టీచర్లు చెప్పలేకపోతున్నారు.. ఎందుకంటే? | Gap Between Curriculum and its Implementation: NCERT in Andhra Pradesh Teachers | Sakshi
Sakshi News home page

టీచర్లు చెప్పలేకపోతున్నారు.. ఎందుకంటే?

Published Wed, Dec 29 2021 5:22 PM | Last Updated on Wed, Dec 29 2021 5:43 PM

Gap Between Curriculum and its Implementation: NCERT in Andhra Pradesh Teachers - Sakshi

సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ టీచర్లలో సబ్జెక్టులపై మంచి పట్టు, ఆయా అంశాల్లో లోతైన పరిజ్ఞానం ఉన్నాయి. టీచింగ్‌ మెథడాలజీపై అవగాహన  కూడా ఉంది. కానీ విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు..’ ప్రభుత్వ టీచర్ల పరిస్థితిపై నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చి అండ్‌ ట్రయినింగ్‌ (జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి–ఎన్‌సీఈఆర్టీ) విశ్లేషణ ఇది. దీనికి అనేక కారణాలున్నా అంతిమంగా పాఠ్యబోధన ద్వారా విద్యార్థుల్లో నెలకొనాల్సిన సామర్థ్యాలు, నైపుణ్యాలు నిర్దేశిత లక్ష్యాల మేరకు ఒనగూరడం లేదని తేల్చింది. దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి పాఠ్యప్రణాళికలు, సిలబస్‌ తీరుతెన్నులు, టీచర్ల నైపుణ్యాలు, విద్యార్థుల్లో సామర్థ్యాలు తదితర అనేక అంశాలపై ఎన్సీఈఆర్టీ విశ్లేషించింది. 

బోధన కంటెంట్‌ సమన్వయంలో సమస్యలు 
ఎన్‌సీఈఆర్టీ పరిధిలోని డిపార్టుమెంట్‌ ఆఫ్‌ కరిక్యులమ్‌ స్టడీస్‌ విభాగం టీచింగ్‌లో నాణ్యతను పరిశోధించడంలో భాగంగా సైన్సు టీచింగ్‌లో నాలెడ్జి, బోధనాపరమైన కంటెంట్‌ను సమన్వయం చేసుకోవడంలో టీచర్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై తరగతి గది బోధనను పరిశీలించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లోని 30 మంది టీచర్లను ఎంపిక చేసుకుంది. అందులో వచ్చిన ఫలితాలను విశ్లేషించింది. ఆ విశ్లేషణ మేరకు..

► టీచర్లలో ఎక్కువమందికి టీచింగ్‌ మెథడ్స్‌పై మంచి అవగాహన ఉంది. బోధన విధానం, సబ్జెక్టుఅంశాల్లో లోతైన పరిజ్ఞానం ఉన్నాయి. కానీ వాటిని సమన్వయం పరచుకుని బోధించడంలో వారు విఫలమవుతున్నారు.

► పాఠ్యప్రణాళికలను రూపొందించడం, వాటిని కార్యరూపంలోకి తేవడం మధ్య చాలా అంతరం ఉంది.

► టీచర్లు బోధించాలనుకున్న అంశాలకు, బోధించిన అంశాలకు మధ్య చాలా తేడా ఉంటోంది. చాలామంది టీచర్లు తాము బోధించిన అంశాలను విద్యార్థులు నేర్చుకున్నారని భావించి అంతటితో సరిపెడుతున్నారు. (అమ్మాయిల ఐఐఠీవి.. ఐఐటీల్లో ఏడేళ్లలో ప్రవేశాలు రెట్టింపు)

► బోధన సమయంలో విద్యార్థులు బోధన కాన్సెప్టులను ఏమి నేర్చుకుంటున్నారు? ఎందుకు నేర్చుకుంటున్నారన్న అంశాలను టీచర్లు పట్టించుకోవడం లేదు.

► తరగతి గదుల్లో టీచర్లు ఉపన్యాస ధోరణిలో పాఠాలు చెప్పుకొంటూ పోతున్నారు. యాక్టివిటీ ఆధారిత విద్యావిధానం అమలవుతున్నప్పటికీ ఆ కాన్సెప్టును టీచర్లు సరిగా అర్థం చేసుకోలేదు. తాము అనుసరించే మార్గం కూడా అలాంటిదే అన్న భావనతో మూసపద్ధతిలో వెళుతున్నారు. విద్యార్థులకు సరిపోయే విధంగానే తాము బోధిస్తున్నామని భావిస్తున్నారు తప్ప వారికి ఏమేరకు అవగాహన అవుతోందో గమనించడం లేదు.

► అన్ని స్కూళ్లలోను ఆంగ్లమాధ్యమ బోధనతో భాషా సమస్య ఏర్పడి విద్యార్థులు, టీచర్లకు మధ్య ఇంటరాక్షన్‌ (పరస్పర సందేహ నివృత్తి)లో అంతరం బాగా పెరిగింది.

► టీచర్లు చాలా నైపుణ్యం కలవారే అయినా క్షేత్రస్థాయిలో ఒకింత గందరగోళం వల్ల విద్యార్థులకు, వారికి మధ్య అనుసంధానం ఏర్పడక వారు చెప్పదల్చుకున్న అంశాలను విద్యార్థులకు అందించలేకపోతున్నారు.

► దీనిపై సవాళ్లను ఎదుర్కొంటున్న టీచర్లు.. విద్యార్థుల్లో అనాసక్తి, వనరులలేమి, తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్య, ఫలితాలకోసం అధికారుల నుంచి ఒత్తిడి వంటి కారణాలను చెబుతున్నారు. (APPSC: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు..)

ఏపీలో సమర్థంగా డీఈడీ అమలు 
ఆంధ్రప్రదేశ్‌లో డిప్లొమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈడీ/డీఈఎల్‌ఈడీ)ని సమర్థంగా అమలు చేస్తున్నారని ఎన్‌సీఈఆర్టీ తన నివేదికలో పేర్కొంది. డీఈడీ ఫస్టియర్, సెకండియర్‌లో వేర్వేరుగా వివిధ కోర్సులను ఎన్‌సీటీఈ ప్రవేశపెట్టగా ఏపీ దాన్ని మరింత పటిష్టం చేసి అమలు చేయిస్తోంది. పాఠ్యప్రణాళిక, సిలబస్‌లో మార్పులుచేసి ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ)ని జోడించింది. స్కూల్‌ కల్చర్, లీడర్‌షిప్‌ వంటి అంశాలను పొందుపరిచింది. ఎలిమెంటరీ స్థాయిలో కూడా బోధన విధానాలను ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. మాతృభాష బోధన,  చైల్డ్‌హుడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ పేపర్లను ప్రవేశపెట్టారని ఎన్‌సీఈఆర్టీ వివరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement