
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వింజనంపాడు మండలం కొర్నెపాడులో శంకుస్థాపనలు చేసుకుంటున్న లబ్ధిదారులు
చిత్తశుద్ధితో పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయనే విషయాన్ని అధికార యంత్రాంగం వలంటీర్లు, పేదవర్గాల భాగస్వామ్యంతో మరోమారు నిరూపించింది. ఇటీవలే దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేరోజు 13.50 లక్షలకు పైగా కోవిడ్ టీకాలు వేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
సాక్షి, అమరావతి: చిత్తశుద్ధితో పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయనే విషయాన్ని అధికార యంత్రాంగం వలంటీర్లు, పేదవర్గాల భాగస్వామ్యంతో మరోమారు నిరూపించింది. ఇటీవలే దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేరోజు 13.50 లక్షలకు పైగా కోవిడ్ టీకాలు వేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. పేదల సొంతింటి కలను సాకారం చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మూడు రోజులపాటు నిర్వహించిన పేదల ఇళ్ల ‘మెగా గ్రౌండింగ్ మేళా’ గ్రాండ్ సక్సెస్ అయింది. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో తొలి దశలో నిర్దేశించిన ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత కాల వ్యవధిలోగా పూర్తి చేయాలన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం మేరకు రికార్డు స్థాయిలో ఆదివారం సాయంత్రానికి 6 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగాయి.
మూడు రోజుల్లో 6,05,833 శంకుస్థాపనలు
గృహ నిర్మాణ శాఖ రోజుకు లక్ష చొప్పున మూడు రోజుల్లో మూడు లక్షల ఇళ్ల శంకుస్థాపనలు చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. జిల్లా స్థాయి యంత్రాంగాలు 3.85 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభింప చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, రాజకీయ నాయకత్వ మార్గదర్శకత్వం సరిగా ఉంటే ఏదైనా సాధించగలమని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు గల ప్రభుత్వ యంత్రాంగం నిరూపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సరైన మార్గనిర్దేశం చేయడంతో రాష్ట్ర, జిల్లాస్థాయి యంత్రాంగం నుంచి గ్రామ వలంటీర్ల వరకు పేదల ఇళ్ల నిర్మాణాల ప్రారంభంలో సమష్టిగా పనిచేయడంతో ఈ కార్యక్రమం రికార్డు సృష్టించింది. గురువారం, శనివారం, ఆదివారం మూడు రోజుల్లో 3,85,714 ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయించాలని జిల్లాల యంత్రాంగాలు లక్ష్యంగా నిర్ణయించుకోగా.. మొత్తంగా 6,05,833 ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజలు పూర్తయ్యాయి.
ఇక నిర్మాణాలపైనే దృష్టి: అజయ్ జైన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్గనిర్దేశంతో రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగంతో పాటు గ్రామ, వార్డు వలంటీర్లు సమష్టిగా పనిచేయడంతో పాటు పేదలు కూడా ఉత్సాహంతో ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రావడంతో మూడు రోజుల్లో 6 లక్షలకు పైగా ఇళ్లకు శంకుస్థాపనలు సాధ్యమయ్యాయని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. ఇకనుంచి ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయడంపైనే దృష్టి సారిస్తామని చెప్పారు. శంకుస్థాపనలు చేసిన లబ్ధిదారులకు ఎటువంటి జాప్యం లేకుండా సిమెంట్, ఇసుక, స్టీలు, ఇతర మెటీరియల్ సరఫరా చేస్తామన్నారు. ఇళ్ల శంకుస్థాపనల ఉద్యమ స్ఫూర్తిని నిర్మాణాలు పూర్తిచేసే వరకు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మిగతా లబ్ధిదారుల చేత కూడా ఇళ్ల నిర్మాణాలకు త్వరగా శంకుస్థాపనలు చేయించి, నిర్మాణాలు చేపట్టడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు.