
పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజలతో మమేకమైన ఎమ్మెల్సీ విక్రాంత్, ఎమ్మెల్యే కళావతి
సాక్షి, నెట్‌వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారుల బృందానికి ఊరూవాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి నెలా ఒకటో తారీఖునే ఠంచనుగా ఉదయమే రూ.2,500 చొప్పున పింఛన్ ఇచ్చి, మనవడిలా సీఎం వైఎస్ జగన్ తమను ఆదుకుంటున్నారని వృద్ధులు గడప గడపకూ వెళ్లిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
మూడేళ్లలో దేవుడి దయ, మీ అందరి చల్లని చూపులతో మంచి చేశామని..ఇక ముందు కూడా ఇంకా మంచి చేస్తామని, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజాప్రతినిధులు కోరారు. మనందరి ప్రభుత్వానికి ఎప్పుడూ మా మద్దతు ఉంటుందని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముళ్లు స్పష్టం చేశారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలని అడిగి మరీ..వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ప్రజాప్రతినిధులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.