
మక్కువ : పంట కాలంలో 14 వారాల పాటు శిక్షణ ఇచ్చి రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యమని మండల వ్యవసాయాధికారి కె. తిరుపతిరావు అన్నారు. సరయ్యవలస రైతుభరోసా కేంద్రం పరిధిలోని బంగారువలసలో సోమవారం నిర్వహించిన పొలంబడి గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, ఎంపిక చేసిన పంటలో 14 వారాల పాటు 25 మంది రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. నిరంతర పంటల పరిశీలన ద్వారా మిత్ర పురుగులు, వాతావరణాన్ని పరిశీలిస్తూ అవసరమైన నిర్ణయాలపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.
గ్రామ రైతులందరూ రాబోయే ఖరీఫ్ సీజన్‌లో నిర్వహించే పొలంబడికి పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. సర్పంచ్ శంబంగి హరికృష్ణ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పచ్చిరొట్ట, పత్తి విత్తనాలు తొందరగా అందించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ టి. శ్రీరాములు, వీఏఏ త్రివేణి, రైతులు పాల్గొన్నారు.