విశాఖ జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం రూపకల్పన చేసిన సరికొత్త ప్రాజెక్టు కార్యరూపం దాల్చే దిశగా సాగుతోంది. గతంలో వేసవి వచ్చిందంటే చాలు.. విశాఖ నగరం నీటి ఎద్దడితో ఇబ్బందులను ఎదుర్కొనేది. రెండేళ్లుగా పుష్కలంగా వర్షాలు కురుస్తుండటంతో నీటి సమస్య తలెత్తలేదు. భవిష్యత్తులో నగర విస్తరణ కారణంగా నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నీటి కష్టాలు ఎదురుకాకుండా బృహత్తర ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నుంచి విశాఖకు గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు భారీ పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 220 కిలోమీటర్ల పొడవునా రూ.4,660 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ తయారీకి కార్యాచరణ సిద్ధమవుతోంది. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
మేఘాద్రిగెడ్డలో స్టోరేజ్
నీటి సరఫరా కోసం జీవీఎంసీ ఏటా రూ.120 కోట్ల వరకూ ఖర్చు చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రూ. 50 నుంచి రూ.60 కోట్ల వరకూ జీవీఎంసీకి ఆదా అవుతుంది. దీనికి తోడు భవిష్యత్తు అవసరాల కోసం స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 24/7 నీటిని అందించేలా రూపొందిస్తున్న ఈ పైప్‌లైన్ ద్వారా వచ్చే మిగులు నీటిని.. మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో స్టోరేజ్ ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పైప్‌లైన్ ద్వారా వచ్చే నీటిలో 75 శాతం వరకూ జీవీఎంసీ అవసరాలకే వినియోగించనున్నారు.
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం నగర అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు ఏలేరు నుంచి వచ్చే నీరే ప్రధాన ఆధారం. ఏలేరు కాలువ ద్వారా తరలిస్తున్న నీటిలో సుమారు 30 శాతం వరకు గండ్లు, లీకేజీలు ఆవిరి రూపంలో పోతోంది. ఈ సమస్య ఉత్పన్నమవ్వకుండా పూర్తిస్థాయిలో నీటిని తీసుకొస్తే మరిన్ని గ్రామాలకు, పరిశ్రమలకు అందించే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం.. జీవీఎంసీ ద్వారా ఈ భారీ పైప్‌లైన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మొదట్లో ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి పైప్‌లైన్ వెయ్యాలని భావించినా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం పోలవరం నుంచి నేరుగా నరవ రిజర్వాయర్ వరకు పైప్‌లైన్ వెయ్యాలని సూచించడంతో ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేపడుతున్నారు. (‘జగత్’ కంత్రీలు.. వెలుగులోకి 'భూమా'య..)
ముందుగా దీని అంచనా వ్యయం రూ.1800 కోట్లుగా నిర్ణయించగా.. ప్రాజెక్ట్ గ్రిడ్ స్వరూపం విస్తరించడంతో రూ.4,660 కోట్లకు చేరుకుంది. నీటిని అందించే గ్రామాల సంఖ్య పెరిగే కొద్దీ అంచనా వ్యయం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి 220 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు. భౌగోళిక పరిస్థితులను బట్టి 2.2 నుంచి 2.5 మీటర్ల వ్యాసార్థం ఉన్న పైపులు అమర్చుతారు. అవసరమైన ప్రాంతాల్లో పంప్ సెట్లు, సంపులు నిర్మిస్తారు. ప్రతి మండల కేంద్రంలో ఒక ట్యాపింగ్ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. గ్రామాలకు, పారిశ్రామిక అవసరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా రోజూ నీటిని అందించేలా ప్రాజెక్టు డిజైన్ చేశారు. రోజుకు 12 టీఎంసీల నీటిని ఈ పైప్‌లైన్ ద్వారా సరఫరా చెయ్యాలని భావిస్తున్నారు.
రెండు జిల్లాలు.. వెయ్యికిపైగా గ్రామాలు
ఈ భారీ నీటి సరఫరా ప్రాజెక్టు ద్వారా విశాఖ జిల్లాతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకూ ఈ నీటిని అందించనున్నారు. ఏలేశ్వరం నుంచి కాకినాడ సెజ్‌కు, తుని మున్సిపాలిటీకి, తూర్పుగోదావరి జిల్లాలోని శివారు గ్రామాలకు ఈ వాటర్ గ్రిడ్ ద్వారా నీటిని అందిస్తారు. విశాఖ జిల్లాలో పైప్‌లైన్ వచ్చాక.. నక్కపల్లి సెజ్‌కు, నక్కపల్లి, పాయకరావుపేట నగర పంచాయతీ, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలకు, విశాఖ రూరల్ మండలాల్లోని అన్ని గ్రామాలకు, మహా విశాఖ నగర పరిధిలోని ప్రాంతాలకు నీటిని అందించనున్నారు. ఆయా ప్రాంతాల్లో 2050 జనాభా, పరిశ్రమల పెరుగుదలను అంచనా వేసి ప్రాజెక్టు డిజైన్ చేశారు. (సీపీఎస్ ఉద్యోగులపై సమగ్ర నివేదిక)
ఏలేశ్వరం జలాశయం
సమగ్ర నివేదికకు కార్యాచరణ
నగర ప్రజలకు తాగునీటి బెంగ తీర్చేందుకు రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేసేందుకు వివిధ సంస్థల నుంచి జీవీఎంసీ ప్రతిపాదనలను ఆహ్వానించింది. పోలవరం నుంచి నరవ వరకూ పైప్‌లైన్‌కు అవసరమైన వివిధ శాఖల నుంచి అనుమతులూ సదరు సంస్థే తీసుకునేలా నిబంధనలు విధించింది. రిజర్వాయర్ వద్ద ఇన్‌టేక్ వెల్ నిర్మాణ గుర్తింపు, పంప్ హౌస్ నిర్మాణం, హైడ్రాలిక్ డిజైన్, వాటర్ హేమర్ స్టడీ, ఎనర్జీ ఎఫిషియన్సీ మోటర్స్ ఏర్పాటు, ఫైనాన్షియల్, ఎనకమిక్ అనాలసిస్, భూ సేకరణ, ప్రాజెక్టు అంచనాలు మొదలైనవన్నీ రూపొందించేందుకు అనుభవం ఉన్న సంస్థల నుంచి డీపీఆర్ తయారు చేసేందుకు ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ టెండర్లు దాఖలు చేసింది. టెండర్ దక్కించుకున్న సంస్థ 90 రోజుల్లో డ్రాఫ్ట్ డీపీఆర్, 105 రోజుల్లో ఫైనల్ డీపీఆర్ తయారు చెయ్యాల్సి ఉంటుంది.
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా...
విశాఖ మహా నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో 2050 నాటికి జనాభా ఎంత ఉంటుందనే దానిపై అంచనా వేస్తూ అప్పటి అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నాం. సీఎం సూచనల మేరకు ఏలేశ్వరం నుంచి కాకుండా నేరుగా పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరి జలాలు తీసుకురానున్నాం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని కమిషనర్ సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏలేరు కాలువ నుంచి వచ్చే నీటిని పూర్తిగా రైతుల అవసరాలకు వినియోగించాలని భావిస్తున్నాం. డీపీఆర్ తయారు చేసేందుకు వివిధ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. నిధుల సమీకరణపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. మెయిన్ లైన్‌లో 5 నుంచి 6 వరకూ ట్యాపింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నాం. – ఎం.వెంకటేశ్వరరావు, జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్
Comments
Please login to add a commentAdd a comment