపులా రెండేసి విశ్రాంతి గదులు ఉన్నాయి. ఒక్కో గదిలో 14 మంది విశ్రాంతి తీసుకునేలా పడకలు ఏర్పాటు చేశారు. ప్రతి బ్యాచ్‌కు 50 మంది చొప్పున భోజనం చేసేందుకు లోపలికి అనుమతిస్తారు. ప్రతి రోజూ భోజన వసతికే సుమారు రూ. 15 వేల నుంచి 20 వేల వరకు ఖర్చు చేస్తున్నారు.
రోగుల సహాయకుల కోసం వసతి గది
టోకెన్ ఇలా..
ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 7 గంటల లోపు రిమ్స్ ఐపీ విభాగం సిబ్బంది వార్డులలో తిరిగి, రోగుల సహాయకులకు టోకన్లు అందజేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు రాత్రి భోజనం కోసం మళ్లీ టోకన్లు ఇస్తారు.
శుభ్రం.. రుచికరం
అన్నం, పప్పు లేదా సాంబార్, తాళింపు, రసం లేక మజ్జిగ తప్పనిసరిగా వడ్డిస్తారు. భోజనం తయారీ కోసం వాడే నీళ్లు పరిశుభ్రంగా ఉండేందుకు భవనం పైభాగాన ప్యూరిఫైడ్ వా టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అందులో నుంచి ప్యూరిఫై అయిన నీళ్లనే కూలింగ్ చేసి సహాయకులకు ఇస్తున్నారు. వేసవి కావడంతో బుధవారం నుంచి రసంతో పాటు, మజ్జిగను కూడా తప్పనిసరిగా భోజనంతో పాటు ఇస్తున్నారు.
సాయంత్రం స్పెషల్:
రాత్రి 7 నుంచి 8 గంటల లోపు పులిహోర, చిత్రన్న, పొంగలిలో ఏదోఒకటి వచ్చిన సహాయకులకు వడ్డిస్తారు. ఇందులో సాంబారు, పచ్చడిని ఇస్తున్నారు.
విశ్రాంతి కోసం:
రాత్రి వేళల్లో ఇక్కడ విశ్రాంతి తీసుకునే వారి జాబితాను రిమ్స్ అధికారులు పంపిస్తారు. లిస్టులో ఉన్నవారందరికీ విశ్రాంతి సౌకర్యం కల్పిస్తారు.
మేయర్‌గా ఉన్నపుడు ఆలోచన
రోగుల కోసం వచ్చే సహాయకులు, బంధువులు వసతి లేక గడ్డిపై పడుకొనేవారు. కడప మేయర్‌గా ఉన్న నాకు ఒక భోజన, వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ దృష్టికి తీసుకుపోయాను. స్థలం కేటాయించి భూమిపూజ చేశారు. ఆయన అకాల మరణంతో ముందుకు తీసుకుపోలేకపోయాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం, కలెక్టర్ హరికిరణ్ పదే పదే కోరడంతో నా ఆలోచనకు కార్యరూపం ఇవ్వాలనిపించింది. ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నా. – పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే, కమలాపురం
నాపేరు నాగలక్షుమ్మ. మాది కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం. నా మనవడు కొండయ్య మానసిక స్థితి సరిగా లేకపోవడంతో రిమ్స్‌లోనే ఉన్నాను. అప్పటి నుంచి రెండు పూటలా భోజనం ఉచితంగా చేస్తున్నాను. చాలా రుచికరంగా ఉంది. ఈ సౌకర్యం వల్ల ఎంతో మేలు జరుగుతోంది.
నా కుమారుడికి ఆరోగ్యం సరిగా లేదు. వారం రోజుల నుంచి రిమ్స్‌లోనే ఉంటున్నాం. ఇక్కడే భోజనం తింటున్నాం. ఎంతో రుచికరంగా ఉంది. వృథా చేయకుండా ఉపయోగించుకుంటే మంచిది. – అక్కిశెట్టి కొండయ్య, ఇడమడక, దువ్వూరు మండలం, వైఎస్‌ఆర్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment