
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకేల) ద్వారా మూడేళ్లుగా గ్రామ స్థాయిలోనే రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు మరో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు దక్కింది. వ్యవసాయ రంగంలో అత్యుత్తమ విధానాలు పాటిస్తూ ఉత్పత్తి, ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్, అదనపు విలువ జోడింపు, మౌలిక సదుపాయాలు, ఎగుమతుల్లో విశేష ప్రతిభ కనబర్చిన సంస్థలకు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్‌ఏ) ఏటా ఇండియా అగ్రి బిజినెస్ అవార్డులను ప్రదానం చేస్తోంది.
2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విత్తన పంపిణీ కేటగిరీలో ఏపీ సీడ్స్‌కు ‘గ్లోబల్ అగ్రి అవార్డు–2022’ను ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను పంపిణీ చేయడంలో ఏపీ సీడ్స్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి మరీ రైతులకు సేవలందించిన ప్రభుత్వరంగ సంస్థగా ఏపీ సీడ్స్‌కు గుర్తింపు లభించింది.
గతేడాది స్కోచ్ సంస్థ సిల్వర్ స్కోచ్ అవార్డు అందించగా.. గవర్నన్స్ నౌ అనే అంతర్జాతీయ సంస్థ జాతీయ స్థాయిలో పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్Š (పీఎస్‌యూ) కేటగిరీలో గవర్నెన్స్ నౌ నేషనల్ అవార్డుకు ఎంపిక చేసింది. తాజాగా ఏపీ సీడ్స్‌ను గ్లోబల్ అగ్రి అవార్డు వరించింది. ఈ అవార్డును ఈ నెల 9న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ప్రతిష్టాత్మక అవార్డును పొందిన ఏపీ సీడ్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. విత్తన పంపిణీలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగానే ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.
మూడేళ్లలో 35 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయం మేరకు మూడేళ్లలో 50.95 లక్షల మంది రైతులకు 34.97 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను ఆర్‌బీకేల ద్వారా ఏపీ సీడ్స్ పంపిణీ చేసింది. రైతుల నుంచి సేకరించిన వరి, అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పశుగ్రాసం, పచ్చిరొట్ట విత్తనాలను ఏపీ సీడ్స్ సొంతంగా ప్రాసెస్ చేసి సబ్సిడీపై అందిస్తోంది. వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా ప్రతి సీజన్‌లోనూ 20వేల శాంపిల్స్ పరీక్షించి, వాటి నాణ్యతను ధ్రువీకరించిన తర్వాతే సీజన్‌కు ముందుగా ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతోంది.
మూడేళ్ల సేవలకు గుర్తింపుగా..
మూడేళ్లుగా ఏపీ సీడ్స్ రైతులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగానే ఈ అవార్డు దక్కింది. ఇది నిజంగా అరుదైన గౌరవం. గతంలో విత్తనాల కోసం రోజులు, నెలల తరబడి రైతులు ఎదురు చూసేవారు. ప్రస్తుతం బుక్ చేసుకున్న వెంటనే పంపిణీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రైతులకు ఏపీ సీడ్స్ చేస్తున్న సేవలకు గత ఏడాది సిల్వర్ స్కోచ్, గవర్నెన్స్ నౌ అవార్డులు దక్కాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు రావడం ఆనందంగా ఉంది.
– డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ సీడ్స్
Comments
Please login to add a commentAdd a comment